శివధనుర్భంగం ఎలా జరిగింది??

 

శివధనుర్భంగం ఎలా జరిగింది??

పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వకుండా యాగము ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి (పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు. వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు.

ఆ ధనుస్సుని జనక మహారాజు వంశములో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా (అంటే కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలో(పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలో శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.

సంతానము కొరకై యజ్ఞనియమముగా జనక మహారాజు భూమిని దున్నగా అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచారు. (జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు). ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపుతో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకొందామన్న వ్యామోహం పొందారు. అందుకని  ఆమెని వీర్య శుల్కగా ( పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు. ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవారు.

ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరమూ ఒకటై, జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మిథిలా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు  రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త (భూమిని తవ్వి దానిని నీళ్ళతో నింపుతారు) తవ్వి, ద్వారాలు మూసేశాము. ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక  ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు జనక మహారాజు తపస్సు చేసాడు, తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని జనక మహారాజుకు  కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో రాజులని ఓడించాడు  జనకుడు. ఇదంతా జనకుడు విశ్వామిత్రుడికి ఆయన వెంట వెళ్ళిన రామలక్ష్మణులకి చెప్పాడు.

ఆ తరువాత జనకుడు "ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానముగా ఇస్తాను" అన్నాడు. ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు.

ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా. సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకోచ్చాము చూడండి అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది. దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు. ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు.

రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో "ఫడేల్" అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.

అప్పుడు జనకుడు 'మహానుభావ విశ్వామిత్రా!! నీకు తెలుసు. అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు, ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది" అన్నాడు. 

అలా శివధనుర్భంగం జరిగింది.

◆వెంకటేష్ పువ్వాడ.