రాజసూయయాగం - శిశుపాల వధ - రాఖీ కథ!
రాజసూయయాగం - శిశుపాల వధ - రాఖీ కథ!
అది మహాభారత కాలం. ఇంద్రప్రస్థంలో కొలువైన ధర్మరాజుకి ఏదన్నా మంచి యాగం చేయలన్న సంకల్పం కలిగింది. రాజులు చేయదగిన యాగాలలో అశ్వమేధయాగం, రాజసూయయాగం ప్రత్యేకమైనవి. ఈ రెండు యాగాలలోనూ రాజులు తమ చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయించి యాగాన్ని పూర్తిచేస్తారు. అంటే ఇవి పుణ్యం, పురుషార్థం రెంటినీ సాధించే యాగాలన్నమాట! అలా ఓసారి ధర్మరాజు రాజసూయయాగాన్ని తలపెట్టాడు. యాగం దిగ్విజయంగా పూర్తయింది. చుట్టుపక్కల రాజ్యాలన్నీ పాండవుల పౌరుషానికి దాసోహమన్నాయి. యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరన్నా పెద్దలకి అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నారు పాండవులు. పాండవులకి పెద్దదిక్కు శ్రీకృష్ణుడే కదా! ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వమని ధర్మరాజుకి సూచించాడు భీష్ముడు.
ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు. శిశుపాలునికి శ్రీకృష్ణుడంటే చెడ్డ కోపం. అలాంటి శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం అనగానే నోటికి వచ్చినట్లు వదరడం మొదలుపెట్టాడు శిశుపాలుడు. సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని (పూతన) చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు. పుట్టలని ఎత్తడం (గోవర్ధన గిరి ధారణ), పుచ్చిన చెట్లను పడగొట్టడం (మద్దిచెట్లను కూలదోయడం) కూడా పరాక్రమమేనా అని దూషించసాగాడు. ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చిన భీముడు, శిశుపాలుని సంహరించేందుకు ఉద్యుక్తుడవుతాడు. ఆప్పుడు భీష్ముడు, భీముని నిలువరిస్తూ శిశుపాలుని వృత్తాంత్తాన్ని ఇలా చెబుతాడు.
``పూర్వం చేది రాజ్యాన్ని పాలించే దమఘోషుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య అయిన సాత్యతి, సాక్షాత్తూ శ్రీకృష్ణునికి మేనత్త. వాళ్లకి పుట్టినవాడే ఈ శిశుపాలుడు. వీడు పుట్టడమే నాలుగు చేతులతో, నుదుట మూడో కంటితో, గాడిద స్వరంతో పుట్టాడు. ఒక మహానుభావుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే, అతనికి ఉన్న అవకరాలన్నీ తొలగిపోతాయనీ, అయితే శిశుపాలుని చావు కూడా అతని చేతిలోనే ఉంటుందనీ అశరీరవాణి ద్వారా తెలుసుకుంటారు ఆ దంపతులు. అప్పటి నుంచీ తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఆ పిల్లవాడిని ఉంచసాగారు. అలా ఓసారి తన మేనత్త ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుని చేతిలో అతడిని ఉంచారు.
ఆశ్చర్యంగా కృష్ణుని స్పర్శ తగలగానే ఆ పిల్లవాడి వైకల్యాలన్నీ తొలగిపోయాయి. తన పిల్లవాడు మామూలు మనిషి అయ్యాడన్న సంతోషం కలిగినా, అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలుసుకున్న సాత్యతి, తనకు పుత్రభిక్ష పెట్టమని శ్రీకృష్ణుని వేడుకుంది. నువ్వు నా మేనత్తవి కాబట్టి నీ మొహం చూసి వీడిని క్షమిస్తాను. కానీ వందకు మించి తప్పులు చేస్తే మాత్రం దండించక తప్పదని` చెప్పాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శిశుపాలుని చావు కృష్ణుని చేతిలోనే రాసిపెట్టి ఉంది. నువ్వు ఊరుకో`` అని భీముని శాంతింపచేశాడు భీష్ముడు.
