శ్రీసాయిసచ్చరిత్రము నాలుగవ అధ్యాయము
శ్రీసాయిసచ్చరిత్రము
నాలుగవ అధ్యాయము
భగవద్గీత చతుర్థ అధ్యాయములో 7-8 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా సెలవిచ్చారు "ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను. సన్మార్గులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మస్థాపన కొరకు, యుగయుగాలలో అవతరిస్తాను'' ఇదే భగవంతుని కర్తవ్యకర్మ. భగవంతుని ప్రతినిధులుగా యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వహిస్తారు. ద్విజులుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారు తమ కర్మలను మానినప్పుడు, శూద్రులు పైజాతులవారి హక్కులను హరిస్తున్నప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరు మతబోధాలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడూ తాను గొప్ప పండితుడిని అనుకొన్నప్పుడు, ప్రజలు నిషిద్ధ ఆహారాలు, మద్యపానాలకు అలవాటుపడినపుడు, మతము పేరుతొ కాని పనులు చేస్తున్నప్పుడు, వేర్వేరు మతములవారు తమలో తాము కొట్టుకుంటున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానేసినప్పుడు, సనాతనులు తమ మతాచారాలు పాటించనప్పుడు, ప్రజలు ధనదారాసంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్షమార్గమును మరిచినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయకర్మలతో ప్రజలను సన్మార్గములో పెట్టి వ్యవహారాలూ చక్కదిద్దుతారు.
వారు దీపస్తంభములలాగా సహాయపడి, మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్థేశిస్తారు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయీ, ఎకనాధుడు, తుకారాము, నరహరి, నర్శిబాయి, సజన్ కసాయి, సంవతమాలి, రామదాసు మొదలైన యోగులను తదితరులను వేర్వేరు సమయాలలో జన్మించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపించారు. అలాగే సాయిబాబా కూడా సకాలములో షిరిడీ చేరారు.
పవిత్ర షిరిడీ క్షేత్రము :
ఆహామదునగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతాలు చాలా పుణ్యమైనవి. ఎలాగంటే ఇక్కడే అనేక యోగులు జన్మించి నివశించారు. అలాంటి వారిలో ముఖ్యమైనవారు శ్రీజ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహమదునగరు జిల్లాలోని కోపర్ గాం తాలూకాకు చెందినది. కోపర్ గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి వెళ్ళాల్సి ఉంటుంది. నది దాటి మూడు కోసుల దూరంలో నీమ్ గాంవ్ వస్తుంది. అక్కడికి షిరిడీ కనిపిస్తుంది. కృష్ణా తీరములో గాణపురము, నరశింహవాడి, ఔదుంబర్ మొదలైన పుణ్యక్షేత్రాలలాగే షిరిడీ కూడా గొప్ప పేరుపొందింది. పండరీపురానికి సమీపంలో ఉన్న మంగళవేఢలో భక్తుడైన దామాజీ, సజ్జనగఢలో సమర్థరామదాసు, నర్నోబాచీవాడీలో శ్రీ నరసింహ సరస్వారీస్వామివారలు వర్థిల్లినట్టే శ్రీసాయినాథుడు షిరిడీలో వర్థిల్లి దాన్ని పవిత్రంగా తీర్చిదిద్దారు.
సాయిబాబా రూపురేఖలు :
సాయిబాబాలాగే షిరిడీ ప్రాముఖ్యము వహించింది. సాయిబాబా ఎలాంటి వ్యక్తో పరిశీలిద్దాము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతి వారి భూషణము, వారు జ్ఞానమూర్తులు, వైష్ణవభక్తులకు ఇల్లువంటివారు, ఉదారస్వభావులు, సారములోని సారాంశమువంటివారు, నశించే వస్తువులమీద అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారములోనే మునిగి ఉండేవారు. భూలోకములోకాని, స్వర్గలోకములోకాని ఉన్న వస్తువులలో అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దంలా స్వచ్చమైనది. వారి వాక్కులనుండి అమృతము స్రవించేది. గొప్పవారు, బీదవారు వారికి అందరూ సమానమే. వారు అభిమాన అవమానాలను లెఖ్ఖచేసేవారు కాదు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు చూసేవారు, పాటలను వింటుండేవారు. కానీ సమాధి స్థితినుండి వెనక్కి తగ్గేవారు కాదు. ఎల్లప్పుడూ అల్లా నామాన్ని ఉచ్చరిస్తూఉండేవారు. ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగనిద్రలో ఉండేవారు. లోకము నిద్రించే సమయములో వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రములా ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్థంగా నిశ్చయించటానికి వీలుకానివి. ఒకేచోట కూర్చున్నప్పటికీ ప్రపంచములో జరుగుతున్న సంగతులన్నీ వారికి తెలుసు.
