శివరాత్రి రోజు ఏం చేయాలి!

 

శివరాత్రి రోజు ఏం చేయాలి!

 

 

వేల ఏళ్లు గడిచి ఉండవచ్చు, వైదిక కాలం దాటిపోయి ఉండవచ్చు... కానీ భరతజాతికి శైవారాధన మీద ఉన్న మక్కువ తగ్గనేలేదు. ఆ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో మాత్రమే కాదు... సృష్టి తత్వాన్ని బోధపరుస్తాడనీ, సంసారం నుంచి విముక్తం చేస్తాడనీ ఆయన చెంతకు చేరతారు. అందుకు ఓ గొప్ప సందర్భమే శివరాత్రి! మన పండుగలన్నీ పగటి పూజలతోనూ, పిండివంటలు ఆరగించడంతోనూ గడుస్తాయి. కానీ శివరాత్రి దీనికి విరుద్ధం. ఉపవాసంతోనూ, జాగరణతోనూ, రాత్రివేళ పూజలతోనూ శివరాత్రిని జరుపుకుంటాము. శివుడు లింగరూపంలో దర్శనమిచ్చిన సందర్భం శివరాత్రి అని చెబుతారు. దీని వెనుక ఉన్న కథ కూడా చాలామందికి సుపరిచితమే!

బ్రహ్మ, విష్ణుదేవుల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదులాట మొదలైందట. ఈ సమస్యని తీర్చేందుకు వారిద్దరూ శివుని ఆశ్రయించగా ఆయన ఒక అగ్నిస్తంభంగా అవతరించాడు. ఆ అగ్నిస్తంభపు చివరను ఎవరైతే తెలుసుకోగలరో వారే గొప్పవారంటూ శివుడు సూచించాడు. అంతట విష్ణువు వరాహరూపంలో స్తంభపు దిగువు భాగాన్ని పెళ్లగిస్తూ, బ్రహ్మదేవుడు హంస రూపంలో స్తంభం పైభాగంలోకి ఎగురుతూ దాని ఆద్యంతాలను కనుగొనే ప్రయత్నం చేశారు. చివరికి వారిరువురూ కూడా శివ స్వరూపానికి మూలం తెలుసుకోలేకపోవడంతో... శివుడు వారి ముందు లింగరూపంలో దర్శనమిచ్చాడు. అదే శివరాత్రినాటి అర్ధరాత్రి వేడుకగా సాగే లింగోద్భవ సమయం. లింగోద్భవ కథని వింటే మనకు శాస్త్రవేత్తలు చెప్పే కొన్ని సంగతులు గుర్తుకురావు. ఈ సృష్టి అనంతం (infinite) అన్నదానికి సూచనగా ఆద్యంతాలు లేని అగ్నిస్తంభం కనిపిస్తుంది. సృష్టి ఎలాగూ అనంతం కాబట్టి, అందులోని ప్రతి చోటూ విశ్వానికి ముఖ్యకేంద్రమే అన్నదానికి ప్రతీకగా లింగారాధనని చెప్పుకోవచ్చు.

ఏకాదశి వ్రతం ఎలాగైతే దశమి నుంచి ఆరంభమవుతుందో... శివరాత్రి కూడా త్రయోదశి నాటి నుంచే మొదలవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. త్రయోదశినాడు ఒంటిపూట భోజనం చేయాలనీ, మర్నాడు శివరాత్రి నాడు ఉదయాన్నే స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలని చెబుతున్నాయి. ఇక శివరాత్రి రోజంతా ఉపవాసం చేయాలన్నది తెలిసిందే! శివరాత్రినాటి జాగరణతోనే ఆ ఉపవాసం పరిపూర్ణం అవుతుంది. జాగరణ అంటే కబుర్లతో కాలక్షేపం చేయడమో, సినిమాలు చూడటమో కాదంటున్నారు పెద్దలు. శివనామస్మరణతో, శివధ్యానంతో మనసుని ఆయనయందు లయం చేయడమే జాగరణ లక్ష్యం.

 

 

శివరాత్రి రోజున జాగరణే కాదు... ఆ రాత్రివేళ ఆయనకు అభిషేకం చేస్తే మరింత ఫలం చేకూరుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అభిషేక ప్రియుడైన శివునికి శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి, ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసిదళాలతో పూజ, మూడో జాములో నేయితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి. ఇక ఒకో జాములోనూ ఒకో తీరులో ప్రసాదం (పులగం, పాయసం, నువ్వులు, అన్నం) ఉండాలనీ, ఒకో జాములో ఒకో వేదం నుంచీ మంత్రాలు చదవాలనీ చెబుతారు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా శివరాత్రినాడే కాబట్టి, ఈ రోజు శివాలయాలలో జరిగే పార్వతీకళ్యాణాన్ని దర్శించడం కూడా విశేష ఫలితాన్ని అందిస్తుంది.

శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయిన కనీసం శివునికి లింగరూపంలో అభిషేకం చేసుకోమని సూచిస్తున్నారు. ఈనాడు యజుర్వేదంలోని నమకచమకాలను ఉచ్ఛరిస్తూ సాగే రుద్రాభిషేకాన్ని చేసినా, అలా సాగే అభిషేకాన్ని దర్శించినా కూడా విశేష ఫలితం దక్కుతుంది. ఇక ఇదీ కుదరకపోతే శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దహన స్తోత్రం, నిర్వాణషట్కం వంటి స్తోత్రాలను పఠిస్తే మనసంతా శివమయం అయిపోతుంది. ఏదీ సాధ్యం కాకపోతే ‘ఓం నమశ్శివాయ’ అంటూ శివపంచాక్షరిని తల్చుకుంటూ, మదిలో శివుని నిలుపుకుంటే.... ఆ భోళాశంకరుని అనుగ్రహం లభించి తీరుతుంది.

- నిర్జర.