సాయి కటాక్షంతోనే ఈ జన్మకు మోక్షం
ఈ విశ్వమే ఓ అద్భుతం .అందులో మానవ జన్మ మరీ విశిష్ట౦. స్వర్గం, నరకం, భూమి , ఆకాశాన్ని సృష్టించిన భగవంతుడు జీవకోటికి ప్రాణం పోశాడు .ప్రాణులకు నిద్ర, ఆకలి , భయం , ఆహారం , సంభోగం ......ఇవన్ని సహజమే ! చీము , రక్తం ,మాలాలతో నిండి ఉండే ఈ శరీరం చివరకు శిథిలమై మరణానికి చేరువవుతుంది .అయితే మిగతా ప్రాణులతో పోలిస్తే మానవుడు కొంత విశిష్టమైనవాడు .ఎందుకంటే భగవంతుడు అతనికి ప్రజ్ఞ అనే విషయాన్ని బహుకరించాడు .అదే జ్ఞానం.దీని సాయంతోనే మనిషి మోక్షగామి కాగలిగాడు .తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్షసాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది .జ్ఞానాన్ని మరుగుపరుచుకుని అజ్ఞానంతో బతికితే నరకమే ప్రాప్తి .లేదంటే జంతుజన్మే గతి .పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే భూమిపై తిరిగి మనిషిగా జన్మిస్తాడు .పుట్టుక కాని , మోక్షం కాని మనిషి చేసుకునే కర్మలపైనే ఆధారపడి ఉంటుంది .శరీరాన్ని ముద్దు చేస్తే అది విషయ సుఖాల వెంట పడుతుంది .అలా అని దానిని అశ్రద్ధ చేయకూడదు . రౌతు తన గమ్యాన్ని చేరే వరకు తన గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటాడో ఈ శరీరాన్ని మనం కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి .ఈ శరీరాన్ని ఆత్మసాక్షాత్కారం , మోక్షసాధనకు వినియోగించటమే మనిషి పరమావధి కావాలి . భగవంతుడు ఈ భూమిపై కోటానుకోట్ల జీవజాలాన్ని సృష్టించాడు .కానీ, అవేవీ భగవంతుని శక్తిని గుర్తించలేకపోయాయి . అందుకే మనిషికి జ్ఞానమనే ప్రతేక శక్తినిచ్చి భూమిపై వదిలాడు. ఆ జ్ఞాన౦ సాయంతో మనిషి వివేకాన్నేరిగి తన లీలన్ని, కీర్తిని గానం చేస్తుంటే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు . మానవజన్మ లభిచటం చాలా గొప్ప అదృష్టం .ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మలభించింది .చివరకు ఈ జన్మను చూసి దేవతలే ఈర్ష్య పడతారట. తాము భూమిపై మానవ జన్మనెత్తి మోక్షం పొందాలని కోరుకుంటారట. ఇంతటి శ్రేష్టమైన జన్మను పొందిన మనిషి మోక్ష సాధనకు ప్రయత్నం చేయాలి కానీ ,మనదంతా ఉరుకులపరుగుల జీవినం.భగవంతుడిని గుర్తుచేసుకునే ఓపికే తీరిక ఎవ్వరికి లేవు.అర్ధం లేనిపోటి ,ఇతరులతో పోలికా , వాదులాట , వంతులు, ఒత్తిడి ఆరాటం మనిషి జ్ఞానాన్ని మరుగునపరుస్తున్నాయి .ఎంత సేపు నాలుగు రాళ్ళు వేనకేసుకుందామనే ఆశ !రెండు దెబ్బలు తగలగానే 'దేవుడా !ఉన్నావా ?ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు?ఇవన్నీచూస్తూ కుర్చున్నావా ?నీ దర్శననికి వస్తా ..నా కష్టాలు తీర్చు 'అని ఎడతెగకుండా ప్రార్ధనలు చేస్తాం .అంతా సవ్యంగా జరిగిపోతుంటే 'అంతా నా ఘనతే 'అని మనకు మనమే కితబిచ్చుకుని మురిసిపోతా౦. ఇదేనా జీవితం ?దీనికి ముందు వెనుకా మరేమి లేవా ?ఈ ప్రశ్నలు కు సమాధానమే సాయితత్వం .మనిషికి జీవిత పరమావధి ఏమిటి? మోక్ష సాధనకు మార్గమేది ?ఆత్మ సాక్షాత్కారం పొందటం ఎలా ?ఈ జన్మను ఈ భూమిపైనే చరితార్డం చేసుకోవటం ఎలా ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసునే ముందు షిర్డీ సాయిబాబా గురించి తెలుసుకోవాలి .బాబా సమర్ధ సద్గురువు .బాబా జీవనశైలి , వైఖరి, లీలల్లోని పరమార్ధాన్ని మొదట అర్ధం చేసుకోవాలి . ఆ తరువాత బాబా సూచించిన ఆదర్శ జీవన బాటలో నడిచే ప్రయత్నం చేయాలి .అపుడు మనకుతెలియకుండానే బాబా మన వేలు పట్టి మోక్ష మార్గంలోనడిపిస్తారు.అపుడు సాయిపథాన్ని అనుసరించగలుగుతాం .