Ravana 10 faces
రావణుడికి పది తలలు లేవు...
Ravana 10 faces
మన పురాణ గ్రంధాల్లో అనేక విషయాలు వింతగా, విడ్డూరంగా కనిపిస్తాయి. ఉదాహరణకు లంకాధిపతి రావణాసురుని దశకంఠుడు అంటారు. అంటే ఆయనకు పది తలలు అన్నమాట. కానీ ఇదెలా సాధ్యం?
రావణాసురుడు మహా శక్తిసంపన్నుడు. ఎన్నో విద్యల్లో ఆరితేరినవాడు. ఎన్ని గొప్ప గుణాలు ఉంటేనేం, కొన్ని బలహీనతల కారణంగా ప్రతినాయకుడు అయ్యాడు.
పది తలల రావణాసురుని ఊహించుకుంటేనే పరమ ఆశ్చర్యంగా ఉంటుంది. పది తలల రావణాసురుడు ఏ తలతో తింటాడు? దేనితో వింటాడు? అసలు అన్ని తలలతో ఎలా పడుకుంటాడు? పక్కకు వత్తిగిలి పడుకోడానికి సాధ్యం కాదు. కదలకుండా ఒక విగ్రహంలా పడుకోవడం ఎంత కష్టం?! ఒకవేళ తలనొప్పి వస్తే? ఒక తలకు నొప్పి వస్తే తట్టుకోవడమే మహా కష్టం. అలాంటిది పది తలలకు శిరోభారం అంటే మాటలా? నరకయాతన కాదూ?!
రావణాసురునికి కుంభకర్ణుడు, విభీషణుడు సోదరులు. అలాగే రావణుడి కొడుకు ఇంద్రజిత్తు. వాళ్ళెవరికీ లేని పది తలలు రావణాసురునికి ఎందుకున్నాయి? పది తలలు అందం, ఆకర్షణ కాకపోగా విచిత్రంగా, వింతగా తోస్తాయి. వాటితో అదనపు సుఖము, సౌలభ్యం లేకపోగా కష్టాన్ని, ఇబ్బందిని కలగజేస్తాయి.
రావణుడు మహా శక్తిసంపన్నుడు. శత్రుభయంకరుడు. వేదాధ్యయనం చేసిన శుద్ధ బ్రాహ్మణుడు. మహా పండితుడు. వేద స్వరాలకు సంబంధించి లక్షణ గ్రంధం రాశాడు. సంగీత సాధన చేసినవాడు. గొప్ప శివభక్తుడు. ఆత్మలింగాన్ని సాధించిన మహా తపశ్శాలి. ఆయుర్వేద శాస్త్రంలో ఆరితేరిన నిపుణుడు. ఆయనలో ఎన్నో సుగుణాలు, సామర్ద్యాలు ఉన్నాయి. సీతమ్మను మోహించి ఎత్తుకువెళ్ళాడు కానీ, ఆమె కాదంటే తాకలేదు. ఆమెను ఒప్పించి సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇన్ని అద్భుత గుణాలకు సంకేతంగా, రావణాసురుని దశకంఠునిగా తీర్చిదిద్దారు.
కనుక రావణాసురునికి పది తలలు లేవు. శరీరం అంతటిలోకీ తల మహోత్కృష్టమైంది. మెదడు, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు - ఇలా అతి ముఖ్యమైన అవయవాలు ఉన్నది తలలోనే. అందుకే ఎవరైనా తెలివితక్కువగా వ్యవహరిస్తే ''తల లేదా?'' అనేస్తాం. ఒక తలతోనే ఇంత తెలివిగా ఉంటే, పది తలలు ఉంటే ఇంకెంత తెలివి ఉంటుంది - అనే ఆలోచనతో రావణుని దశకంఠుని చేశారు. ఆయన అసామాన్యమైన సామర్ధ్యాలకు నిదర్శనంగా ఒక తల కాదు, పది తలలు ఉన్నాయని చెప్పడం అన్నమాట.
Ravanasura king of Lanka, Dashakantha devotee of lord shiva, 10 faces Ravana, Ravanasura 10 faces dashakantha, Ravanasura scholar in all respects