శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైమూడవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము
ముప్పైమూడవ అధ్యాయము

 

 

 

 

ఊదీ మహిమ:
1.తేలుకాటు, ప్లేగు, జ్వరము నయమగుట. 2.జామ్నేర్ చమత్కారము. 3. నారాయణరావు జబ్బు. 4.బాలబువ సుతార్. 5. హరిభాపు కర్ణిక్ ల అనుభవములు.
మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరిద్దాము. వారి కరుణాకటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేస్తాయి. మనలోని దుర్గుణాలాను పోగొడతాయి. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధిస్తాయి. అమృతానందాన్ని ప్రసాదిస్తాయి. ఇది నాది, అది నీది, అనే భేదభావము వారి మనస్సులో పుట్టదు. వారి ఋణాన్ని ఈ జన్మలోగాని వచ్చే అధిక జన్మలలోగాని మనం తీర్చుకోలేము.
ఊదీ ప్రసాదము :

 

 

 

 


బాబా అందరి దగ్గరనుంచి దక్షిణ తీసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో అధిక భాగం దానం చేసి మిగాతాదానితో వంట చెరుకుని (కట్టెలను) కొంటుండేవారు. ఈ కట్టెలను బాబా దునిలో వేస్తుండేవారు. దాన్ని నిత్యం మంట పెడుతూ ఉండేది. అది ఇప్పటికీ అలాగే మండుతున్నది. అందులోని బూదిడనే ఊదీ అంటున్నాము. బాబా దాన్ని భక్తులకు తమతమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నప్పుడు పంచి పెట్టేవారు.
ఊదీ వలన బాబా ఏమి బోధించే ఉద్దేశించారు? ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిదలా అశాశ్వతాలు. పంచభూతములతో చేయబడిన మన శరీరాలన్నీ సౌఖ్యములను అనుభవించిన తరువాత పతనమైపోయి బూడిద అవుతుంది. ఈ సంగతి జ్ఞాపకానికి తీసుకురావడానికి బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచి పెడుతూ ఉండేవారు. ఈ ఊదీవల్లనే బ్రహ్మము నిత్యం అనీ, ఈ జగత్తు అశాశ్వతమనీ, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారనీ బాబా బోధించారు. ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్తాము. ఊదీ అనేక  విధాల శారీరక మానసిక రోగాలను బాగు చేస్తుండేవి. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యాలకు గల తారతమ్యం, అనిత్యమైన దానిలో అభిమానరాహిత్యం గంట మాటలా వినిపిస్తూఉండేది. మొదటిది (ఊదీ) వివేకాన్ని, రెండవది (దక్షిణ) వైరాత్యాన్ని బోధించుతుండేవి. ఈ రెండూ కలిగి వున్నా కాని సంసారమనే సాగరాన్ని దాటలేము. అందుకే బాబా అడిగి దక్షిణ తీసుకుంటూ ఉండేవారు. షిరిడీనుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదంగా యిచ్చి, కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తాన్ని వారి శిరస్సుపై ఉంచుతుండేవారు. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుతూ ఉండేవారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుతుండేవారు. దాని పల్లవి "కళ్యాణరామ రారమ్ము! గోనెలతో ఊదీని తేతెమ్ము!'' బాబా దీన్ని చక్కని రాగంతో మధురంగా పాడుతూ ఉండేవారు.
ఇదంతా ఊదీ యొక్క అధ్యాత్మిక ప్రాముఖ్యం. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా ఉంది. అది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని,ఆతృతల నుండి విమోచనం మొదలైనవి ఒసగుతూ ఉండేవి. ఇక ఊదీ గురించిన కథలను ప్రారంభిస్తాము.
తేలుకాటు :

 

 

s

 