మరోపక్క శిశుపాలుని దూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా కృష్ణుని మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ ఏకం చేశాడు. కృష్ణుడంటే శిశుపాలునికి మొదటి నుంచీ వైరంగా ఉండేది. దానికి తోడు తాను వివాహం చేసుకోతలపెట్టిన రుక్మిణిని కూడా శ్రీకృష్ణుడు చేపట్టడంతో, ఆ వైరం అంతకు పదింతలయ్యింది. చేది అనే చిన్నపాటి రాజ్యానికి వారసునిగా నిలవడంతో మదం తలకెక్కింది. ఆ సభలో శిశుపాలుని దూషణల పర్వంతో శ్రీకృష్ణుడు ఒప్పుకున్న వంద తప్పుల గడువు తీరిపోయింది. దాంతో కృష్ణుడు ఆగ్రహావేశాలతో శిశుపాలుని ఖండించేందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రధారి ఆయుధం గురితప్పలేదు. అది నేరుగా శిశుపాలుని శిరసుని ఖండించిపారేసింది. కానీ సుదర్శనచక్రాన్ని విడిచే ఆవేశంలో, కృష్ణుని వేలుకి చిన్నపాటి గాయమై రక్తం కారడం మొదలుపెట్టింది.
శ్రీకృష్ణునికి గాయమైందని తెలియగానే, వేలికి కట్టుకట్టేందుకు నలుగురూ నాలుగు దిక్కులకి పరుగుతీశారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీరకొంగును చింపి శ్రీకృష్ణుని చేతికి రక్షగా చుట్టింది. అవ్యాజమైన ద్రౌపది అనురాగానికి శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. `నువ్వు నన్ను ఆపదలో ఆదుకునేందుకు నాకు రక్షను అందించావు కాబట్టి, నీకు ఆపద వాటల్లినప్పుడు నీకు రక్షగా నేను నిలుస్తాను` అని వాగ్దానం చేశాడు.
రాజసూయ యాగం తరువాత, అక్కడే ఉండి ధర్మరాజు రాజ్యవైభవాన్నీ, అతని రాజ్యంలోని మయసభనీ చూసిన దుర్యోధనునికి ఎక్కడలేని అసూయ కలిగింది. తన రాజ్యమైన హస్తినాపురికి చేరుకోగానే, శకునితో కలిసి పాండవులని ఎలా రాజ్యభ్రష్టులని చేయాలా అని కుయుక్తులు పన్నసాగాడు. అందులో భాగంగానే ధర్మరాజుని మాయాజూదానికి ఒప్పిస్తారు. ఆ జూదంలో ద్రౌపదిని కూడా గెల్చుకుని నిండుసభలో ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నిస్తారు కౌరవులు. పరాక్రమానికి ప్రతీకలైన పాండవులు కూడా ఆ సందర్భంలో తలలు వంచుకుని ఉండిపోతారు. ఇక గత్యంతరం లేక ద్రౌపది లోకరక్షకుడైన శ్రీకృష్ణుని తల్చుకుంటుంది. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే!
ద్రౌపది, శ్రీకృష్ణుని వేలుకి చుట్టిన రక్షే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందనీ... దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిల్పుకొన్న తీరే సోదరుల బాధ్యతను నిర్వచనంగా నిలుస్తుందనీ పెద్దలు చెబుతారు! మరికొన్ని గాథల ప్రకారం విష్ణుమూర్తి చేతిలో చనిపోయే వరాన్ని పొందిన హిరణ్యకశిపుని అవతారమే శిశుపాలుడు. మొత్తానికి ఈ ఒక్క కథలోనే శిశుపాలుని మదం, దుర్యోధనుని అసూయ, ధర్మరాజు అసహాయత, ద్రౌపది అనురాగం, శ్రీకృష్ణుని రక్ష.. అన్నీ కనిపిస్తాయి.
- నిర్జర.