Kalagnanam- 12
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 12
Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnanam- 12
వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులను పరీక్షించ దలచి, కుక్క మాంసం తినమని ఆజ్ఞాపించిన సందర్భంలో, వాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి -
“ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు. ఎవరయితే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో, సేవిస్తారో, వారిమీద నేను ఎక్కువగా కరుణ చూపుతాను. దీనికి మీరు చేయవలసింది స్వార్థం వదిలివేయటమే !” అన్నారు.
ఈ సంఘటనతో సిద్దయ్య మాదిరిగా బ్రహ్మంగారి మిగిలిన శిష్యులందరూ కూడా స్వార్థ రహితంగా స్వామిగారిని సేవించడం మొదలు పెట్టారు. అనంతరం స్వామి ఆయన శిష్య బృందం తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒకరోజున మొత్తం ప్రయాణించిన తర్వాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తన శిష్యులతో ఆధ్మాత్మిక సంబంధమైన సంభాషణలు ప్రారంభించారు.
అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వేపు తిరిగి "మరి కొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతోంది ” అని తెలియజేశారు.
ఆ తర్వాత మళ్ళీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు.
స్వామి వారు సిద్ధయ్యతో మాట్లాడుతూ వుండగా దగ్గరలో వున్న ఒక ప్రదేశం నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. అలా కొంతసేపు మాటలు వినిపించిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం...తర్వాత మళ్ళీ మాటలు వినబడ్డాయి.
అది గ్రహించిన స్వామివారు శిష్యుడు సిద్ధయ్యడు, ఇతర శిష్యులతో "వారెవరో తెలుసుకుందాం పదండి ” అని అందరినీ తన వెంట తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా, ఒక బ్రాహ్మణ స్త్రీ,కుష్టు రోగియైన తన భర్తను, తన ఒడిలో వుంచుకుని విలపించడం కనిపించింది.
అప్పుడు బ్రహ్మంగారు "ఏమమ్మా...మీరు ఎక్కడినుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? నీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? మీ వివరాలన్నీ చెప్పండి ” అన్నారు.
ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినవన్నీ విన్నతర్వాత -
బ్రహ్మంగారు "ఇక మీ కష్టాలన్నీ పోయినట్టీ. మీ గత జన్మ పాపం వల్లే ఈ వ్యాధి మీకు వచ్చింది. మిమ్ముల్నినేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను" అని అభయమిచ్చారు. తర్వాత బ్రాహ్మణ యువకుని ఒక్కసారి తన చేతితో తడిమారు.
అంతే... ఆ బ్రాహ్మణుని కుష్టువ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరి మంత్రం ఉపదేశించారు.
“స్వామీ, మీరు చేసిన ఉపకారం మేం ఎప్పటికీ మరిచిపోలేము. మీరు మా ఊరికి మాతోపాటు రావాలి. మా ఊరి వాళ్ళందరికీ మీ ఉపదేశాలతో జ్ఞానాన్ని కలగచేయాలి ” అని ప్రార్థించారు.
“ఇప్పుడు నేను పర్యటనలో వున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవకుండానే మీ ఊరికి వస్తాను" అని బదులిచ్చి వారిని పంపివేశారు. తనశిష్యులతోపాటు కందిమల్లాపాలెం జేరి తమ పనులలో నిమగ్నమయ్యారు బ్రహ్మంగారు.
బ్రహ్మంగారి పై నేరారోపణ
ఒకరోజు వీరబ్రహ్మంగారికి కడప నవాబు నుంచి ఒక జాబు వచ్చింది. అందులో పేరి సాహెబు అనే ఒక ముస్లిం తన కుమారుడైన సిద్దయ్యను స్వామీజీ ప్రలోభ పెట్టి హిందువుగా మార్చారని స్వామిపై నేరారోపణ చేశాడు. దీని గురించి విచారించేందుకు బ్రహ్మంగారిని తాము కడపకు రమ్మని ఆదేశిస్తున్నామని ఆ లేఖలో సారాంశం.
ఆ లేఖ అందుకున్న వీరబ్రహ్మంగారు తాను నవాబు దగ్గరకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. శిష్యులు తాము కూడా కడపకు బయల్దేరి వస్తామని చెప్పగా, బ్రహ్మంగారు దానికి ఒప్పుకోలేదు. తాను ఒక్కడే అక్కడికి వెళ్తానని చెప్పారు. కానీ సిద్ధయ్య ,మాత్రం ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టి, తాను మాత్రమే కడపకు వెళ్తానని, బ్రహ్మంగారు అక్కడికి రానక్కరలేదని చెప్పాడు. మొదట అందుకు ఒప్పుకోకపోయినా సిద్ధయ్య పట్టుపట్టడంతో అందుకు ఒప్పుకోక తప్పలేదు బ్రహ్మంగారికి.
ఆ లేఖను తీసుకు వచ్చిన జవాన్లతో కలిసి కడపకు బయలుదేరాడు సిద్ధయ్య. మార్గమధ్యంలోనే జవాన్లను ఏమార్చి వారికి కనబడకుండా, వేరే మార్గంలో ముందుగానే కడపకు చేరుకున్నాడు సిద్ధయ్య. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారితో మాట సంబంధమైన సంభాషణలు మొదలుపెట్టాడు.
potuluri veerabrahmendra swamy, potuluri kalagnanam, potuluri predictions, brahmam gari kalagnanam, Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnanam - 12