సంపాతికి ఉన్న అద్భుత శక్తి!

 

సంపాతికి ఉన్న అద్భుత శక్తి!

చచ్చిపోవాలని అనుకున్న అగందుడు, మిగిలిన వానరాలకు దూరంగా ఒక పెద్ద పక్షి వాళ్ళను చూస్తూ నాకు భలే మంచి ఆహారం దొరుకుతుంది అనుకుంది. అయితే వానరాలు రాముడి కథ చెప్పుకుంటూ జటాయువు చనిపోయిన విషయం మాట్లాడుకుంటుంటే ఆ పక్షి విని "జటాయువు గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరు మీరు??" అని అడిగింది.

అప్పుడు వానరాలు ఆ పక్షితో రాముడి కథ అంతా చెప్పి "జటాయువు గురించి అడుగుతున్నావు నువ్వు ఎవరు??" అని అడిగారు.

"సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుండి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను, జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ. మేము సూర్యుడికి దగ్గరగా వచ్చాము. అప్పుడా సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి కిందపడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవలన నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వలన నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అనుకుంటున్నాను. కాని నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దగ్గర దింపండి, నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను" అన్నాడు.

సంపాతి కోరిక మేరకు వారు ఆయనని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు. ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు.

మళ్ళి వెనక్కి తిరిగొచ్చాక ఆ వానరాలు సంపాతితో "జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు. నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా. నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా??"  అని అడిగారు.

ఇప్పుడు రెక్కలు కాలిపోయాయి నాకు, ఇవ్వాళ ఇలా పడి ఉన్నాను, ఇంతకన్నా ఏమి చెయ్యగలను. కాని రామకార్యానికి నేను మాటమాత్రం సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. ఆ రావణాసురుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో దీనురాలై, పచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది. నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను, మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములు అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు ఎగురుతాయి.

మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినతా పుత్రులమైన వైనతేయులము కాబట్టి మేము ఎగురుతాము. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది.

దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటే, సీతమ్మ దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు సంపాతి.

                               ◆వెంకటేష్ పువ్వాడ.