సత్య వ్రతం - అంతరార్థం (Satya narayana Vratam)

 

సత్య వ్రతం - అంతరార్థం

(Satyannarayana Vratam)

 

వ్రత విధానం కార్తీకమాసంలో శుక్లపక్షమందు శుద్ధ నవమి 'కృత యుగ - ప్రారంభ' దినం. అనగా కలియుగాంతమై "సత్యయుగం" ఆరంభమయ్యే పుణ్యదినం! దీనినే అక్షయ నవమి అని కూడా పిలుస్తారు ! సత్యపురుషుని ఆవిర్భావ సమయం కనుక, ఇది 'సత్యయుగ' ప్రారంభకాలమని, "భవిష్య పురాణం"తెలుపుతుంది . సత్య స్వరూపుడనగా 'సత్యనారాయణుడు'! ఆంధ్రదేశంలో అన్నవరం పుణ్యక్షేత్రమందు కోట్లాదిమంది తెలుగువారికి కొంగుబంగారంగా, కోరీన వరాల నెల్లా సిద్ధింపచేసే దేవతా స్వరూపుడే శ్రీ సత్యనారాయణస్వామి.

ఆ సత్యనారాయణస్వామిని ఎవరైనా, ఏ కాలంలోనైనా తమ సంకల్పసిద్ధి కోసం వ్రతంతో ఉపాసించవచ్చును.

“శ్రీ సత్యనారాయణ వ్రతం"గా మన తెలుగునాట ఇంటింటా మహోత్సాహంగా జరుపుకొంటున్నాం. కాని దురదృష్టవశాత్తూ అతి పవిత్రమైన ఈ మహా వ్రతాన్ని ఏదో కోరికలుతీర్చే మొక్కుబడిగా ఈ కథను పురోహితులు సగానికి సగం మింగేసి ఎంత త్వరగా పూర్తి చెయ్యాలా అన్న దృష్టితో పారాయణ చెయ్యటం మనకి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దీనికితోడు రోజుకు ఎన్నిసత్యనారాయణ వ్రతాలు చేయిస్తే అంత డబ్బూ, బియ్యం, అరటిపళ్ళూ లభిస్తాయన్న దృష్టితో కూడా చేస్తున్నారు. ఈ పవిత్రమైన మహా వ్రతం అంతరార్ధమేమిటి? పూర్వపు ఋషులు ఈ వ్రతాన్ని ఎటువంటి సత్యభావంతో చేశారు? అందులో కొంచమైనా అర్ధం చేసుకుని ఆ భావాన్ని మన మనస్సులో పాదుకొలిపి సత్య స్వరూపుడైన ఆ సత్యనారాయణుని శక్తిని మన ఆత్మతో అనుభవిద్దామన్న కోరిక, వ్రతం చేసే భక్తులకు ఎంత తీవ్రంగా వున్నా... యదార్ధంగా అది, అనుభవంలో చాలామందికి లభించడం లేదు! కేవలం వ్యాపార దృష్టితోనే ఈ వ్రత కథ చదువుతున్నారు.

దీనికి ముఖ్య కారణం తెలుగులో సరైన సత్యనారాయణ వ్రత కథ అందించే ఉత్తమ పుస్తకం లభ్యం కావడం లేదు ! కాబట్టి ఇప్పుడు వ్రతం అంతరార్థం వ్రతాధిష్ఠాన దైవమైన శ్రీ సత్యనారాయణస్వామిని ధ్యానించే విధానమూ, యధాతధంగా ఋషులు తెలిపినదానినే, పాఠకులకు అలానే అందించాలనే సంకల్పంతో సత్యనారాయణ -వ్రత విధానాన్ని పూజా పుష్పంగా, భగవదార్పణగా ఇస్తున్నాం.

