రాజ్యాన్ని కాపాడిన రాఖీ!
రాజ్యాన్ని కాపాడిన రాఖీ!
అగస్టులో వచ్చే శ్రావణమాసంలో పౌర్ణమిని, రాఖీపౌర్ణమిగా పిలుస్తారు. శ్రావణమాసం వచ్చిందంటే చాలు. ప్రతి అంగడిలోనూ రాఖీలు రెపరెపలాడతాయి. రక్తసంబంధం లేకున్నా, కులమతాలు ఒకటి కాకున్నా.. సోదరభావం అనే ఒకే ఒక్క బంధం వెల్లివిరుస్తుంది. అందుకే 1905లో బెంగాల్ విభజన సమయంలో రవీంద్రనాథ్ టాగూర్ ప్రజలంతా ఒక్కటయ్యేందుకు రక్షాబంధనాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించేవారు. రాఖీ పండుగ ఈనాటిదా! ఒకప్పుడు యుద్ధానికి వెళ్లే వీరులకు విజయం దక్కాలని కోరుకుంటూ, స్ర్తీలు రక్షాబంధనాలను చేతికి కట్టేవారు. పురాణాలలో కూడా రక్షాబంధనాల ప్రసక్తి చాలా చోట్ల వస్తుంది. లక్ష్మీదేవి, బలిచక్రవర్తికి రాఖీకట్టినట్లుగా... కృష్ణునికి, ద్రౌపది రక్షాబంధనాన్ని అందించినట్లుగా చెబుతారు.
పురాణాలే కాదు చరిత్రలో కూడా రాఖీకి సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి. మన దేశం మీదకి అలగ్జాండర్ దండెత్తి వచ్చినప్పడు, అతణ్ని పురుషోత్తముడు అనే రాజు ఎదుర్కొన్నాడు. రోజులు గడిచే కొద్దీ యుద్ధంలో పురుషోత్తముడిదే పైచేయిలా కనిపించసాగింది. అతని చేతిలో అలగ్జాండర్ చనిపోవడం ఖాయమనుకున్నారంతా. ఆ విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య రొక్సానా, పురుషోత్తముడికి ఒక రాఖీని పంపిందని చెబుతారు. దాంతోపాటు `యుద్ధంలో కనుక నా భర్త నీ కంటపడితే దయచేసి అతణ్ని ఏమీ చేయవద్దు` అన్న సందేశాన్ని కూడా అందించిందట. ఆ తరువాత యుద్ధంలో అలెగ్జాండర్ని హతమార్చే అవకాశం వచ్చినా పురుషోత్తముడు తన మాటను నిలబెట్టుకున్నాడట. అయితే ఈ విషయాన్ని ధృవీకరించేందుకు తగిన ఆధారాలు ఏవీ లేవు.
కానీ మొఘల్ రాజు హుమాయున్ రాఖీబంధానికి కట్టుబడిన విషయం మాత్రం రాజస్థాన్ చరిత్రలో కనిపిస్తుంది! 15వ శతాబ్దంలో రాజస్థాన్‌లోని చిత్తోడ్ ప్రాంతాన్ని, కర్నావటి అనే రాణి పాలించేది. ఒకసారి ఆమె మీదకు బహదూర్ షా అనే శత్రువు దండెత్తి వచ్చాడు. అతణ్ని తన శాయశక్తులా ఎదుర్కొంటూనే, సాయానికి రమ్మంటూ అప్పటి ముఘల్ రాజు హుమాయున్‌కి రాఖీని పంపిందట కర్నావటి. దాన్ని అందుకున్న వెంటనే, హుమాయున్ తన సైన్యాన్ని చిత్తోడ్ వైపు మళ్లించాడు. ఆ యుద్ధంలో హుమాయున్, కర్నావటిని కాపాడలేకపోయినా... బహదూర్‌షాని మాత్రం ఓడించగలిగాడు.
రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి, మంచి బట్టలు వేసుకుని రాఖీకి సిద్ధపడతారు. అక్కచెల్లెళ్లంతా బుద్ధిగా కూర్చున్న అన్నదమ్ములకి రాఖీని కడతారు. రాఖీని కట్టేటప్పడు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||` అన్న స్తోత్రాన్ని కూడా చదువుతారు. `ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బలిచక్రవర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇతణ్ని అన్ని కాలాలలోనూ విడవకుండా ఉండు` అని దీని అర్థం. ఆ తరువాత హారతిని ఇచ్చి, నుదుట తిలకాన్ని దిద్దుతారు. దానికి సంతోషపడిపోయే సోదరులు తమ ప్రేమకు గుర్తుగా వారికి చక్కటి బహుమతులను అందిస్తారు.
- నిర్జర.