లంకలో రామాయణం

 

 

 

లంకలో రామాయణం

 

 

మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ రామాయణంతో ముడిపడి ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయిన చోటు (పర్ణశాల), లక్ష్మణుడు, సూర్పణఖ ముక్కు కోసిన చోటు (నాసిక్) అంటూ వేర్వేరు ప్రాంతాలతో రామాయణ ఘట్టాలు ముడిపడి ఉంటాయి. అలాంటిది రామాయణంలోని ముఖ్య పాత్ర అయిన రావణాసురుడు నివసించిన లంకలో మరెన్ని ప్రాంతాలు ఉండాలి. మీరే చూడండి....

సంజీవని పర్వతం

రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు సంధించిన బాణాలకు లక్ష్మణుడు మూర్ఛబోతాడు. ఆ మూర్ఛ నుంచి మేల్కొల్పేందుకు సంజీవని మూలిక ఉన్న పర్వతాన్ని తీసుకురమ్మని హనుమంతుని కోరతారు. ఆ మూలిక ఏదో తెలియని హనుమంతుడు, హిమాలయాల నుంచి మొత్తం పర్వతాన్నే పెళ్లగించి తీసుకువస్తాడు. ఆది శ్రీలంకలోని రుమశ్శల, దోలుకండ, రితిగల, తల్లాడి, కచ్చతీవు... అనే అయిదు ప్రాంతాలలో పడిందని చెబుతారు. ఇప్పటికీ అక్కడ ఔషధ గుణాలు ఉన్న మూలికలు దొరుకుతూ ఉంటాయట.

అశోక వాటిక

అశోక వాటిక ఘట్టం గురించి చెప్పుకోనిదే... లంకలో రామాయణం పూర్తికాదు. రావణాసురుడు సీతమ్మను బంధించింది ఆ అశోకవాటికలోనే కదా! శ్రీలంకలోని ‘నువారా ఏలియా’ అనే పట్నం దగ్గరలో ఆనాటి అశోకవనం ఉండేదని చెబుతారు. ఇప్పటికీ ఇక్కడ దట్టంగా వృక్షాలు కనిపిస్తాయి. ప్రస్తుతం వీటిని Hakgala Gardens అని పిలుస్తున్నారు. వీటికి దగ్గరలోనే సీతాదేవి ఆలయం కనిపిస్తుంది. హనుమంతుడు, సీతమ్మను ఇక్కడే కనుగొన్నాడని చెబుతారు. అందుకు సాక్ష్యంగా ఆయన పాదముద్రలూ కనిపిస్తాయి. ఇక్కడే సమీపంలోని సెలయేరులోనే సీతాదేవి స్నానం చేసేదట!

సీతమ్మ అగ్నిప్రవేశం

రావణ సంహారం జరిగిన తరువాత సీతమ్మ తన పవిత్రత నిరూపించుకోవాల్సిన సందర్భం వస్తుంది. అప్పుడు సీతాదేవి అగ్నిప్రవేశం చేసి తన మహత్యాన్ని చాటుకుంటుంది. ఈ ఘట్టం ‘నువారా ఏలియా’ పట్నానికి 20 కిలోమీటర్ల దూరంలోని ‘దివురుంపోలా’ అనే ప్రదేశంలో జరిగిందని చెబుతారు. ‘దివురుంపోలా’ అనే శపథం చేసిన చోటు అని అర్థం. ఇప్పటికీ స్థానికుల మధ్య ఏదన్నా తగాదా వచ్చినప్పుడు, ఇక్కడకు వచ్చి తమ మాట నిజమేనని ఒట్టు పెట్టుకుంటారు.

రావాణాసురుని గుహలు

 

శ్రీలంకలోని ‘కలుతార’ అనే ప్రాంతంలోనే ఒకప్పుడు ఆయన రాజసౌధం ఉండేదని చెబుతారు. అక్కడి నుంచి లంకలో ఎక్కడికైనా చేరుకునేందుకు రకరకాల సొరంగాలు కనిపిస్తాయి. వీటిని దగ్గరగా పరిశీలిస్తే, ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలు కానీ మానవులే నిర్మించుకున్న సొరంగాలనీ అనుమానం వస్తుంది.

రాముని శివలింగాలు

 

రావణాసురుని సంహరించాడన్న మాటే కానీ... తనకు బ్రహ్మహత్యా దోషం చుట్టుకుందని బాధపడ్డాడట రాముడు. ఆ పాతకాన్ని పరిహరించుకునేందుకు ఆయన లంకలోని మూడు చోట్ల శివలింగాలని ప్రతిష్టించాడట. అవే చిల్లావ్ అనే పట్నంలో ఉన్న ‘మున్నీశ్వరం ఆలయం’, మన్నార్ ద్వీపంలో ఉన్న ‘తిరుకితీశ్వరం ఆలయం’, ట్రింకోమలీ పట్నంలో ఉన్నా ‘కోనేశ్వరం ఆలయం’.... ఈ మూడు ఆలయాలనీ వరుసగా దర్శించడం ఓ పుణ్యంగా భావిస్తారు రామభక్తులు.

ఇంతేకాదు! హనుమంతులవారు లంకను దహనం చేసిన చోటు, రావణుడు సీతమ్మను లంకలోకి తీసుకువచ్చిన దారి, రాముడు విశ్రమించిన చోటు, రాముడు రావణుని చంపిన ప్రదేశం అంటూ శ్రీలంకలో దాదాపు 50 ప్రదేశాలు కనిపిస్తాయి. ఆ ప్రదేశాల పేర్లు కూడా ఆయా ఘట్టాలను గుర్తుచేసేలా ఉంటాయి. పర్యటకులు వీటన్నింటినీ వరుసగా చూసుకుంటే వెళ్లేలా శ్రీలంకలోని బోలెడు సంస్థలు ప్రత్యేకమైన ఆఫర్లు కల్పిస్తూ ఉంటాయి.

- నిర్జర.