సర్వజ్ఞుడు సాయిబాబా (Sarvagnudu Saibaba)

 

సర్వజ్ఞుడు సాయిబాబా

(Sarvagnudu Saibaba)

 

సాయిబాబా భక్తుల్లో దాసగణు చాలా ముఖ్యమైన వాడు. ఆయన ''ఈశోపనిషత్తును మరాఠీలోకి అనువదించాలి అనుకున్నాడు. కార్యరూపంలో అది చాలా కష్టమైన పని అర్ధమై బాబా దగ్గరికి వెళ్ళి తన మనసులోని భావాలను దాపరికం లేకుండా చెప్పాడు. ''బాబా, మీరు బోధపరిస్తే తప్ప, నేను ఈశోపనిషత్తును మరాఠీలోకి తర్జుమా చేసి రాయలేను అనిపిస్తోంది.. దయచేసి మీరు వివరించి చెప్పండి'' అని అడిగాడు.

 

సాయిబాబా, దాసగణు వంక చూసి చిరునవ్వు నవ్వి ''ఈశోపనిషత్తు సారమే కదా నీకు కావలసింది.. దాని గురించి దిగులు పడాల్సిన పని లేదు... విల్లేపార్లేలో ఉంటున్న కాకా సాహెబ్ దీక్షిత్ ఇంట్లో పని చేసే అమ్మాయి నీకు దాని భావం చెప్తుంది..'' అన్నాడు.

 

దాసగణుకు ఆ మాట నచ్చలేదు. బాబాకు తాను శక్తికి మించిన పని నెత్తిన వేసుకున్నాను అనిపించి ఉంటుంది. అందుకే తనను గేలి చేయడానికి అలా మాట్లాడారు. లేకపోతే ఈశోపనిషత్తు మహా మహా పండితులకే మింగుడు పడదు..దాన్ని అర్ధం చేసుకోవడం మహా జటిలమైన పని. అలాంటిది ఒక పనిపిల్ల ఈశోపనిషత్తు సారాన్ని వివరిస్తుందా?'' అనుకున్నాడు. కానీ, ఆలోచించిన తర్వాత బాబా మాటలు ఎన్నడూ వృథా పోవని, ఆయన మాటల్లో ఏదో మర్మం ఉండే ఉంటుందని గ్రహించాడు. వెంటనే విల్లే పార్లే గ్రామానికి బయల్దేరాడు. నేరుగా కాకా సాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు.

 

దాసగణు, కాకా ఇంట్లో అడుగు పెట్టగానే బాబా చెప్పిన పనమ్మాయి కనిపించింది. ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఎక్కడా విచారం అనేది కనిపించలేదు. సంతోషంతో ఆడుతూ పాడుతూ పని చేసింది. చిరిగిన దుస్తులు వేసుకున్న ఆ అమ్మాయికి దాసగణు, తాను తీసికెళ్ళిన చీర ఇచ్చాడు. కొంత సేపటికి దాసగణు ఇచ్చిన కొత్తచీర ధరించింది. కానీ చిత్రంగా పనమ్మాయి ముఖంలో ఎలాంటి తేడా లేదు. పాతచీర కట్టుకున్నప్పుడు ఎలా ఉందో, కొత్తచీర కట్టుకున్నా అలాగే ఉంది. సంతోషం అనేది డబ్బు వల్ల రాదనీ, అది మనసులోనే ఉంటుందని, ఏ స్థితిలో అయినా ఆనందంగా, సంతోషంగా ఉండొచ్చని, ఆ పేదపిల్ల స్పష్టంగా చాటి చెప్పినట్లయింది. స్థితప్రజ్ఞట గురించి ఎవరో పండితులు కాదు ఒక పనమ్మాయి చెప్పడం ఎంత గొప్ప సంగతి.. బాబా నువ్వు ఉన్నచోటే ఉండి అందరి మనసులూ చదువుతావు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా మర్మాలు బోధిస్తావు'' అనుకున్నాడు దాసగణు.