రామో విగ్రహవాన్ ధర్మః
రామో విగ్రహవాన్ ధర్మః
సకల సుగుణాలు, ధర్మం, న్యాయం మూర్తీభవించితే అది అచ్చంగా రాముని రూపమే అవుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపై జన్మించిన ఆనాడు ఆదర్శ ప్రభువు. ఆదర్శ కుమారుడు, ఆదర్శ సోదరుడు. మరి ఈనాడు శ్రీరాముడు దేవుడు.
రాముడు విష్ణువు అవతారమనే అంశాన్ని పక్కనుంచితే రాముడిలోని ఎన్నెన్నో సుగుణాలు అతడిని దైవం అనే స్థాయికి తీసుకెళ్ళాయి. ధర్మ సంస్థాపనార్థం ఎందరో రాక్షసులను నిర్జించిన వీరుడు ఆయన. పట్టాభిషేకాన్ని, వనవాసాన్ని సమానంగా స్వీకరించిన స్థితప్రజ్ఞుడు.
తల్లిదండ్రుల పట్ల, మిత్రులు, సన్నిహితులు, ప్రజల పట్ల ఓకే విధమైన అనురాగం కలిగి ఉండడం శ్రీరామునిలోని ప్రత్యేక లక్షణాలు. శ్రీరాముడు హిందూ ధర్మానికి ప్రతీక, హిందువు ఎలా నడవాలని హైందవ ధర్మాలు సూచించాయో, ఆ సూచనల ప్రకారం నడిచిన మహనీయ వ్యక్తి శ్రీరాముడు. ఏ లోకకంటకుడినో సంహరించి, సకల జీవకోటికీ ఆరాధ్యులైపోయిన దేవతలకు, శ్రీరాముడు ఒక మినహాయింపు.
రావణ సంహారమన్నది ఆయన అవతారంలో ఒక ఘట్టం మాత్రమే. అలా రావణుడిని సంహరించినందు వలన మాత్రమే ఆయన దేవుడైపోలేదు. జీవితంలో బాల్యం నుంచి ప్రతి దశలోనూ పోరాడి గెలిచి, మనకు గెలుపు సూత్రాలను ప్రబోధించాడాయన.
విశ్వామిత్రుని శిష్యరికంలో, ఒక రాకుమారుడిని అన్న విషయం మర్చిపోయి, సామాన్యుని వలె శిశ్రూష చేసి, గురువుని మెప్పించి, అస్త్రశస్త్రాదులు సంపాదించాడు. ఆ శాస్త్రాలను దుర్వినియోగం చేయకుండా తగిన సమయంలో మాత్రమే వినియోగించాడు. ఎంత శక్తిశాలి అయినా తన శక్తిని గురించిన అతి విశ్వాసం శ్రీరాముడిలో కనిపించదు. సమయం వచ్చినప్పుడు ఆ శక్తి కనిపిస్తుంది అంతే. ఇక తండ్రి ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వెళ్ళిన సమయంలోనూ, రాజ్యాన్ని కోల్పోయానన్న చింత ఏమాత్రం ఆయనలో కనిపించదు. ఇది భోగలాలస మీద రాముడికి ఆసక్తి లేదని చెబుతుంది.
రాముడి కంటిలోనూ కన్నీరు చిందిన సందర్భాలున్నాయి. సహధర్మచారిణి సీతామాత వియోగ సమయంలోనూ, ప్రాణ సమానుడు, సోదరుడు లక్ష్మణుడు మూర్చిల్లి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాముడిలో మనం కన్నీరు చూస్తాము. ఇది సన్నిహితుల పట్ల రామునిలో అనురాగానికి ప్రతీకగా భావించాలి.
సీతా అన్వేషణలోనూ మొక్కవోని పట్టుదల ప్రదర్శించాడు రాముడు. వానరులతో మైత్రి, వారధి నిర్మాణం వంటివి చూసినప్పుడు, ఇది సాధ్యమయ్యే పనేనా అన్న సంశయం శ్రీరామునిలో ఎప్పుడూ కనిపించదు. కార్యసాధకునిలో కావలసిన పట్టుదల, కర్తవ్య దీక్ష మాత్రమే కనిపిస్తాయి. ఇవి రామునిలో పోరాడి గెలిచిన సందర్భాలకు ఉదాహరణలు.
ధర్మానికి ప్రతీకగా నిలబడిన సందర్భాలకైతే అంతే లేదు. రాముడిలో ప్రతి అడుగూ ధర్మానికి నిలువుటద్దం. న్యాయానికి ప్రతిరూపం.
శ్రీరామ నవమికి ఏం చెయ్యాలి ?
సకల గుణాభిరాముడైన శ్రీరాముడు కళ్యాణమహోత్సవాన్ని శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా జరుపుకుంటూ తొమ్మిది రోజులు వేడుకలు జరుపుకుంటాము. చైత్రశుద్ధ పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు నవరాత్రులు జరపాలి. ఇలా నవరాత్రి ఉత్సవాలు జరిపే సంప్రదాయం కేవలం మూడు సందర్భాలలోనే కనిపిస్తుంది.
వినాయకచవితి వేడుకలలోనూ, శరన్నవరాత్రి వేడుకలలోనూ మిగిలిన రెండుసార్లూ జరుపుతాము. శ్రీరామనవమి సందర్భంగా జరిపే నవరాత్రులలో రామ పారాయణం చేయాలి. రామాయణం పఠించాలి. నవమినాడు రామ జనన ఘట్టం చదివి వినిపించాలి. ఇదంతా చేయలేని వారు, కనీసం నవమి నాడు శ్రీరాముని పూజించి, తీర్థ ప్రసాదాలు సేవించాలి.