నాసిక్ నివాసి అయిన నారాయణ మోతీరాంజాని అనే అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అనే బాబా భక్తుని దగ్గర ఉద్యోగం చేస్తుండేవాడు. అతడు ఒకసారి తానతల్లితో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని, తాను సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చెప్పారు. కొన్ని రోజుల తరువాత బాబా మాట సత్యమయ్యాయి. నారాయణ జాని ఉద్యోగాన్ని మాని స్వయంగా 'ఆనందాశ్రమం' అనే హోటలు పెట్టుకున్నాడు. అది బాగా అభివృద్ధి చెందింది. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టింది. దాని బాధ భరింపరానంతగా ఉండింది. అటువంటి విషయాలలో ఊదీ బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్నచోట ఊదీని రాయాలి. అందుకే నారాయణరావు ఊదీ కోసం వెదికాడు. కాని అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందు నిలబడి బాబా సహాయాన్ని కోరి, బాబా నాం జపం చేసి, బాబా పటం ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడు తీసి దాన్ని ఊదీగా భావించి, నొప్పి ఉన్నచోట రాసాడు. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయింది. ఇద్దరూ ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు.
ప్లేగు జబ్బు :

 

 

 

 


ఒకానొకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తుడికి, వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతుందని తెలిసింది. అతడు తన దగ్గర ఊదీ లేదనీ, కాబట్టి ఊదీ పంపమని నానాసాహెబు చాందోర్కరుగారికి కబురు పంపారు. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషన్ దగ్గర తెలిసింది. అప్పుడతడు భార్యతో కలిసి కళ్యాన్ వెళ్తున్నాడు. వారి దగ్గర అప్పుడు ఊదీ లేకపోయింది. కాబాట్టి నానాసాహెబు రోడ్డుపై ఉన్న మట్టిని కొంచెం తీసి, సాయి నామ జపం చేసి, బాబా అనుగ్రహాన్ని అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసారు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూసాడు. ఆ భక్తుడు ఇంటికి వెళ్ళేసరికి మూడు రోజులనుండి బాధపడుతున్న అతని కుమార్తె జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటినుండి తగ్గిందని విని అమితంగా సంతోషించాడు.
జామ్నేర్ లీల :

 

 

 

 


1904 - 1905 సంవత్సరంలో నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్ లో మామలతదారుగా ఉన్నాడు. ఇది ఖాందేషు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉంది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి; ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఆమె స్థితి బాగా లేకుండా వుంది. ఆమె రెండుమూడు రోజుల నుంచి ప్రసవవేదన పడుతూ ఉంది. నానాసాహెబు ఔషదాలన్నీ వాడాడు కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు బాబాను జ్ఞాపకానికి తెచ్చుకుని వారి సహాయాన్ని వేడుకున్నాడు. షిరిడీలో రామ్ గీర్ బువా అనే సన్యాసి ఉన్నాడు. బాబా అతన్ని 'బాపూగీర్ బువా'' అనేవారు. అతని స్వగ్రామం ఖాందేషులో ఉంది. అతడు అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యంలో జామ్నేర్ లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబుకు ఊదీని, హారతి పాటను యివ్వమన్నారు. తన దగ్గర రెండే రూపాలున్నాయని అవి జలగామ్ వరకు రైలు టిక్కెట్టుకు సరిపోతాయనీ, కాబట్టి జలగామ్ నుండి జామ్నేర్ వెళ్ళడానికి (సుమారు 30 మైళ్ళు) ధనం లేదని రామ్ గీర్ బువా చెప్పాడు. అన్నీ సరిగా అమరుతాయి కాబట్టి, అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికారు. శ్యామాను పిలిచి మాధవ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమన్నారు. హారతి పాటను ఊదీని రామ్ గీర్ బువాకి యిచ్చి నానాసాహెబుకు అందజేయమన్నారు. బాబా మాటలపై ఆధారపడి రామగీర్ బువా షిరిడీ విడిచి, రాత్రి రెండున్నర గంటలకు జలగామ్ చేరుకున్నాడు. అక్కడికి చేరుకునేటప్పటికి అతని దగ్గర 2 అణాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి కష్టదశలో ఉన్నాడు.

 

 

 

 