వారి దర్బారు ఘనమైనది. నిత్యమూ వందల కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పేవారు కాదు. ఎల్లప్పుడూ మసీదుగోడకు ఆనుకొని నిలబడేవారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండీ తోటవైపుగానీ చావిడివైపుగానీ పచార్లు చేస్తుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యనములోనే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడు అయినప్పటికీ సాధకునిలా నటించేవారు. అణకువ, నమ్రత కలిగి, అహంకారము లేక అందరినీ ఆనందింప చేసేవారు. అలాంటివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాద స్పర్శతో గొప్ప ప్రాముఖ్యము పొందింది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్టు, ఎకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్టు శ్రీసాయిబాబా షిరిడీని వృద్ధి చేశారు. షిరిడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి. ఎలాగంటే బాబా పవిత్రపాదాలను ముద్దుపెట్టుకొని వారి పాదధూళి తలపై వేసుకోగలిగాయి. షిరిడీ మాలాంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వరము, బదరీకేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములవంటిది అయింది. షిరిడీ సాయిబాబా స్పర్శే మాకు వేదపారాయణ తంత్రము
అది మాకు సంసారబంధనాలు సన్నగిల్లచేసి ఆత్మసాక్షాత్కారాన్ని సులభ సాధ్యము చేస్తుంది. శ్రీసాయి దర్శనమే మాకు యోగాసాధనంగా ఉండేది. వారితో సంభాషణ మా పాపాలను తొలగిస్తుండేవి. త్రివేణీ ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుతుండేది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేస్తుండేవి. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊదీ ప్రసాదము మమ్మల్ని పావనము చేస్తుండేది. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగజేసేవారు. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ఎప్పుడూ సచ్చిదానందస్వరూపులుగా ఉండేవారు. షిరిడీ వారి కేంద్రమైనా వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడదేశాలలో చూపేవారు. ఇలా వారి కీర్తి దూరదేశాలకు వ్యాపించగా, భక్తులు అన్ని దేశాలనుండి షిరిడీ వచ్చి వారిని దర్శించి వారి ఆశీర్వాదము పొందేవారు. వారి దర్శనంతో భక్తుల మనస్సులు వెంటనే శాంతి వహిస్తూఉండేవి. పండరీపురములో విఠల్ రఖుమాయీలను దర్శించటంలో కలిగే ఆనందము శిరిడీలో దొరుకుతుండేది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడొకరు చెప్పింది గమనించండి.
గౌలిబువా అభిప్రాయము :
95 సంవత్సరాల వయస్సున్న గౌలిబువా అనే వృద్ధభక్తుడు ఒకరు పండరీయాత్ర ప్రతిసంవత్సరము చేసేవాడు. ఎనిమిది మాసాలు పండరీపురంలో, మిగతా నాలుగు మాసాలు ... ఆషాడం మొదలు కార్తీక మాసంవరకు (జులై - నవంబరు) గంగానది ఒడ్డున ఉండేవారు. సామాను మోయడానికి ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకెళ్ళేవారు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనానికి వచ్చేవాడు. అతడు బాబాని అమితంగా ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూస్తూ యిలా అన్నాడు "వీరు పండరీనాథుని అవతారమే! అనాథల కోసం, బీదల కోసం వెలిసిన కారుణ్యమూర్తి!'' గౌలిబువా విఠోబాదేవుని ముసలిభక్తుడు. పండరీయాత్ర ఎన్నిసార్లో చేసి ఉన్నాడు. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్థారణ చేశారు.