వ్రతకాలం

సత్యనారాయణ -వ్రతాన్ని ఎప్పుడైనా చేయవచ్చు! పర్వకాలాల్లో చేస్తే అది విశేషమైన ఫలం ఇస్తుంది. పర్వకాలాల్లో అంటే సూర్యుడు రాశిమారే సంక్రమణ దినం. మేష సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి వంటి రోజులుగాని, పౌర్ణమి, ఏకాదశి తిథులయందుగాని , చేసిన అది విశేష ఫలం ఇస్తుంది. దీనిని దేవాలయంలోగాని, పుణ్యక్షేత్రంలోగాని, నదీ తీరానగాని, నదీ సాగర సంగమంవద్దగాని, లేక ఆవులను కట్టివేసే "గోశాల" యందుగాని, పూజాస్థలం ఏర్పాటుచేసి ఆ ప్రకారం గనక ఆచరిస్తే వెయ్యింతలుగా ఫలితం ఇస్తుంది.

వ్రత విధానం

ఈ వ్రతం చేసే స్థలం పైన చెప్పినవాటిలో ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఏ పుణ్యస్థలమైనా గాని, లేదా నూతనంగా నిర్మించిన తన స్వగృహంలోగాని, భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. సర్వ సాధారణంగా పెళ్లికొడుకు పెళ్ళయిన మరుసటి దినం నూతన వధువుతోకూడి ఈ పవిత్రమైన శ్రీ సత్యనారా యణ – వ్రతాన్ని ఆచరించడం తెలిసిందే. ఈ వ్రతం ప్రారంభించే తిధి, నక్షత్రంలు తన జన్మరాశి నుండి, జన్మనక్షత్రం నుంచి లాభస్థానమందు, శుభస్థానమందు ఉండాలి! వ్రత ప్రారంభకాలం శుభలగ్నమై శుభగ్రహంలతో చూడబడుచున్న సమయం ఐతే అది మరింత శుభప్రదం !ఈ వ్రతం బంధుమిత్ర పరివారంతోగాని, వీలైనంత ఎక్కువమందిని అందులో తన హితం కొరువారిని పెద్దలనూ , సద్గురువులను, ఆప్తులను ఆహ్వానించి, గౌరవించి, కూర్చుండచేసి నమస్కరించి వారి ఆశీస్సులతో ప్రారంభించాలి.

వ్రత మంటపం

ఈ సత్యనారాయణ వ్రతం చేసే వేదికను ఆవు పేడతోనూ, నదీగర్భంలోని ఒండ్రుమట్టితోగాని లేదా పుట్టమన్నుతోగాని కలిపి సరికొత్త ఇటుకలతో మూడు వరుసలతో నిర్మాణం చేయాలి. గోమయంతో అలికి పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి బియ్యపు పిండి, పసుపు, కుంకుమలతో తూర్పారా ముగ్గులు పెట్టి, తర్వాత పూజాద్రవ్యాలు సిద్ధం చేయాలి.

పూజా ద్రవ్యాలు

రాగి కలశంగాని, గుండ్రని వెండిచెంబు గాని, లేక పంచలోహ కలశంగాని, సన్నని మూతిగల గుండ్రని చెంబు శుభ్రంగా తోమి, చందనం, కుంకుమ పసుపులతో దానిని అలంకరించి ఆ కలశపాత్రలో కొద్దిగా గంగనీరూ, శుద్దోదకం, నవరత్నాలు లేదా సువర్నాలు వేసి, దర్ఛలు వుంచి నీరు పోసి టెంకాయను పట్టువస్త్రంతో చుట్టి మావిడి ఆకులతో పేర్చి, కలశం పై ఉంచాలి.

కొత్త పిడత, మూకుళ్ళూ, నాలుగుదిక్కులా నీటితో నింపి పంచ పల్లవాలు అంటే, అయిదు రకాల పవిత్రమైన ఆకులు ఆ నీటిలో వుంచి అక్షతలు, నవధాన్యాలూ నారాయణమంత్రంతో వేసి అందులో సంప్రోక్షించాలి.

దీపారాధన, అరటిపండ్లు, పసుపు ,కుంకుమ, చందనం, అక్షింతలు, కొత్తవస్త్రాలూ సిద్ధం చేసుకోవాలి! ఇవన్నీ శుభముహూర్తానికి ముందుగానే పురోహితునితో సహా సిద్ధంగా వుంచు కోవాలి.

శుచిగా తలంటుకుని తెల్లని పట్టువస్త్రం ధరించి, తూర్పుముఖంగా లేక ఉత్తరముఖంగా కూర్చుని, ఆచమనం చేసి ఓంకారంతో ప్రాణాయామం చేయాలి.