Trayodashi Vrat for Power
త్రయోదశి వ్రతంతో అధికారప్రాప్తి
Trayodashi Vrat for Power
త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. ఈవ్రతం ఆచరించడానికి హంగులు, ఆర్భాటాలూ ఏమీ అక్కర్లేదు. త్రయోదశి వ్రతం చాలా సులువు. ఫలితం గొప్పగా ఉంటుంది. అయితే ఇది సుదీర్ఘకాలంపాటు చేయాల్సిన వ్రతం. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. అలా 11 సంవత్సరాల పాటు ఆచరించాలి. ఏదయినా ఆటంకం వచ్చి మధ్యలో చేయలేకపోతే ఉద్యాపన చేసి ప్రతిమను విసర్జించవచ్చు.
ఇంతకీ త్రయోదశి వ్రతం లేదా ప్రదోష వ్రతం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా చేస్తారు మొదలైన విషయాలు తెలుసుకుందాం.
త్రయోదశినాడు చేస్తారు కనుక త్రయోదశి వ్రతం అని, శివపూజ, రాత్రి భోజనం చేయడం వల్ల ప్రదోష వ్రతం అని అంటారు. త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నం అవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు వేటికీ కొదవ ఉండదు.
అన్ని పూజలు, వ్రతాల మాదిరిగా త్రయోదశి వ్రతాన్ని ఉదయం వేళ చేయరు. సూర్యాస్తమయం నుండి రాత్రి రెండు ఘడియల లోపు ఈ పూజ చేస్తారు. ఏ నెలలో అయినా త్రయోదశి నాడు ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.
సూర్యుడు అస్తమిస్తోన్న సమయంలో స్నానం చేయాలి. పూజా మందిరాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ముఖం పెట్టి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. మందిరంలో శివుని విగ్రహాన్ని లేదా ఫొటోను ఉంచాలి. ఒకవేళ పరమేశ్వరుని ప్రతిమ లభించకపోతే తడిమట్టితో మహాశివుని రూపాన్ని రూపొందించుకుని ''శూలపాణయే నమః'' అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్టించాలి. శుద్ధోదకం, పుష్పాలు, గంధము, అక్షతలు మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి. మెడలో రుద్రాక్షమాల వేసుకుని నుదుట విభూతి దిద్దుకోవాలి. శివుని ప్రతిమకు ఎదురుగా కూర్చుని ''మమ శివ ప్రసాద ప్రాప్తి కామనయా ప్రదోష వ్రతాం గీభూతం శివ పూజనం కరిష్యే'' అని సంకల్పం చెప్పుకోవాలి.
గంధము, సుమాలు, అక్షతలతో మహాశివుని భక్తిగా పూజించాలి.
''పినాకపాణయే నమః'' అంటూ ఆవాహన చేయాలి.
''శివాయనమః'' అంటూ అభిషేకం చేయాలి.
''పశుపతయే నమః'' అంటూ గంధం, పుష్పాలు, అక్షతలు, ధూపదీపవైవేద్యాలు సమర్పించాలి.
''జయ నాథ కృపా సింధో జయ భక్తార్తి భంజన
జయ దుస్తర సంసార సాగరోత్తారణ ప్రభో ప్రసీద
సే మహా భాగా సంసారర్తస్య ఖద్యతః
సర్వ పాపక్షయం కృత్వా రక్షమాం పరమేశ్వర''
అనే శ్లోకాన్ని భక్తిగా జపిస్తూ శివుని ప్రార్ధించాలి.
''మహాదేవాయ నమః'' అంటూ పూజించిన మూర్తిని వదిలేయాలి.
pradosh vrat in india, trayodashi vrat, trayodashi vrat vidhi, trayodashi vrat rules, mahashiva trayodashi vratam, shukla paksha krishna paksha trayodashi lord shiva, lord shiva pradosh vrat