అప్పుడే ఎవరో "బాపూగీర్ బువా ఎవరు?'' అని కేకలు వేస్తున్నారు. బువా అక్కడికి వెళ్ళి తనే అని చెప్పాడు. నానాసాహెబు పంపించారని చెపుతూ, ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. దానికి రెండు మంచి గుఱ్ఱాలను కట్టి ఉన్నాయి. ఇద్దరూ అందులో కూర్చుని బడిని వదిలారు. టాంగా వేగంగా వెళ్ళింది. తెల్లవారుఝామున టాంగా ఒక సెలయేరు దగ్గరకు చేరుకుంది. బండి తోలేవాడు గుఱ్ఱాలకు నీళ్ళు త్రాగించదానికి వెళ్ళాడు. బంట్రోతు రామ్ గీర్ బువాను ఫలహారం చేయమని, ఫలహారపు దినుసులను పెట్టాడు. గడ్డము, మీసాలు ఉన్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్ గీర్ బువా అతడు మహామ్మదీయుడని సంశయించి ఫలహారాన్ని తినకుండా కూర్చున్నాడు. కాని ఆ బంట్రోతు తాను హిందువుననీ, గర్ వాల్ దేశపు క్షత్రియుడినానీ, నానాసాహెబు ఆ ఫలహారాన్ని పంపారు కాబట్టి, తినడానికి ఎలాంటి సంశయం వలదని చెప్పాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఫలహారాన్ని చేసి బయలుదేరారు. ఉషః కాలంలో జామ్నేర్ చేరుకున్నారు. ఒంటికి పోసుకోవడానికి రామ్ గీర్ బువా టాంగా దిగి రెండు మూడు నిముషాలలో వచ్చాడు. తిరిగి వచ్చేసరికి టాంగాగాని, టాంగా తోలేవాడు గాని, బంట్రోతుగాని లేరు. బాపుగీర్ బువా నోటివెంట మాటరాలేకపోయింది.

 

 

 

 

దగ్గరున్న కచేరికీ వెళ్ళి అడగగా నానాసాహెబు ఇంటి దగ్గరే ఉన్నట్టు తెలిసింది. అతడు నానాసాహెబుగారి ఇంటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా దగ్గరనుండి వచ్చినట్లు చెప్పాడు. బాబా ఇచ్చిన ఊదీ, హారతి పాట నానాసాహెబుకు అందజేశాడు. మైనతాయి చాలా దుస్థితిలో ఉండింది. అందరూ ఆమె గురించి అత్యంత ఆందోళన పడుతూ ఉన్నారు. నానాసాహెబు తన భార్యను పిలిచి ఊదీని నీళ్ళలో కలిపి కుమార్తెకు ఇచ్చి హారతిని పాడమన్నారు.బాబా మంచి సమయంలో సహాయం పంపారు అనుకున్నారు. కొద్ది నిముషాలలో ప్రసవం సుఖంగా జరిగిందని వార్త వచ్చింది. గండము గడచిందని చెప్పారు. నానాసాహెబుగారు టాంగాను, నౌకరును, ఫలహారాలను పంపినందుకు బాపుగీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు అమితంగా ఆశ్చర్యపడ్డాడు. షిరిడీ నుంచి ఎవ్వరు వస్తున్నదీ తనకు తెలియదని, కాబట్టి అతడు ఏదీ పంపించలేదని చెప్పారు.
బి.వి. దేవ్ గారి విషయమై నానాసాహెబు చాందోర్కరు కొడుకు బాపూరావు చాందోర్కరు, రామ్ గీర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మాగజైన్ లో (xiii - 11, 12, 13) గొప్ప వ్యాసాన్ని ప్రకటించినవారు బి.వి. నరసింహస్వామిగారు మైనతాయి. బాపూరావు చాందోర్కరు, రామ్ గీర్ బువాల వాంగ్మూలాన్ని సేకరించి "భక్తుల అనుభవాలు'' అనే గ్రంథాన్ని (3వ భాగం) ప్రకటించారు.

 

 

 

 


భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. బాబా సమాధి చెందిన మూడేళ్ళకు షిరిడీకి వెళ్ళాలనుకున్నారు. కాని పోలేకపోయారు. బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బు పడి అమితంగా బాధపడుతూ ఉన్నాడు. సాధారణ చికిత్సవలన ప్రయోజనం కలగలేదు. కాబట్టి రాత్రింబవళ్ళు బాబాను ధ్యనించారు. ఒకరోజు స్వప్నంలో ఒక దృశ్యాన్ని చూశారు. అందులో బాబా అతనిని ఓదార్చి ఇలా అన్నారు "ఆందోళన పడవద్దు. రేపటినుంచి బాగవుతుంది. వరం రోజులలో నడవగలవు'' స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరింది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయమిది. "శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉన్నారా? శరీరం పోయింది కాబట్టి చనిపోయారా?'' లేదు. ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జననమరణాలుకు అతీతులు. ఎవరయితే బాబాను ఒకసారి హృదయ పూర్వకంగా ప్రేమిస్తారో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎలాంటి సమయంలో గాని బాబా నుండి తగిన జవాబు పొందుతారు. వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉంటారు. ఏ రూపంలోనో భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేరుస్తారు.
బాలబువ సుతార్ :