విఠలదేవుడు దర్శనమిచ్చుట :
సాయిబాబాకు భగవన్నామస్మరణంలో, సంకీర్తనలో అమిత ప్రీతి. 'అల్లా మాలిక్' అంటే 'అల్లాయే యజమాని' అని అంటుండేవారు. ఏడు రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేస్తుండేవారు. దీన్నే నామసప్తాహమంటారు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహము చేయమన్నారు. సప్తాహము ముగిసేరోజు విఠల్ దర్శనము కలుగుతుందని వాగ్దానం ఇస్తే నామసప్తాహము చేస్తానని దాసగణు జవాబిచ్చాడు. బాబా తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగా దర్శనం ఇస్తాడు కాని, భక్తుడు భక్తీ ప్రేమలతో ఉండాలి. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము, ఇక్కడే ... అంటే షిరిడీలోనే ఉన్నాయి. ఎవరూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరిస్తాడు'' అన్నారు.
సప్తాహము ముగిసిన తరువాత విఠలుడీ క్రింద విధంగా దర్శనమిచ్చాడు. స్నానంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి కన్పించారు. కాకా మధ్యాహ్నహారతి కోసం బాబా దగ్గరికి వెళ్లగా తేటతెల్లముగా కాకాను బాబా ఇలా అడిగారు "విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వాణ్ణి చూశావా? వాడు మిక్కిలి పొగరుబోతు. వాణ్ణి దృఢంగా పట్టుకో. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకొని పారిపోతాడు'' ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నము ఎవడో పటాలు అమ్మేవాడు 25,30 విఠోబా చిత్రపటాలను అమ్మకానికి తెచ్చాడు. ఆ పటము సరిగ్గా కాకాసాహెబు ధ్యానములో చూసిన దృశ్యాలతో పోలి ఉన్నాయి. దీన్ని చూసి బాబా మాటలు జ్ఞాపకానికి తెచ్చుకుని, కాకాసాహెబు ఆశ్చర్యానందంలో మునిగిపోయారు. విఠోబా పటము ఒకటి కొని పూజామందిరంలో ఉంచుకున్నారు.
భగవంతరావు క్షీరసాగరుని కథ :
విఠల పూజలో బాబాకెంత ప్రీతికరమో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురానికి నియమంగా యాత్ర చేస్తూ ఉండేవాడు. ఇంటివద్ద కూడా విఠోబా విగ్రాన్ని ఉంచి దాన్ని పూజించేవాడు. అతను మరణించిన తరువాత వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానేశాడు. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాడి తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని "వీని తండ్రి నా స్నేహితుడు కాని వీణ్ణి ఇక్కడకి ఈడ్చుకొచ్చాను. వీడు నైవేద్యము ఎప్పుడూ పెట్టలేదు. అందుకు నన్ను విఠలుని కూడా ఆకలితో మాడ్చాడు. అందుచేత వీణ్ణి ఇక్కడికి తెచ్చాను. వీడు చేస్తుంది తప్పు అని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించేట్లు చేస్తాను'' అన్నారు.
ప్రయోగ క్షేత్రములో దాసగణు స్నానము :
గంగానది యమునానది కలిసిన చోటుకి ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం చేసిన ప్రతివాడికి గొప్ప పుణ్యము ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకము. అందుకే వేలమంది భక్తులు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి స్నానము చేస్తారు. దాసగణు కూడా ప్రయాగ పోయి అక్కడ సంగంలో స్నానము చేయాలని మనస్సులో తలచుకున్నాడు. బాబా వద్దకు వెళ్ళి అనుమతించాలని కోరాడు. అందుకు బాబా ఇలా జవాబిచ్చారు "అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇక్కడే ఉంది. నా మాటలు విశ్వసించు'' ఇలా అనగానే ఆశ్చర్యాలన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది. దాసగణు మహారాజ్ బాబా పాదాలపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వ్రేళ్ళనుండి గంగాయమునా జలాలు కాలువలుగా పారాయి. ఈ చమత్కారమును చూసి దాసగణు ఆశ్చర్యచికితుడయ్యాడు. భక్తావేశంతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయం ఉప్పొంగి కవితావేశం శ్రీసాయిలీలా గానరూపంలో పెళ్లుబికింది.
