శ్రావణ మాసంలో ప్రతి రోజూ పండుగే!

 

శ్రావణ మాసంలో ప్రతి రోజూ పండుగే!

 

 

ఎక్కడన్నా ఒక రోజు ప్రత్యేకం కావచ్చు. ఒక వారం ప్రత్యేకం కావచ్చు. కానీ శ్రావణ మాసంలో ప్రతి రోజూ పండుగే. ప్రతి వారమూ విశిష్టమే. ఎందుకంటే...

విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ అని అంటారు. చంద్రుడు ఆ శ్రవణా నక్షత్రానికి సమీపంలో సంచరించే కాలమే శ్రావణ మాసం. స్వామివారి జన్మ మాసం కాబట్టి సహజంగానే, లక్ష్మీదేవికి కూడా ఈ మాసమంటే ఇష్టమని అంటారు. పైగా శ్రవణ అంటే వినడం అన్న అర్థం కూడా ఉంది కదా! ఈ మాసంలో అమ్మవారికి చేసే ప్రార్థనలను ఆమె తప్పక వింటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని కూడా అంటారు.

శ్రావణ మాసం మొదలయ్యే రోజునే పవిత్రోత్సవాల పేరుతో 15 రోజులు 15 మంది దేవతలను పూజించే ఉత్సవాలు జరుగుతాయి. ఇక మాసంలోని ఒకో రోజు గడిచేకొద్దీ ఒకో పండుగా పలకరిస్తూ ఉంటుంది. పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగుల ప్రతిమలని పూజిస్తారు. ఈ రోజు పాములకి హాని కలిగించేలా భూమిని తవ్వకూడదని చెబుతారు. గరుత్మంతుడు తన తల్లిని రక్షించుకునేందుకు ఈ రోజునే అమృతాన్ని సాధించి తీసుకువచ్చాడట. పంచమి తర్వాత షష్టి రోజున సూపౌదన వ్రతం పేరుతో శివపూజనీ, షష్టి రోజున ద్వాదశ సప్తమీ వ్రతం పేరుతో సూర్యునీ ఆరాధిస్తారు. ఇలా ప్రతి ఒక్క తిథిలోనూ ఏదో ఆచారమో, వ్రతమో కనిపిస్తుంది.

శ్రావణమాసం విష్ణుమూర్తికే కాదు... ఆయన అవతారాలలో చాలావాటికి ప్రత్యేకమే. వరాహస్వామి, హయగ్రీవుడు, కల్కి, కృష్ణుడు ఈ మాసంలోనే జన్మించారు. ఇక వినాయకునికీ, కుమారస్వామికీ రక్షాబంధనాన్ని కట్టేందుకు సంతోషిమాత అవతరించింది కూడా ఈ మాసంలోనే. ఆ రోజుని మనం రాఖీ పౌర్ణమిగా జరుపుకొంటున్నాం. ఈ రాఖీ పౌర్ణమి నాడే కొత్త జంధ్యాలు ధరిస్తారు కాబట్టి, దీనిని జంధ్యాల పౌర్ణమిగా కూడా పిలుస్తారు.

ఇక ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. అలాంటిది శ్రావణమాసంలో వచ్చే ఏకాదశుల గురించి వేరే చెప్పాలా! శ్రావణమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని భక్తితో కొలిచినవారికి సంతానం కలుగుతుందని చెబుతారు. శ్రావణ బహుళ ఏకాదశినేమో కామిక ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఆచరిస్తే ఎంతటి పాపాలైనా తీరిపోయి, పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందట.

శ్రావణమాసంలో తిథులే కాదు... వారాలు కూడా విశిష్టమే! ఈ నెలలోని మంగళవారాలలో కొత్తకోడళ్లు ఐదేళ్లపాటు సాగే మంగళగౌరీ వ్రతాన్ని చేసుకుంటారు. అమ్మవారి వరాలను అందుకునేందుకు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. కొన్ని ప్రదేశాలలో శ్రావణ శనివారాలు పేరుతో ఇంటి ఇలవేల్పుని ఆరాధించడమూ కనిపిస్తుంది. శ్రావణమాసం శివునికి కూడా పరమపవిత్రమట. అందుకే ఈ నెలలోని సోమవారాలు శివుని ఆరాధిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది.

- నిర్జర.