 

 

 

 


బొంబాయిలో ఉండే ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చాడు. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవధ్యానం-భజనలోనే తత్పరుడై ఉండేవాడు. అందుకే జనాలు వారిని 'నవయుగ తుకారామ్' అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా  బాబా "నేను ఇతనిని నాలుగు సంవత్సరాల నుండి ఎరుగుదును'' అన్నారు. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడు అవడంతో బాలబువా ఇదెలా సంభవం అనుకున్నాడు. కాని తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్టు జ్ఞాపకం వచ్చింది. అతడు బాబా మాటల ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు "యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు? తమ భక్తుల పట్ల వారికి ఎంత ప్రేమ? నేను వారి ఫోటోను చూడటం వారిని స్వయంగా చూసిన దానితో సమానమని నాకు బోధించారు.''
అప్పా సాహెబు కులకర్ణి :

 

 

 

 


1917వ సంవత్సరంలో అప్పాసాహెబు కులకర్ణి వంతు వచ్చింది. అతడు ఠాణాకు బదిలీ అయ్యారు. బాలాసాహెబు భాటే అతనికి బాబా ఫోటో యిచ్చి ఉన్నాడు. అతడు దాన్ని జాగ్రత్తగా పూజిస్తూ ఉండేవాడు. పువ్వులు, చందనం, నైవేద్యం బాబాకు నిత్యం అర్పించుతూ బాబాను చూడాలని అమితంగా కాంక్షిస్తూ ఉండేవాడు. ఈ సందర్భంలో బాబా పటాన్ని మనస్ఫూర్తిగా చూస్తే బాబాను ప్రత్యక్షంగా చూసినదానితో సమానమే అని చెప్పవచ్చును. (దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ).
కులకర్ణి ఠాణాలో ఉండగా భీవండి పర్యటనకు వెళ్ళవలసి వచ్చింది. ఒక వారం రోజుల లోపల తిరిగి రావడానికి అవకాశం లేకపోయింది. అతడు లేనప్పుడు మూడవరోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి ఇంటికి వచ్చారు. వారి ముఖలక్షణాలు సాయిబాబా ముఖలక్షణాలతో సరిపోయాయి. కులకర్ణిగారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబాగారా అని అడిగారు. వారు ఇలా సమాధానం చెప్పారు : "లేదు, నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను'' అలా అంటూ దక్షిణ అడిగారు. ఆమె ఒక రూపాయి ఇచ్చింది. వారొక చిన్న పోట్లతో ఊదీని యిచ్చి, దాన్ని పూజలో ఫోటోతో పాటు ఉంచుకొని పూజించమని చెప్పారు. తరువాత ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇక చిత్రమైన సాయిలీలలను వినండి.

 

 

 

 