బాబా అయోనిసంభవుడు; షిరిడీ మొట్టమొదట ప్రవేశము :
సాయిబాబా తల్లిదండ్రుల గురించి కాని, జన్మము గురించి కాని, జన్మస్థానము గురించి కాని ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో అనేకసార్లు ఈ విషయాలు కనుక్కోడానికి ప్రయత్నించారు. అనేకసార్లు బాబాను ఈ విషయాన్ని గురించి ప్రశ్నించారు కాని, ఎలాంటి సమాధానము కాని సమాచారము కాని పొందలేకపోయారు. నామదేవు, కబీరు, సామాన్య మానవులుగా జన్మించి ఉండలేదు. ముత్యపుచిప్పలలో చిన్న పాపలవలె లభించారు. నామదేవుడు భీమారథి నదీ తటాకములో గోణాయికి కనిపించారు. కబీరు భాగీరథీనదీ తటాకములో తమాలుకు కనిపించారు. అలాంటిదే సాయిబాబా జన్మవృత్తాంతము. భక్తుల కొరకు బాబా పదహారేళ్ళ బాలుడుగా షిరిడీలోని వేపచెట్టుక్రింద అవతరించారు. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించారు. బాబా స్వప్నావస్థలో కూడా ప్రపంచవస్తువులకు కోరుకునేవారు కాదు. ఆయన మాయను తన్నారు. ముక్తి బాబా పాదములను సేవిస్తూ ఉండేది.
నానాచోప్ దారు తల్లి మహా ముసలిది. ఆమె బాబాను ఇలా వర్ణించింది "ఈ చక్కని చురుకైన కుఱ్ఱవాడు వేపచెట్టుక్రింద ఆసనములు ఉన్నాడు. శీతోపష్ణములను లెఖ్ఖ చేయకుండా అంతటి చిన్న కుఱ్ఱవాడు కఠిన తాపాన్ని ఆచరించటం సమాధిలో మునిగి ఉండటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కారు. రాత్రిళ్ళు ఎవరికీ భయపడేవాడు కాదు. చూసినవారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుఱ్ఱవాడు ఎక్కడినుండి వచ్చాడని అడుగుతుండేవారు. అతని రూపు, ముఖలక్షణాలు చాలా అందముగా ఉండేవి. చూసిన ప్రతిఒక్కరు ఒక్కసారిగా ముగ్దులు అవుతుండేవారు ఆయన ఎవరి ఇంటికి పోయేవారు కాదు, ఎప్పుడూ వేపచెట్టు క్రిందే కూర్చునేవాడు. పాకే చిన్న బాలుడిలా కన్పించినప్పటికీ చేతలను బట్టి చూస్తే నిజంగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గురించి ఎవరికీ ఏమీ తెలిసేది కాదు'' ఒకనాడు ఖండోబా దేవుడు ఒకడ్ని ఆవహించినప్పుడు ఈ బాలుడు ఎవరి ఉంటారు అని ప్రశ్నించారు. వాడి తల్లిదండ్రులు ఎవరని, ఎక్కడినుండి వచ్చాడని అడిగారు.
ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపించి గడ్డపారను తీసుకొని వచ్చి అక్కడ తొవ్వమన్నాడు. అలా త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాటి కింద వెడల్పు రాయి ఒకటి కనిపించింది. ఆ బండను తొలగించగా క్రింద ఒక సందు కనిపించింది. అక్కడ నాలుగు దీపాలు వెలుగుతున్నాయి. ఆ సొరంగము ద్వారా ముందుకు వెళ్లగా అక్కడ ఒక భూగ్రుహము కనిపించింది. అందులో గోముఖ నిర్మాణాలు, కర్రబల్లలు, జపమాలలు కనిపించాయి. ఈ బాలుడు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు అభ్యసించాడని ఖండోబా చెప్పాడు. తరువాత కుర్రవాణ్ణి ఈ విషయాలు గురించి ప్రశ్నించగా, వారిని అసలు విషయాన్ని మరిపించుచూ అది తన గురుస్థానమని, వారి సమాధి అక్కడ ఉంది కాబట్టి దాన్ని కాపాడవలెనని చెప్పాడు. వెంటనే దాన్ని ఎప్పటిలాగా మూసివేశారు. అశ్వత్థ ఉదుంబర వృక్షములా ఈ వేపచెట్టును పవిత్రముగా చూసుకుంటూ బాబా ప్రేమించేవాడు. మహాల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు.
మూడు వసతిగృహములు :
వేపచెట్టుని, దాని చుట్టూ వున్న స్థలాన్ని హరివినాయక సాఠే అనే అతను కొని సాఠేవాడా అనే ఒక పెద్ద వసతిగృహాన్ని నిర్మించాడు. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలికి అది నివాస స్థలము. వేపచెట్టు చుట్టూ ఎత్తుగా ఒక అరుగు, మెట్లు నిర్మించారు. మెట్ల కింద ఒక గూడు వంటిది ఉంటుంది. భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చుంటారు. ఎవరు ఇక్కడ గురు, శుక్రవారాలు ధూపము వేస్తారో వారు బాబా కృపవల్ల సంతోషముతో ఉంటారు. ఈ వాడా చాలా పురాతనమైనది. కాబట్టి మరమ్మత్తులకు సిద్ధముగా ఉండేది. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానమువారు చేశారు.
కొన్ని సంవత్సరాల తరువాత దీక్షిత్ వాడా అనే పేరు మీద ఇంకొక వసతిగృహాన్ని నిర్మించబడింది. న్యాయవాది అయిన కాకా సాహెబు దీక్షిత్ ఇంగ్లాండుకు వెళ్ళాడు. అక్కడ రైలు ప్రమాదములో కాలు కుంటిదయింది. అది ఎంత ప్రయత్నించినా బాగావలేదు. తన స్నేహితుడైన నానాసాహెబు చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించుకోమని సలహా ఇచ్చాడు. 1909 సంవత్సరములో కాకా షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనముతో అమితానందభరితుడై షిరిడీలో నివశించాలని నిశ్చయించుకున్నాడు. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించాడు. తన కోసం, భక్తులకు పనికివచ్చేలాగా ఒక వాడాను నిర్మించాడు. 10-12-1910వ తీరీఖున ఈ వాడా కట్టడానికి పునాది వేశారు. ఆరోజే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి (1) దాదాసాహెబు ఖాపర్డేకి తన ఇంటికి వెళ్ళడానికి అనుమతి దొరికింది. (2) చావడిలో శేజ్ (రాత్రి) హారతి ప్రారంభించబడింది. దీక్షిత్ వాడా పూర్తికాగానే 1911 సంవత్సరములో శ్రీరామనవమి సమయంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశము జరిపారు.
తరువాత, కోటీశ్వరుడైన నాగపూర్ నివాసి అయిన బూటీ మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించాడు. అతను మేడ నిర్మాణానికి చాలా డబ్బు ఖర్చుపెట్టాడు. బాబాగారి భౌతికశరీరము ఇందులో సమాధి చేయబడింది. దీన్నే సమాధిమందిరం అంటారు. ఈ శ్తలములో మొట్టమొదట పూలతోట ఉండేది. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీలు పోయడం మొదలైన పనులు చేసేవారు. ఇలా మూడు వాడాలు (వసతి గృహాలు) కట్టబడ్డాయి. అంతకుముందు ఇక్కడ ఒక్క వసతిగృహము కూడా లేదు. అన్నిటికంటే సాఠేవాడా మొదటి రోజులలో అందరికీ చాలా ఉపయోగపడుతుండేది.
నాలుగవ అధ్యాయము సంపూర్ణము