శ్రీసాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము 

 

మూడవ అధ్యాయము

 

 

సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము

వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీసాయిసచ్చరిత్ర వ్రాయడానికి బాబా పూర్తి అనుమతి ఇస్తూ ఇలా అన్నారు "సచ్చరిత్ర వ్రాసే విషయంలో నా పూర్తి సమ్మతిగలదు. నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా ఉంచుకో. నా మాటలయందు విశ్వాసము ఉంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించి పోతుంది. శ్రద్ధాభక్తులతో వాటిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమభక్తి కెరటములు లేస్తాయి. ఎవరైతే నా లీలలలో మునిగిపోతారో వారికి జ్ఞానరత్నములు లభిస్తాయి'' ఇది విని రచయిత చాలా సంతోషించాడు. వెంటనేనిర్భయుయుడయ్యాడు. కార్యము జయప్రదముగా సాగుతుందని ధైర్యము కలిగింది. ఆ తరువాత మాధవరావు దేశ్ పాండే (శ్యామా) వైపు తిరిగి బాబా యిలా అన్నారు. "ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను. వారి భక్తిని రెట్టింపు చేస్తాను. వారిని అన్ని పక్కలనుండి కాపాడుతాను. ఎవరైతే మనస్ఫూర్తిగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారీ కథలు వింటున్నప్పుడు అమితానందం పొందుతారు. నా లీలలను గానం చేసే వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇస్తానని నమ్మండి. ఎవరయితే నన్ను శరణు కోరుతారో, భక్తివిశ్వాసములతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపమును తమ మనస్సులో నిలుపుకుంటారో, వారిని దుఃఖ బంధనాలనుండి తప్పిస్తాను. ప్రాపంచిక విషయాలన్నింటినీ మరచి, నా నామాన్నే జపిస్తూ, నా పూజనే చేస్తూ, నా లీలలను, చరిత్రమును మననం చేస్తూ ఎల్లప్పుడూ నన్ను జ్ఞాపకం ఉంచుకుంటారో వారు ప్రపంచ విషయాలలో ఎలా ఇరుక్కుంటారు? వారిని మరణమునుండి బయటకు లాగుతాను. నా కథలు వింటే సకల రోగములు నివారింప బడతాయి. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కథలను వినండి. వాటిని మనస్సులో నిలుపుకోండి. ఆనందమునకు తృప్తికి ఇదే మార్గము. నా భక్తులయొక్క గర్వ అహంకారాలు నిష్క్రమిస్తాయి. నా లీలలు వినేవారికి శాంతి కలుగుతుంది. మనః పూర్వకంగా నమ్మకము ఉన్నవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్యము కలుగుతుంది. 'సాయి సాయి' అను నామాన్ని జ్ఞాపకము ఉంచుకున్నంత మాత్రాన, చెడు పలుకడం వలన, వినటం వల్ల కలిగే పాపాలు తొలగిపోతాయి.

భక్తులకు వేర్వేరు పనులు నియమించుట :

 

 

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమిస్తాడు. కొందరు దేవాలయాలు, మఠాలు, తీర్థాలలో నది ఒడ్డున మెట్లు మొదలైనవి నిర్మించటానికి నియమింప బడతారు. కొందరు తీర్థయాత్రలకు వెళతారు. సచ్చరిత్ర రచన నాకు అప్పగించబడింది. విషయ జ్ఞానము శూన్యం అవటం చేత ఈ పని నా అర్హతకు మించినది. అయినా యింత కఠినమైన పని నేనెందుకు అంగీకరించాలి? సాయిబాబా జీవితచరిత్రను వర్ణించగల వారెవరు? సాయి యొక్క కరుణే యింత కఠిన కార్యాన్ని నెరవేర్చే శక్తిని నాకు ప్రాదించింది. నేను కలము చేత పట్టుకోగానే సాయిబాబా నా అహంకారాన్ని హరించి, వారి కథలను వారే రాసుకున్నారు. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందుతుంది తప్ప నాకు కాదు. బ్రాహ్మణుడినై పుట్టినప్పటికీ శృతి, స్మృతి అను రెండు కళ్ళు  లేకపోవడంతో సాయిసచ్చరిత్రను నేను వ్రాయలేకపోయాను. కాని భగవంతుని అనుగ్రహంతో మూగవాడు మాట్లాడినట్లు చేస్తుంది, కుంటివాడు పర్వతమును దాటినట్లు చేస్తుంది. తన ఇష్టానుసారము పనులు నెరవేర్చుకునే చాతుర్యుం ఆ భగవంతునికి ఉంది. హార్మోనియంకిగాని, వేణువుకిగాని ధ్వనులు ఎలా వస్తాయో తెలియదు. అది వాయించేవాడికే తెలుస్తుంది. చంద్రకాంతము ద్రవించటం, సముద్రము ఉప్పొంగడం వాటి వాటి వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగుతుంది.

