శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైఒకటవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సోమవారము
శ్రీసాయిసచ్చరిత్రము
ముప్పైఒకటవ అధ్యాయము
ఐదవ రోజు పారాయణము
సోమవారము
బాబా సముఖమున మరణించినవారు :
1. సన్నాసి విజయానంద్ 2. బాలారామ్ మాన్ కర్ 3. నూల్కర్ 4. మేఘశ్యాముడు 5. పులి
ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందటం గురించి హేమాడ్ పంతు వర్ణిస్తున్నారు.
మరణకాలంలో మనస్సులో ఉన్న కోరికగాని, ఆలోచనగానీ ఆ వ్యక్తి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయములో 5-6 శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. "ఎవరయితే వారి అంత్యదశలో నన్ను జ్ఞాపకం ఉంచుకుంటారో వారు నన్ను చేరుతారు. ఎవరయితే ఏదో మరొక దాన్ని ధ్యానిస్తారో, వారు దాన్నే పొందుతారు.'' అంత్యకాలంలో మనం మంచి ఆలోచనలే మనస్సులో ఉంచుకోగలమనే నిశ్చయం లేదు. అనేకమంది అనేక కారణాల వల్ల భయపడి అదిరి పోతారు. కాబట్టి అంత్య సమయంలో మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచనలోనే నిలుపుకోవాలంటే నిత్యం దాన్ని అభ్యసించటం అవసరం. భగవంతుని ధ్యానం చేస్తూ జ్ఞాపకంలో ఉంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినట్లయితే, మరణకాలంలో గాభరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధిస్తూ ఉంటారు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేస్తారు. ఎలాగంటే సర్వజ్ఞులైన యోగులు దారి చూపి, అంత్యకాలంలో సహాయం చేస్తారని వారి నమ్మకం. అటువంటివి కొన్ని ఇక్కడ చెపుతాము.
1. విజయానంద్ :
విజయానంద్ అనే మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరానికి యాత్రార్థియై బయలుదేరాడు. మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగారు. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి అయిన సోమదేవస్వామిని కలుసుకున్నారు. మానససరోవరం యాత్ర గురించి వివరాలను కనుక్కున్నారు. మానససరోవరం గంగోత్రీకి 500 మైళ్ళపైన ఉన్నదని, ప్రయాణంలో కలిగే కష్టాలన్నిటిని ఆ స్వామి వర్ణించారు. మంచు ఎక్కువ అని భాష ప్రతి 50 క్రోసులకు మారుననీ భూటాన్ ప్రజల సంశయ నిజాన్ని, వారు యాత్రికులను పెట్టె కస్టాలు మొదలవి వారికి చెప్పారు. దీన్ని విని సన్యాసి నిరాశచెంది యాత్రను మానుకున్నారు. అతడు బాబా దగ్గరకు వెళ్ళి సాష్టాంగనమస్కారం చేయగా బాబా కోపగించి ఇలా అన్నారు. "ఈ పనికిమాలిన సన్యాసిని తరిమి వేయండి. అతని సాంగత్యం మనకు ఉపయుక్తము కాదు'' సన్యాసికి బాబా నైజం తెలియకపోవడంతో అసంతృప్తి చెందారు. కూర్చుని జరుగుతున్న విషయాలన్నింటినీ గమనిస్తూ ఉన్నాడు. అది ఉదయం జరిగే దర్బారు సమయం. మసీదు భక్తులతో కిక్కిరిసి ఉండింది. వారు బాబాను అనేక విధాలుగా పూజిస్తూ ఉన్నారు. కొందరు వారి పాదాలకు అభిషేకం చేస్తున్నారు. వారి బొటనవ్రేలు నుండి తీర్థాన్ని కొందరు త్రాగుతూ ఉన్నారు. కొందరు దాన్ని కళ్ళకు అద్దుకుంటూ ఉన్నారు. కొందరు బాబా శరీరానికి అత్తరు, చందనాలను పూస్తూ ఉన్నారు. జాతిమత భేదాలు లేక అందరూ సేవ చేస్తూ ఉన్నారు. బాబా తనను కోపగించుకున్నప్పటికీ అతనికి బాబాలో ప్రేమ కలిగింది. కాబట్టి అతనికి ఆ స్థలం విడిచి పెట్టడానికి ఇష్టం లేకపోయింది.
