గర్భనిరోధక మాత్రలతో ఫ్లూ మాయం
గర్భనిరోధక మాత్రలతో ఫ్లూ మాయం
సాధారణంగా ఏదన్నా మాత్రలు వాడితే వాటి వల్ల దుష్పలితాల గురించే వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఒక మాత్ర తీసుకోవడం వల్ల ఇనఫ్లూయెంజా మాయమవుతుందంటూ ఒక పరిశోధన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ పరిశోధన ఏమిటంటే...
Progesterone పని
స్త్రీలలో ఎక్కువగా కనిపించే ఒక హార్మోను పేరే ప్రొగెస్టెరోన్. ఆడవారి రుతుచక్రంలోనూ, గర్భం దాల్చడంలోనూ ఈ హార్మోనుది ముఖ్య పాత్ర. ఈ హార్మోను ఆధారితంగా ఉన్న కొన్న మాత్రలను తీసుకోవడం వల్ల రుతుచక్రం స్థిరంగా ఉండిపోయి, గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదికోట్ల మంది ఈ ప్రొగెస్టరాన్ ఆధారిత గర్భనిరోధక మాత్రలను వాడుతున్నారని అంచనా. ఇతర రకాలైన గర్భనిరోధక మాత్రలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి కాబట్టి, వీటి వాడకం నానాటికీ పెరిగిపోతోంది.
Progesterone ప్రభావం
ప్రొగెస్టెరోన్ ఉన్న గర్భనిరోధక మాత్రలను వాడటం వల్ల ఇతరత్రా ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకొనేందుకు ‘సాబ్రా క్లెయిన్’ అనే ప్రొఫెసర్ నేతృత్వంలో ఒక పరిశోధనను నిర్వహించారు. ఇందులో భాగంగా కొన్ని ఎలుకలలో ఇన్‌ఫ్లూయెంజా కలిగించే వైరస్‌ను చొప్పించారు. ఈ వైరస్ వల్ల సహజంగానే ఆ ఎలుకన్నీ ఫ్లూ బారిన పడ్డాయి. వీటిలో కొన్ని ఎలుకలకి ప్రొగెస్టెరోన్ హార్మోనుని అందించినప్పుడు, ఫ్లూకి సంబంధించిన లక్షణాలు మాయం కావడాన్ని గమనించారు. వీటిలోని ఊపిరితిత్తులు బలాన్ని పుంజుకోవడమే కాకుండా, అప్పటివరకూ దెబ్బతిన్న ఊపిరితిత్తుల భాగం శుభ్రంగా నయమైపోయిందట.
చాలా విషయాలే తెలిశాయి
ప్రొగెస్టెరోన్‌ను ఎలుకలకు అందించినప్పుడు, వాటిల్లో యాంఫిరెగ్యులిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అయ్యిందనీ... ఆ ప్రొటీన్ కారణంగా అవి ఫ్లూని ఎదుర్కోగలిగాయని తేలింది. ప్రొగెస్టెరోన్ వంటి హార్మోనులు కేవలం స్త్రీలలో సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగపడతాయని ఇప్పటివరకూ నమ్మేవారు. కానీ అవి శరీరంలోని రోగాలను పోరాడేందుకు కూడా తోడ్పడతాయని తాజా పరిశోధనతో తేలిపోయింది. దీంతో మన శరీరంలో హార్మోనుల పనితీరు గురించి మరిన్ని పరిశోధనలకు ఈ నివేదిక దారితీసినట్లయ్యింది.
ఒకవేళ రకరకాల హార్మోనులు రకరకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ముఖ్య పాత్రని వహిస్తాయని తేలితే, మన చికిత్సలను, ఆ చికిత్సలలో ఉపయోగించే మందులను తిరగరాయవలసి ఉంటుందేమో!
- నిర్జర.