బీవండీలో తన గుఱ్ఱం జబ్బు పడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకోవలసి వచ్చింది. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరుకున్నారు. ఫకీరుగారు రాక భార్యవల్ల విన్నారు. ఫకీరుగారి దర్శనం దొరకనందుకు అమితంగా మనోవేదన పొందారు. ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా ఇవ్వడం ఇష్టపడలేదు. తానె యింటిలో ఉన్నట్లయితే 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండేవాడిని అని అన్నాడు. వెంటనే ఫకీరును వెదకడానికి బయలుదేరారు. మసీదులలోనూ, తక్కిన చోట్లను భోజనం చేయకుండా వారి కొరకు వెదికారు. అతని అన్వేషణ నిష్ఫలమయ్యింది. ఇంటికి వచ్చి భోజనం చేశారు. 32వ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పింది చదివేవాళ్ళు గమనించాలి. అప్పాసాహెబు ఇక్కడ ఒక నీతిని నేర్చుకున్నారు. భోజనం అయిన తరువాత చిత్రే అనే స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరారు. కొంత దూరం వెళ్లగా ఎవరో వారి వైపు త్వరగా వస్తున్నట్టు కనిపించింది. వారి ముఖలక్షణాలను బట్టి వారు తన యింటికి 12 గంటలకు వచ్చినవారే అని అనుకున్నారు. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగారు. అప్పాసాహెబు ఒక రూపాయిని యిచ్చారు. వారు తిరిగి అడగగా ఇంకా రెండు రూపాయలు ఇచ్చారు. అప్పటికీ అతడు సంతృప్తి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే దగ్గరనుండి మూడు రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చారు. వారు ఇంకా దక్షిణ కావాలని అన్నారు. అప్పాసాహెబు వారిని యింటికి రావలసిందిగా వేడుకున్నారు. అందరూ ఇల్లు చేరారు. అప్పాసాహెబు వారికి 3 రూపాయలు ఇచ్చారు. మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టాయి. అప్పటికీ సంతృప్తి చెందక ఫకీరు ఇంకా దక్షిణ ఇమ్మని అడిగారు. అప్పాసాహెబు తన దగ్గర పదిరూపాయల నోటు ఉందని అన్నారు. ఫకీరు దాన్ని పుచ్చుకుని తొమ్మిది రూపాయలు తిరిగి యిచ్చివేసి అక్కడనుండి వెళ్ళిపోయారు.

 

 

 

 

అప్పాసాహెబు పదిరూపాయలు ఇస్తానన్నారు కనుక ఆ మొత్తాన్ని తీసుకుని పవిత్రపరిచిన తరువాత తొమ్మిది రూపాయలను యిచ్చి వేశారు. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధభక్తులను తెలియజేస్తుంది. (బాబా లక్ష్మీబాయి శిందేకి 9 రూపాయలు సమాధి సమయంలో యిచ్చారు.) అప్పాసాహెబు ఊదీ పొట్లాన్ని విప్పి చూశారు. అందులో పువ్వురేకులు అక్షింతలు ఉన్నాయి. కొంతకాలం తరువాత బాబాను షిరిడీలో దర్శించుకున్నప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కింది. అతడు ఊదీ పొట్లాన్ని, వెంట్రుకను, ఒక తాయేట్టులో పెట్టి తన దండపై కట్టుకున్నారు. అప్పాసాహెబు ఊదీ ప్రభావాన్ని గ్రహించారు. అతడు అత్యంత తెలివాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుతుండేవి. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కన్నా ఎన్నో రెట్లు ఆదాయం వచ్చింది. మంచి పలుకుబడీ, అధికారం లభించింది. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అవుతూ ఉంది. కాబట్టి బాబా ఊదీని పొందే భాగ్యం కలవారు స్నానం చేసిన తరువాత ఊదీని నుదుట రాసుకొని, కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకోవాలి.
హరిభావ్ కర్ణిక్ :

 

 

 

 


ఠాణా జిల్లా దహను గ్రామం నుండి హరిభావ్ కర్ణిక్ అనే అతడు 1917వ సంవత్సరంలో గురుపౌర్ణమి రోజు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించారు; వస్త్రాలను, దఖిన సమర్పించారు. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగారు. అప్పుడే యింకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వాలని తోచి మసీదు మళ్ళీ ఎక్కుతుండగా, బాబా సెలవు పొందిన తరువాత తిరిగి వెనుకకు రాకూడదని విని యింటికి బయలుదేరారు. మార్గమధ్యంలో నాసిక్ లో కాలారాముని మందిరంలో ప్రవేశించి, దర్శనం చేసుకొని బయటికి వస్తుండగా నరసింగ మహారాజ్ అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి, హరిభావ్ ముంజేతిని పట్టుకుని "నా రూపాయి నాకు ఇవ్వు'' అన్నారు. కర్ణిక్ ఎంతో ఆశ్చర్యపడ్డారు. రూపాయిని సంతోషంగా యిచ్చి, సాయిబాబాకు ఈ విధంగా తాను ఇవ్వాలని నిశ్చయించుకున్న రూపాయిని నరసింగ మహారాజ్ ద్వారా గ్రహించారు అనుకున్నారు.
యోగీశ్వరులు అందరూ ఒక్కటే అనీ ఏకాత్మతాభావంతో కార్యం ఒనర్చుతారని ఈ కథ తెలుపుతుంది.

ముప్పైరెండవ అధ్యాయం సంపూర్ణం