అతడు షిరిడీలో రెండు రోజులు ఉన్న తరువాత తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసునుండి ఉత్తరం వచ్చింది. విసుగుచెంది అతడు తన తల్లి దగ్గరకి వెళ్ళాలనుకున్నాడు. కాని బాబా ఆజ్ఞా లేనిదే షిరిడీ విడవలకపోయాడు. ఉత్తరం తీసుకొని బాబా దర్శనం కోసం వెళ్ళాడు. ఇంటికి వెళ్ళడానికి బాబా ఆజ్ఞ వేడుకున్నాడు. సరజ్నుడైన బాబా, ముందు జరగబోతున్నది గ్రహించి "నీ తల్లిని అంత ప్రేమిచేవాడివయితే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు? కాషాయవస్త్రాలు ధరించేవాడికి దేనిలోనూ అభిమానం చూపటం తగదు. నీ బసకు వెళ్ళి హాయిగా కూర్చో. ఓపికతో కొద్ది రోజులు కూర్చో. వాడాలో ఎక్కువ దొంగలున్నారు. తలుపు గడియవేసుకుని జాగ్రత్తగా ఉండు. దొంగలు అంతా దోచుకుని పోతారు. ధనం ఇష్వరం మొదలైనవి నిత్యం కావు. శరీరం శిథిలమై చివరికి నశిస్తుంది. దీన్ని తెలుసుకొని, నీ కర్తవ్యాన్ని చేయి. ఇహలోక పరలోక వస్తువులన్నిటిలో గల అభిమానాన్ని విడిచి పెట్టు.ఎవరయితే ఈ ప్రకారంగా చేసి హరియోక్క పాదాలను శరణు వేడుకుంటారో, వారు సకల కష్టాలనుండి తప్పించుకొని మోక్షాన్ని పొందుతారు.
ఎవరయితే భక్తిప్రేమాలతో భగవంతుని ధ్యానం చేసి మననం చేస్తారో వారికి దేవుడు పరిగెత్తికు వెళ్ళి సహాయం చేస్తాడు. నీ పూర్వపున్యం ఎక్కువ అవటంతో నీవు ఇక్కడికి రాగలిగావు. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని చూడు. కోరికలు లేనివాడవై రేపటినుండి భాగవతాన్ని పారాయణ చేయి. శ్రద్ధతో మూడు సప్తాహములను చేయి. భగవంతుడు సంతృప్తి చెంది నీ విచారాలను తొలగిస్తాడు. నీ భ్రమలు నిష్క్రమిస్తాయి. నీకు శాంతి కలుగుతుంది'' అన్నారు. అతని మరణం సమీపించటంతో బాబా అతనికి ఈ విరుగుడుని ఉపదేశించారు. బాబా కూడా తన దేహావసాన సమయంలో మ్రుత్యుదేవతకు ప్రీతి కలిగించే 'రామవిజయము' చదివించారు. ఆ మరుసటి ఉదయం స్నానం మొదలైనవి ఆచరించిన తరువాత విజయానందుడు భాగవతాన్ని లెండి తోటలో ఏకాంతంలో చదవటం ప్రారంభించారు. రెండు పారాయణాలు చేయగానే అలసిపోయారు. వాడాకు వచ్చి రెండు రోజులు ఉన్నారు. మూడవ రోజున ఫకీరు (బడే) బాబా తొడపై ప్రాణాలను వదిలారు. బాబా ఒక రోజంతా శవాన్ని అలాగే ఉంచమన్నారు. తరువాత పోలీసువాళ్ళు వచ్చి విచారణ జరిపి శవసంస్కారాన్ని కావించారు. యథోచితంగా శరీరాన్ని తగిన స్థలంలో పూడ్చిపెట్టారు. ఈ విధంగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడ్డారు.