బాబా కథలు దీపస్తంభాలు :

 

 

సముద్రం మధ్యలో దీపస్తంభము ఉంటుంది. పడవలపై వెళ్ళేవారు ఆ వెలుతురులో రాళ్ళు, రప్పలవల్ల కలిగే అడ్డంకులను తప్పించుకుని సురక్షితంగా ప్రయాణిస్తారు. ప్రపంచమనే మహాసముద్రములో బాబా కథలు దీపాల వలే దారి చూపిస్తాయి. అవి అమృతము కంటే తియ్యగా ఉండి ప్రపంచయాత్ర చేసే మార్గము సులభముగా జరుగుతుంది, సుగమం చేస్తుంది. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించినప్పుడు శరీర స్పృహ, అహంకారము, ద్వంద్వభావాలు నశిస్తాయి. మన హృదయములో నిల్వ ఉండిన సందేహాలు పటాపంచలైపోతాయి. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడుతుంది. శ్రీ సాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినా, విన్నా భక్తుని పాపాలు పటాపంచలు అవుతాయి. కాబట్టి ఇవే మోక్షానికి సులభ సాధనాలు.కృతయుగములో శమదమములు(అంటే నిశ్చలమనస్సు, శరీరము), త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవంతుని మహిమలు, నామాలు పాడటం మోక్షమార్గాలు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనాన్ని అవలభించవచ్చు. తక్కిన సాధనాలు అంటే యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంభించటం కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడటం సులభ మార్గం. మన మనస్సును మాత్రం అటువైపు తిప్పుకోవాలి. భగవంతుని కథలు వినటంవలన, పాడటంవలన మనకు దేహంపై అభిమానము తొలగిపోతుంది. అది భక్తులను దేహంపై మొహాన్ని నిర్మోహాన్ని కలగజేసి, ఆఖరికి ఆత్మసాక్షాత్కారము పొందేట్లు చేస్తుంది. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతాన్ని వ్రాయించింది. భక్తులు దాన్ని సులభముగా చదవగలరు, వినగలరు. చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు బాబాను ధ్యానించ వచ్చు. వారి స్వరూపాన్ని మనస్సునందు మననము చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా గురువునందు తరువాత భగవంతునియందు భక్తీ కలుగుతుంది. ఆఖరికి ప్రపంచమందు విరక్తిపొంది ఆత్మసాక్షాతారము సంపాదించగలుగుతాము. సచ్చరితామృతము వ్రాయటం, తయారుచేయటం బాబాయోక్క కటాక్షము చేతే సిద్ధించినాయి. నేను నిమిత్రమాత్రుడిగానే ఉన్నాను.

సాయిబాబా యొక్క మాతృప్రేమ

 

 

 

ఆవు తన దూడను ఎలా ప్రేమిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగులు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. దూడకు కావలసినప్పుడల్లా కుదిచినా పాలు ధారగా ఉంటాయి. అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలో తల్లి గ్రహించి సకాలములో పాలిస్తుంది. బిడ్డకు గుడ్డలు తోదగడంతో, అలంకరించటంలో తల్లి తగిన శ్రద్ధ తీసికొని సరిగా చేస్తుంది. బిడ్డకి ఈ విషయాలేవీ తెలియవు కాని, తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరించబడిన విధానాన్ని చూసి అమితానందము పొందుతుంది. తల్లిప్రేమను సరిపోల్చ దగినది ఏదీ లేదు. అది అసమాన్యము, నిర్వాజ్యము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులలో చూపిస్తారు. సాయిబాబాకు కూడా నామీద అలాంటి ప్రేమ ఉండేది. దానికి ఈ కింద ఉదాహరణ ఒకటి ...

 

 

1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాను. నాకివ్వాలని నిశ్చయించిన పింఛను కుటుంబాన్ని గౌరవంగా నడపడానికి చాలదు. గురుపౌర్ణమి రోజు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి వెళ్ళాను. అన్నా చించణీకర్ నా గురించి బాబాతో ఇలా అన్నారు "దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యాన్ని చూపండి. వారికి వచ్చే పింఛను సరిపోదు, వారి కుటుంబం పెరుగుతుంది. వారికి ఇంకేదైనా ఉద్యోగాన్ని యిప్పించండి. వారి ఆతృతను తీసి, నిశ్చింతను కలగాజేయండి''. అందుకు బాబా ఇలా సమాదాం ఇచ్చారు "వారికి ఇంకొక ఉద్యోగమూ దొరుకుతుంది. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడాలి. వాని భోజనపాత్రలు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. అవి ఎప్పటికీ ఖాళీగా ఉండవు. వాని దృష్టినంతటిని నావైపు త్రిప్పుకోవాలి. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడిచిపెట్టాలి. అందరితో అణుకువుగా, నమ్రతతో ఉండాలి. నన్ను హృదయపూర్వకంగా పూజించాలి. వాడిలా చేస్తే శాశ్వత ఆనందాన్ని పొందుతాడు''
నన్ను పూజించాలి అన్న దానిలో ఈ 'నన్ను' అంటే ఎవరు? అనే ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథముయొక్క ఉపోద్ఘాతములో 'సాయిబాబా ఎవరు' అనే శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరించబడింది. చూడండి.

