Read more!

సాయి శుభమైన వాటినే ప్రసాదిస్తారు !

 

సాయి శుభమైన వాటినే ప్రసాదిస్తారు !

ఆత్మజ్ఞానం కలగనంత వరకు, రాగద్వేషాలను జయించలేనంత కాలం మన జన్మ పునరపి జననం పునరపి మరణంగా జీవన చక్రంలో తిరుగాడుతూనే ఉంటుంది. రాగద్వేషాలను వీడకపోతే పారమార్థిక పరమపద సోపానంలో మనం పాముల నోట చిక్కుకుని కిందికి దిగజారిపోతూనే ఉంటాం.

ఒక సందర్భంలో బాబా అంటారు. "అందరు దేవుళ్లు ఆకాశమందే ఉన్నారు. అందరి అవసరాలు భూమిపైనే ఉన్నాయిం మనమందరం భూమిపైనే ఉన్నాం. ఆకాశానికి ఎదుగుటయా? భూమిలోకి ఒదుగుటయా? అనేది మీరే నిర్ణయించుకోండి. కానీ, ఒక్కమాట ! మనం చేరుకోవాల్సింది పైకే. మనం చేరుకునే మార్గంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోతే, వ్యామోహాల నోట చిక్కితే అథ పాతాళానికి జారిపోతాం."

అదృష్టవశాత్తూ మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగించేది, ఉత్తమ గతిని చేర్చేందుకు నిచ్చెన వంటింది సాయిపథం. బాబానే సంపూర్ణంగా నమ్మి, బాబా అడుగుజాడల్లోనే నడిస్తే ఈ జన్మ భూమిపైనే ధన్యమవుతుంది.

ప్రార్థించో, తపస్సు చేసో భగవంతుడి కరుణను సంపాదించి మనకు కావాల్సింది వరంగా పొందుతాం. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కోరినదేదైనా కాదనకుండా భగవంతుడు వరంగా ప్రసాదిస్తాడు. అడిగినదేదీ కాదనకుండా ఇస్తాడనే అసురులు ఎన్నో కఠోర తపస్సులు చేసి భగవంతుని అనుగ్రహం  సంపాదించి లెక్కలేనన్ని వరాలు పొందారు. చివరికి అవే వరాలు వారికి చివరిలో ప్రాణాంతకంగా పరిణమించిన సందర్భాల గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ, సద్గురువు తీరే వేరు. సద్గురువు మనం కోరినది మనకివ్వటం కాక, మనకేది మంచిదో, ఏది చెడ్డదో వివేచించి శుభమైన దానినే ప్రసాదిస్తారు.

సద్గురువులోని మరో విశిష్టత ఏమిటంటే తన శిష్యులకు, తననే నమ్ముకున్న వారికి భగవంతుడిని చేరే మార్గం చూపిస్తారు. శిష్యుల బరువు బాధ్యతలు, సాధక బాధకాలను తానే మోస్తాడు, భరిస్తాడు. శిష్యుల్ని తన బిడ్డల్లా కంటికి రెప్పలా చూసుకుంటారు. తల్లి, తండ్రి, గురువును పూజించి, గౌరవించి మతగ్రంథాలను అభ్యసించాలని తైత్తిరీయోపనిషత్ చెబుతోంది. ఇవే మన మనసులను పావనం చేసే మార్గాలు. మనసు పావనం కానిదే ఆత్మసాక్షాత్కారం పొందలేం. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆత్మను చేరలేవు. గురు కటాక్షాలే మనకు అందుకు తోడ్పడతాయి. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్లే లభిస్తాయి. నాలుగవదైన మోక్షము గురు సహాయం వల్ల మాత్రమే కలుగుతుంది.

మనం మనసా, వాచా, కర్మణా బాబానే నమ్ముకుంటే కనుక, మన మనసులో కలిగే మంచి ఆలోచన కాని, చెడు ఆలోచన కాని ప్రతీదీ బాబా దృష్టిని దాటిపోలేదని గ్రహించాలి. ఎంతో దూరంలో ఉన్నా బాబా తన భక్తుల మదిలో మెదిలే చిన్న మంచి భావాన్నైనా గుర్తించి ప్రోత్సహిస్తారు. చిన్నపాటి చెడు తలంపునైనా తుంచివేస్తారు. కనువిప్పు కలిగిస్తారు. ఇవన్నీ బాబా అవతార ప్రాశాస్త్యాలే. మనలో కలిగే ప్రతి ఆలోచన బాబాను చేరుతుందన్న విషయం నిరంతరం గుర్తుంచుకుంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు మనసులోకి చేరవు.

బాబా తన జీవిత కాలం మొత్తంలో భక్తులను సవ్యమైన మార్గంలో నడిపించటానికే ప్రయత్నించారు. మంచి, చెడుల విచక్షణను నేర్పుతూ భక్తులను చేయిపట్టి సన్మార్గంలో నడిపించారు. బాబా సచ్చరిత్రలోని బోధనల్లో ఏ కొన్నింటిని పాటించినా వ్యక్తిత్వ వికాస సంపన్నులమవుతాము. సాయి లీలలు మనో మాలిన్యాలను కడిగేసి మనసుకు స్థిరత్వాన్ని, నిర్మలత్వాన్ని కలిగిస్తాయి.