సాయి పథమే సత్యం....సాయితత్వమే శాశ్వతం
సాయి పథమే సత్యం....సాయితత్వమే శాశ్వతం
ఒక భక్తుడు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ షిర్డీ చేరుకున్నాడు. షిర్డీ సాయినాథుడు నడిచిన పుణ్యభూమి కదా! బాబా కర, పాద స్పర్శలతో ఆ నేల అణువణువూ పవిత్రతను సంతరించుకుంది. ఆ యాత్రికుడి మనసు పులకరించింది. గొప్ప శాంతి కలిగింది. ఆ ఆనందంతో చెట్టు నీడన కూర్చున్నాడు. వెంటనే నిద్రకమ్ముకొచ్చింది.
"చక్కని పాన్పు ఉంటే కమ్మగా నిద్రపోదును" కదా! అనుకున్నాడు. షిర్డీలో ప్రతిచెట్టూ కల్పవృక్షమే కదా ! సాయి అనుగ్రహ బలం వల్ల అతను కూర్చున్న చెట్టు అతని కోరికను తీర్చింది. వెంటనే హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై హాయిగా పడుకుని, "అలసిపోయి ఉన్నాను. ఎవరైనా వచ్చి కాళ్లు వత్తితే ఎంత బాగుండు?" అనుకున్నాడు. వెంటనే ఆ కోరిక తీరింది. కొద్ది సేపటికి అతనికి ఆకలి పుట్టింది, "భోజనం చేస్తే బావుంటుంది" అనుకున్నదే తడవుగా పంచభక్ష పరమాన్నాలు అతనికి విందు చేసాయి.
"దేవుడు ఇన్ని భోగాలు ఇచ్చాడు భాగ్యం కూడా ఇస్తే నా చింత తీరిపోయినట్టే" అనుకున్నాడు. క్షణాల్లో ధనధాన్యాలు అక్కడ రాశులై వెలిశాయి. తలవటమే పాపం అన్నీ జరిగిపోతుండే సరికి ఆ భక్తునికి మతిపోయింది. తానున్నది షిర్డీలో అని కాని, అది ఒకప్పుడు బాబా పాదం మోపిన పవిత్ర నేల అని కాని, బాబా అనుగ్రహ బలం వల్లే తనకు నీడనిచ్చిన చెట్టు కల్పవృక్షమై కోరికలు తీరుస్తోందని కాని ఆ భక్తుడు గ్రహించలేకపోయాడు.
కొద్దిసేపు భోగ,భాగ్యాలు అనుభవించే సరికి అతనిలో వ్యామోహం పుట్టుకొచ్చింది, ఏమైనా సంపదంతా సొంతం కావాలనే స్వార్థం, దానిని ఎవరైనా కొల్లగొట్టుకుపోతారేమోననే భయం, సంపద వచ్చింది వచ్చినట్టే పోతే ఏం చేయాలి దుఃఖం మొదలైంది.
తనలో కలిగే ఆలోచనలకు తగ్గట్టే "ఇప్పుడు దొంగలు వచ్చి ఈ సంపదను దోచుకుపోరు కదా?" అనుకున్నాడు. అలా అనుకోవటమే పాపం...నిజంగానే దొంగలు వచ్చి కూర్చున్నారు. బెదిరిపోయిన భక్తుడు వెంటనే "దేవుడా! వీళ్ళ పీడా విరగడ చేయి" అని ప్రార్థించాడు.
ఇప్పుడు ఆ భక్తుడిలో ప్రాణభయం మొదలైంది. "ఈ ధనాన్ని కాపాడుకోవాలి! ఇంకా ఎక్కువ కాలం జీవించాలి. ఈలోపుగా ప్రాణం పోతే ఎలా? ప్రాణం పోదుకదా!" అనుకున్నాడు. అనుకున్నంతా అయింది. ఎదురుగా యమదూతలు నిలిచారు. భక్తుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. మనసులో భయం తప్ప మరో ఆలోచన లేకపోయింది. ప్రాణం ఉగ్గబట్టి కళ్ళుమూసుకున్నాడు. అతనున్నది షిర్డీలో భక్తులు ఆపదల బారిన పడితే బాబా చూస్తూ ఊరుకోరు కదా! బాబా ప్రాణభిక్ష పెట్టి భక్తుడిని కాపాడారు. భక్తుడికి జ్ఞానోదయం అయింది.
లోకుల రీతి ఇలాగే ఉంటుంది. భగవంతుడు కల్పతరువు. మనం ఏం కోరినా అనుగ్రహిస్తాడు. అయితే, మన కోరికల్లోని మంచెంతో, చెడెంతో మనమే ఆలోచించుకోవాలి. జీవితంలో తృప్తి చెందటం, కోరికలు తీరటం, వ్యామోహం వీడటం ఈ జన్మకి జరగనివి. మనం భగవంతుడిని అంతులేని సంపదలు, సుఖాలు ప్రసాదించమని కోరుకుంటాం. చివరకు ఏమౌతుంది? వాటిపై పెంచుకున్న వ్యామోహం భయానికి, దుఃఖానికి కారణమవుతుంది. మనం కోరుకునే ప్రతి భౌతిక కోరిక వెనుక ఓ పెద్దపులి దాగి ఉంటుంది. అది చివరకు భయాన్ని దుఃఖాన్ని మిగిలిస్తుంది. కాబట్టి చిన్నా, చితకా కోరికలు తీర్చమని బాబాను వేడుకుంటూ మనలోని శక్తిని దుర్వినియోగం చేసుకోవటం ఎందుకు? ఏకంగా సాయినాథుడి అనుగ్రహాన్నే కోరుకుందాం. సాయి అనుగ్రహమే శాశ్వతం. మిగతావన్నీ ఈరోజు ఉండి రేపు వెళ్లిపోయేవే! సాయితత్వమే శాశ్వతం. మనం దానినే ఎంచుకుందాం. సాయిపథంలో నడుద్దాం. సాయి చెప్పిన మంచి మాటలను ఆలకిద్దాం. వాటిని ఆచరించి జీవిత పరమార్థాన్ని సాధిద్దాం.