Read more!

కంటికి రెప్పలా కాపాడే సాయినాథుడు (Shirdi Sai baba)

 

కంటికి రెప్పలా కాపాడే సాయినాథుడు

(Shirdi Sai baba)


సాయిబాబా లేని ప్రదేశం లేదు. అడుగడుగునా బాబా లీలలు కనిపిస్తాయి. అణువణువునా బాబా రూపం అనుభూతికొస్తుంది. అందుకే బాబా మనతోనే ఉన్నాడని నమ్ముతూ ముందుకు సాగాలి. ఆయన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తాడు. సమస్యలను పరిష్కరించుకునే తెలివితేటలు ఇస్తాడు. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ప్రసాదిస్తాడు. అన్నిటినీ మించి ప్రశాంత చిత్తాన్ని ఇస్తాడు. ఇంతగా మనల్ని కనిపెట్టుకుని ఉండే సాయినాథునికి ఏమివ్వగలం... ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు. నిశ్చల మానసును సమర్పించుకుంటే చాలు బాబా మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతాడు.

 

''కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం'' అన్నారు. ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం. అది అంత తేలికైంది కాదు. సుదీర్ఘ జీవన ప్రయాణంలో అనుక్షణం ఏవో కష్టనష్టాలు వస్తుంటాయి. ముళ్ళు, రాళ్ళు ఎదురౌతుంటాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు హీనంగా, రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే సంసారాన్ని సాగరంతో పోల్చారు. సముద్రంలో నిరంతర అలల తాకిడి ఉన్నట్లే అనుక్షణం ఏదో విధమైన చీకూచింతలు ఉంటాయి. ఆటుపోట్ల సమస్యలు వస్తుంటాయి. తిమింగలాల్లాంటి పెద్ద ఆపదలు పొంచి ఉంటాయి. తుపానుల్లాంటి ఆకస్మిక ప్రళయాలు ముంచుకొస్తుంటాయి. అంతమాత్రాన జీవితం నుండి పారిపోలేం. పలాయనవాదం పనికిరాదు.

 

ఇలాంటి ఆపద సమయాల్లో భక్తులు సాయిబాబాను స్మరించుకుంటారు. బాబా భక్తసులభుడు. వెంటనే అనుగ్రహిస్తాడు. నమ్మినవారికి అండగా నిలుస్తాడు. కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. కష్టాలనుండి గట్టెక్కిస్తాడు. ఆపదల నుండి బయటపడిన భక్తులకు బాబా పట్ల ఎనలేని విశ్వాసం కుదురుకుంటుంది. ఇక మనసునే మందిరంగా చేసుకుని బాబాను ప్రతిష్టించుకుంటారు. మనం చేసేదీ, చేయాల్సిందీ అదే.