2. బాలారామ్ మాన్ కర్ :
బాలారామ్ మాన్ కర్ అనే గృహస్థుడు ఒకడు బాబా భక్తుడుగా ఉండేవాడు. అతని భార్య చనిపోయింది. అతడు విరక్తిచెంది కొడుకుని గృహ భారాన్ని అప్పగించి షిరిడీ వచ్చి బాబాతో ఉన్నాడు. అతని భక్తికి బాబా మెచ్చుకుని, అతనికి సద్గతి కలగచేయాలని ఈ క్రింది విధంగా చేశారు. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగడ్ లో ఉండమన్నారు. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగడ్ లో ఉండటానికి అతనికి ఇష్టం లేకపోయింది. కాని యిదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించారు. అక్కడ రోజుకు మూడుసార్లు ధ్యానం చేయమన్నారు. బాబా మాటలలో నమ్మకాన్ని వుంచి మాన్ కర్ మచ్చింద్రగడ్ వచ్చారు. అక్కడి చక్కని దృశ్యాన్ని, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి సంతోషించి, బాబా సెలవిచ్చిన ప్రకారం అత్యంత తీవ్రంగా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తరువాత ఒక దృశ్యం కనుగొన్నారు. సాధారనగా భక్తులు సమాధిస్థితిలో దివ్యానుభవాలను పొందుతారు. కాని మాన్ కర్ విషయంలో అలాకాక చైతన్యానికి వచ్చిన తరువాత దివ్యదర్శనం లభించింది. అతనికి బాబా సాయంగా కనిపించారు. మాన్ కర్ బాబాను చూడటమే కాక తనను అక్కడికి ఎందుకు పంపావు అని అడిగారు. బాబా ఇలా చెప్పారు.
"షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సులో లేచాయి. నీ చంచల మనస్సుకు నిలకడ కలగచేయాలని ఇక్కడికి పంపాను. నీవు పంచేంద్రియాలతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించావు. నేను ఎల్లప్పుడూ శిరిడీలోనే ఉంటాను అనుకున్నావు. ఇప్పుడు నీవు ఇక్కడ చూసిన నా రూపం షిరిడీలో చూసిన నా రూపంతో సమానంగా ఉన్నదో లేదో నిర్థారించు. ఇందుకే నిన్ను ఇక్కడికి పంపించాను.'' కొంతకాలం గడిచిన తరువాత మాన్ కర్ మచ్చింద్రగడ్ విడిచి బాంద్రాకు ప్రయాణమయ్యారు. పూనా నుండి దాదరుకు రైలులో వెళ్ళాలని అనుకున్నారు. టికెట్టు కోసం బుకింగ్ ఆఫీసుకు వెళ్లగా అది అత్యంత రద్దీగా కిక్కిరిసి ఉంది. అతనికి టికెట్టు దొరకలేదు. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరివాడు వచ్చి "మీరు ఎక్కడికి వెళ్తున్నారు'' అని అడిగాడు. దాదరుకు అని మాన్ కర్ బదులు చెప్పారు. అతడు ఇలా అన్నాడు "దయచేసి నా దాదరు టికెట్టు తీసుకోండి. నాకు అవసరమైన పని ఉండటంతో దాదరుకు వెళ్లటం మానుకున్నాను'' టికెట్టు లభించినందుకు మాన్ కర్ ఎంతో సంతోషించారు. జేబులోనుంచి పైకం తీసే లోపలే ఆ జానపదు అంతర్థానమయ్యాడు. మాన్ కర్ ఆ గుంపులో అతనికోసం వెతికారు. కాని లాభం లేకపోయింది. అతని కోసం బండి కదిలే వరకూ ఆగారు. కాని అతని జాడ కానరాకపోయింది. మాన్ కర్ కు కలిగిన వింత అనుభవాలలో ఇది రెండవది. ఇంటికి వెళ్ళివచ్చి తిరిగి మాన్ కర్ షిరిడీ చేరుకున్నారు. అప్పటినుంచి శిరిడీలోనే బాబా పాదాలను ఆశ్రయించి ఉన్నారు. వారి సలహాలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. చివరికి బాబా సముఖంలో వారి ఆశీర్వాదాలతో ఈ ప్రపంచాన్ని విడిచినందువలన అతడు ఎంతో అదృష్టవంతుడు అని చెప్పవచ్చును.
3. తాత్యాసాహెబు నూల్కర్ :
తాత్యాసాహెబు నూల్కర్ గురించి హేమాడ్ పంతు ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేశారని మాత్రం చెప్పారు. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతాన్ని గ్రహించాము.
