సమ్మక్క- సారక్క జాతరలో ఏం జరుగుతుంది..

 

సమ్మక్క- సారక్క జాతరలో ఏం జరుగుతుంది..! 

 

మన దేశంలో- ఆ మాటకి వస్తే.. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర. రెండేళ్లకి ఓసారి జరిగే ఆ జాతర ఈసారి జనవరి 31 నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు జరుగుతోంది.

వరంగల్ పట్నానికి వంద కిలోమీటర్ల దూరంలో మేడారం అనే పల్లెటూరు ఉంది. ఏడువందల ఏళ్ల క్రితం అక్కడ జరిగిన కథే సమ్మక్క- సారక్క జాతరకు కారణం. అప్పట్లో ఈ ప్రాంతం అంతా దారుణమైన కరువుతో అల్లాడిపోయేది. ఆ కరువుకాటకాల నుంచి ఎవరైనా తమని రక్షించకపోతారా అని- అక్కడి అడవులని పాలించే కోయరాజులు ఎదురుచూసేవారు. అలాంటి సమయంలో వారికి ఓ పాప కనిపించింది. చుట్టూ పులులు, సింహాలు కాపలా కాస్తుండగా, ఆ పాప ఓ పుట్ట మీద పడుకుని కనిపించింది. ఆ పాప తమకోసం అవతరించిన దేవతే అనుకున్నారు ఆ కోయరాజులు. ఆ పాపకు సారక్క అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.

సారక్క నిజంగా దేవతలాగానే కరుణించేది. ఆమె చేతితో పసరు మందు ఇస్తే, ఎలాంటి రోగమైనా నయం అయిపోయేది. సారక్క యుక్త వయసుకి రాగానే మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. సారక్క దంపతులకి జంపన్న, సారక్క, నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మేడారం ప్రాంతంలో మళ్లీ కరువు మొదలైంది. కరువు వల్ల పగిడిద్ద రాజు, కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టలేకపోయాడు. దాంతో వేలాది మంది కాకతీయ సైనికులు, మేడారం మీద యుద్ధానికి వచ్చారు.

సమ్మక్క తన కుటుంబంతో కలిసి కాకతీయ సైనికులని ఎదుర్కొంది. ఆ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్ద రాజు; కూతుళ్లు సారక్క, నాగులమ్మ; అల్లుడు గోవిందరాజులు చనిపోయారు. వాళ్ల చావు గురించి విన్న జంపన, అక్కడే ఉన్న సంపంగివాగులోకి దూకి మరణించాడు. అప్పటి నుంచి ఆ వాగులోని నీరు ఎర్రగా మారిపోయాయని చెబుతారు. ఆ వాగుకి జంపనవాగు అని పిలుచుకుంటున్నారు. ఇంత జరిగినా కాకతీయ సైన్యం, సమ్మక్కని మాత్రం ఓడించలేకపోయారు. దాంతో దొంగచాటుగా ఆమె మీదకి బాణాలు వేసి, సారక్క ఒళ్లంతా తూట్లు పొడిచారు.

యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సారక్క అక్కడి నుంచి నడుచుకుంటూ చిలకలగుట్ట వైపు వెళ్లింది. సారక్కని అనుసరిస్తూ వెళ్లిన బంధువులకి ఆమె కనిపించలేదు సరికదా... ఆమె అదృశ్యం అయిపోయిన చోట- ఓ కుంకుమభరిణె కనిపించింది. తమ కష్టాలన్నీ తీర్చేందుకు సారక్కే, కుంకుమభరిణెగా మారిపోయిందని ప్రజల నమ్మకం. అప్పటినుంచి ప్రతి రెండేళ్లకి ఓసారి మాఘపౌర్ణమి సమయంలో సమ్మక్క జాతరని చేసుకుంటున్నారు.

సమ్మక్క జాతరని నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటి రోజు సారలమ్మ రూపాన్ని, మేడారంలోని గద్దె మీద నిలబెడతారు. రెండో రోజు చిలకలగుట్టలో, భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకు తీసుకువస్తారు. మూడోరోజు సమ్మక్క, సారక్కలు ఇద్దరూ గద్దె మీద ఉండి భక్తులకి దర్శనమిస్తారు. నాలుగో రోజు సమ్మక్కసారక్కలను గద్దె మీదకు దించడంతో జాతర పూర్తవుతుంది. ఈ నాలుగు రోజులూ లక్షలకొద్దీ జనం మేడారానికి వస్తారు. అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి, తమ మొక్కులను తీర్చుకుంటారు.