రోహిలా కథ :

 

 

రోహిలా కథ వింటే బాబా ప్రేమ ఎలాంటిదో బోధపడుతుంది. పొడుగాటివాడు, పొడుగైన చొక్కా తొడిగినవాడు, బలవంతుడైన రోహిలా అనేవాడు ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిరనివాసము ఏర్పరచుకున్నాడు. రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుతూ, "అల్లాహు అక్బర్'' అని ఆంబోతు రంకె వేసినట్లు బిగ్గరగా అరుస్తుండేవాడు. అందువలన పగలంతా పొలములో కష్టపడి పనిచేసి యింటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము, అసౌకర్యము కలుగుతుండేది. కొన్నాళ్ళవరకు వారు దీన్ని ఓర్చుకున్నారు. చివరికి ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకు వచ్చి రోహిలా అరుపులను ఆపమని బతిమాలారు. బాబా వారి ఫిర్యాదును వినకపోవటమే కాక వారిపై కోపగించి వారిపనులు వారు చూసుకోవాల్సిందే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించారు. "రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య ఉండేదని, ఆమె గయ్యాలి అనీ, ఆమె వచ్చి రోహిలాను తనని బాధ పెట్టుచున్నదని, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకున్నదని బాబా చెప్పారు. నిజంగా రోహిలాకు భార్యే లేదు. భార్య అనగా దుర్భుద్ది అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవప్రార్థనయందు మిక్కిలి ప్రేమ. అందుకే రోహిలా తరపున వాదించి, ఊరిలోనివారిని ఓపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యాన్ని సహించవలసినదని, అది తగ్గిపోతుందని బాబా బుద్ధి చెప్పారు.

బాబా యొక్క అమృతతుల్యమైన పలుకులు :

 

 

ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన తరువాత భక్తులందరూ తమతమ నివాసాలకి పోతుండగా అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చారు
"మీరు ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా నాకు తెలుస్తూనే ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోండి. నేను అందరి హృదయాలను పాలించేవాడిని. అందరి హృదయాలలో నివశించే వాడిని. నేను ప్రపంచలో ఉన్న చరాచరజీవకోటి లను ఆవరించుకుని ఉన్నాను. ఈ జగత్తును నడిపించేవాడిని, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణమూలా సామరస్యాన్ని నేనే, ఇంద్రియ సంచాలకుడిని నేనే. సృష్టిస్థితిలయకారుడిని నేను. ఎవరయితే తమ దృష్టిని నావైపు తిప్పుకుంటారో వారికి ఎటువంటి హానిగాని, బాధగాని కలగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షిస్తుంది. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచరజీవకోటి అంతటా నా శరీరమే, నా రూపమే''

 

 

ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ ఉద్యోగం కోసం ప్రయత్నించక, గురుసేవలోనే నిమగ్నమవ్వాలని నిశ్చయించుకున్నాను. కాని, అన్నా చించణీకారు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సులోనే ఉండిపోయింది. అది జరుగుతుందా లేదా అని సందేహం కలుగుతుంది. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యాలైనాయి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికింది. కాని అది కొద్దికాలము వరకే. అటు తర్వాత వేరే పని ఏదీ చేయక శ్రీసాయిసేవకు నా జీవతమంతా సర్పించాను.
ఈ అధ్యాయము ముగించేముందు చదివే వారికి నేను చెప్పేది ఏంటంటే బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలైన వాటిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు తిప్పుకోవాలి. వారి ప్రేమ సహజముగా ఉండాలి. వారు భక్తీ యొక్క రహస్యాన్ని తెలుసుకుందురుగాక. ఇతర మార్గము అవలంభించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఓకే మార్గాన్ని తొక్కేదరుగాక! అంటే శ్రీసాయి కథలను విందురుగాక! ఇది వారి అజ్ఞానాన్ని నశింప చేస్తుంది. మోక్షమును సంపాదించి పెడుతుంది. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాడి మనస్సు తాను పాతిపెట్టిన సొత్తు మీదే ఉండినట్లు, బాబాను కూడా అందరూ తమ హృదయములో స్థాపించుకొందురుగాక!

                మూడవ అధ్యాయము సంపూర్ణము