1909 సంవత్సరంలో తాత్యాసాహెబు పండరీపురంలో సబ్ జడ్జీగా ఉండేవారు. అప్పుడు నానాసాహెబు చాందోర్కరు అక్కడ మామలతదారుగా ఉన్నారు. ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుతూ ఉండేవారు. తాత్యాసాహెబుకు యోగుల పట్ల నమ్మకం లేకపోయింది. నానాసాహేబుకు వారంటే అత్యంత ప్రేమ. అనేక పర్యాయాలు నానాసాహెబు, నూల్కర్ కు బాబా లీలలను చెప్పి షిరిడీకి వెళ్ళి వారి దర్శనం చేసుకోమని బలవంత పెట్టారు. చివరికి రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకున్నారు. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకాలి. రెండవది బహుకరించడానికి చక్కని నాగపూరు కమలాఫలాలు దొరకాలి. భగవత్కటాక్షంతో ఈ రెండూ తటస్థించాయి. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు దగ్గరకు రాగా అతడు వాణ్ణి తాత్యాసాహెబు నూల్కర్ దగ్గరికి పంపారు. ఎవరోగాని వంద కమలాఫలాలను నూల్కర్ కు పంపారు. రెండు షరతులు నెరవేరటంతో తాత్యాసాహెబు షిరిడీకి తప్పక వెళ్ళవలసి వచ్చింది. మొట్టమొదట బాబా అతనిపై కోపగించుకున్నారు. క్రమంగా బాబా అవతారపురుషుడు అని తగిన నిదర్శనాలు తాత్యాసాహెబు నూల్కర్ కు లభించాయి. కాబట్టి అతడు బాబా పట్ల మక్కువపడి తన అంత్యదశవరకు శిరిడీలోనే ఉన్నాడు. తన అంత్యదశలో మతగ్రంథాల పారాయణ విన్నారు. చివరి సమయంలో బాబా పాదతీర్థాన్ని అతనికి ఇచ్చారు. అతని మరణవార్త విని బాబా ఇలా అన్నారు "అయ్యో! తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయారు. అతనికి పునర్జన్మ లేదు''
4. మేఘశ్యాముడు :
28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పాము. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులు అందరూ శవం వెంట వెళ్ళారు. బాబా కూడా వెంబడించారు. బాబా అతని శవంపై పువ్వులు చల్లారు. దహనసంస్కారాం అయిన తరువాత బాబా కంట నీళ్ళు కారాయి. సాధారణ మానవునిలా బాబా చింతావిచారగ్రస్తుడైనట్లు కనిపించారు. శవాన్ని అంతా పూలతో కప్పి దగ్గరి బంధువుళా ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చారు.
యోగులు అనేకులు భక్తులకు సద్గతి ఇవ్వటం వింటాం. కాని బాబా గొప్పదనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతి పొందింది ఆ కథయే ఇప్పుడు చెపుతాను.
5. పులి :
బాబా సమాధి చెందటానికి 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగింది. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందు ఆగింది. ఆ బండిపై ఇనుపగొలుసులతో కట్టి ఉంచిన పులి ఉంది. దాని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి ఉంది. దాన్ని ముగ్గురు దర్వీషులు పెంచుతూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకుంటూ ఉండేవారు. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతున్నది. అన్ని విధాల ఔషధాలను వాడారు. కాని వారి ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. బాబా కీర్తి విని వారు దాన్ని షిరిడీకి తీసుకొని వచ్చారు. దాన్ని గొలుసులతో పట్టుకుని ద్వారం దగ్గర నిలబెట్టి, దర్వీషులు బాబా దగ్గరికి వెళ్ళి దాని విషయం అంతా బాబాకు చెపారు. అది చూడటానికి భయంకరంగా వుండీ జబ్బుతో బాధపడుతూ ఉండింది. అందుకే అది అత్యంత చికాకు పడుతూ ఉంది. భయాశ్చర్యాలతో ప్రజలందరూ దానివైపు చూస్తూ ఉన్నారు. బాబా దాన్ని తన దగ్గరికి తీసుకొని రమ్మన్నారు. అప్పుడు దాన్ని బాబా ముందుకు తీసుకొని వెళ్లారు. బాబా కాంతికి తట్టుకోలేక అది తల వాల్చింది. బాబా దానివైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూసింది. వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివితప్పి క్రిందపడి చచ్చిపోయింది. అది చావడాన్ని చూసి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిపోయారు. కొంతసేపటికి వారికితెలివి కలిగింది. ఆ జంతువు రోగంతో బాధపడుతూ చావడానికి సిద్దంగా ఉండటంతో అది బాబా సముఖంలో వారి పాదాలవద్ద ప్రాణాలు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించారు. అది వారికి బాకీపడి ఉండింది. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదాలచెంత ప్రాణాలు విడిచింది. యోగుల పాదాల దగ్గర వినమృలై ప్రాణాలు విడిచేవారు రక్షింపబడతారు. వారెంతో పుణ్యం చేయనిదే వారికి అలాంటి సద్గతి ఎలా కలుగుతుంది?
ముప్పైఒకటవ అధ్యాయం సమాప్తం