Kalagnanam- 13

 

వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 13

Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnanam- 13

 

ముస్లిం మతస్తుడిని సిద్ధయ్యగా మార్చాడనే అభియోగం మోపడంతో వీరబ్రహ్మేంద్రస్వామికి నవాబు నుండి పిలుపు వచ్చింది. గురువుగారిమీద వచ్చిన ఆ నేరారోపణను తొలగించేందుకు సిద్ధయ్య బయల్దేరాడు.

మార్గమధ్యంలో అక్కడక్కడా చెట్ల కింద కూర్చున్న సిద్ధయ్య, ఎక్కువ సమయం ధ్యానంలో మునిగి వుండేవాడు. యోగముద్రలో ఉన్న సిద్ధయ్య వద్దకు ఎందరో బాటసారులు వచ్చి, తమ సందేహాలను బయటపెట్టేవారు. సిద్ధయ్య వారి సందేహాలను తెరచి, సలహా ఇస్తూండేవాడు.

సిద్ధయ్య దగ్గరకు ఎక్కువగా మహమ్మదీయ భక్తులు వస్తూండేవారు. వారికి తన బోధలతో హితోపదేశం చేస్తూ, వారి మనసులను మార్చి, తనవలె నుదుట బొట్టు, కాషాయములు రుద్రాక్షలు ధరింపచేస్తూండేవాడు.

సిద్ధయ్య జ్ఞానానికి, బోధనలకు ముగ్దులై, రెండు రోజులలోనే అనేకమంది మహ్మదీయులు హిందువులుగా మారిపోయారు.సిద్ధయ్య చేస్తున్న బోధనల గురించి, ముస్లింలు హిందువులుగా మారిపోవటం గురించి తెలుసుకున్న నవాబు సిద్దయ్యను తన సముఖమునకు పిలిపించాడు.

సిద్ధయ్య నవాబు దగ్గరకు వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు. పైగా కాస్తయినా వినయం, విధేయతా ప్రదర్శించలేదు. అతని వైఖరి చూసి నవాబుకు కోపం వచ్చింది. సిద్ధయ్యకు ఉరిశిక్ష వేయాలన్నంత ఆగ్రహం కలిగినా, దాన్ని అణుచుకుని ముందుగా అతని ఉద్దేశ్యం తెలుసుకున్న తర్వాతే తానేం చేయాలో నిర్ణయించుకోవాలని భావించాడు.

“నువ్వు మహమ్మదీయుడవై వుండి, హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఆరాధిస్తున్నావు? ఇది మహమ్మదీయ మతాన్ని విమర్శించటమే అవుతుంది. ఇది అల్లా పైన నీ అపనమ్మకాన్ని సూచిస్తోంది. ఇది మన మతాన్ని దూషించడమే! కాబట్టి నిన్ను కఠినంగా శిక్షించదలచుకున్నాను. దీనికి నీ జవాబు విన్న తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను” అన్నాడు నవాబు.

నవాబు అంత తీవ్రంగా మాట్లాడినా సిద్ధయ్య అణువంత కూడా చలించలేదు. నవాబును చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. దానితో అసలే కోపంగా వున్నా నవాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. కానీ, అతన్ని శిక్షించేముందు విచారణ చేయాల్సి వున్నందు వల్ల సిద్ధయ్యతో ఇలా మాట్లాడాడు.

“నీకు మహత్తులు తెలుసని చెప్పుకుంటున్నావు కదా! సరే, ఇప్పుడు నువ్వేం మహత్తు చూపగలవో ప్రదర్శించు. లేకపోతే నీకు తగిన శిక్ష విధిస్తాను" అని హెచ్చరించాడు.

దానికి ప్రతిగా సిద్ధయ్య "మా గురువుగారి అనుజ్ఞ ప్రకారం నేను ఎలాంటి మహిమలూ చూపకూడదు. కానీ, మా గురువుగారి శక్తి తెలుసుకోవాలని మీరు కుతూహల పడుతున్నారు కాబట్టి, తప్పనిసరి పరిస్థితులలో నేను మీకు ఒక మహిమ చూపించనున్నాను. దానికోసం మీరు ఒక బండరాయిని తెప్పించి నా ఎదురుగా వుంచండి. మా గురువు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారి శక్తి ఏమిటో మీకు చూపుతాను” అన్నాడు.

వెంటనే నవాబు ఆలస్యం చేయకుండా తన భటులను పంపి ఒక పెద్ద కొండరాతిని తెప్పించాడు. “ఈ సభలో నేనేమైనా అతీత శక్తి ప్రదర్శిస్తే మీకు, సభలో వున్నవారికీ, కూడా ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం వుంది. కాబట్టి ఎక్కడన్నా ఖాళీ స్థలంలో బండరాయిని వుంచండి” అన్నాడు.

అందుకు ఒప్పుకున్న నవాబు రాతిని ఒక ఖాళీ ప్రదేశానికి తరలించాడు.

“ఇప్పుడు నీ శక్తిని, మీ బ్రహ్మంగారి శక్తిని ప్రదర్శించు" అని ఆదేశించాడు.

సిద్ధయ్య మనస్సులో గురుదేవుడైన బ్రహ్మంగారిని స్మరించి, తన కుడి చేతిని ఎత్తి ఆ బండరాయికి నమస్కారం చేశాడు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ భయకంపితులయ్యే విధంగా, పెద్ద శబ్దంతో బండరాయి ముక్కలైపోయింది.

ఈ అద్భుత దృశ్యాన్ని నవాబుతో సహా, అక్కడ చేరిన ప్రజలందరూ చూశారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు.

తర్వాత సిద్ధయ్య శాంతంగా నవాబు వేపు చూసి "అత్యంత శక్తిశాలి అయిన నా గురుదేవులను దోషిగా భావించి శిక్షించదలుచుకున్నారు. ఇప్పుడు చూశారు కదా ! ఆయన ఎంత శక్తివంతులో! ఒకవేళ ఆయనకు మీమీద ఆగ్రహం వస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి” అన్నాడు.

ఈ సంఘటనతో నవాబు భయపడి, తన తప్పును క్షమించమని అడిగాడు. తనకు కూడా జ్ఞానోపదేశం చేయాలని ప్రార్థించాడు. తాను నవాబుకు జ్ఞానోపదేశం చేయలేనని, అందుకు అర్హుడు తన గురువుగారేనని సిద్ధయ్య ఆయనకు నచ్చచెప్పాడు.

“వెంటనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని తీసుకురమ్మని ” నవాబు సిద్దయ్యను కోరాడు.

“నేను కానీ, మీరు కానీ పిలిస్తే మా గురువుగారు రాలేరు. అందుకు తగిన సమయం రావాలి. అప్పుడు ఆయన వస్తారు. మీకు కూడా ఉపదేశం చేస్తారు” అని సిద్ధయ్య, నవాబుకు నచ్చచెప్పాడు.

ఆ తర్వాత సిద్ధయ్య నవాబు వద్ద సెలవు తీసుకుని, అక్కడి నుంచి బయల్దేరి తిరిగి కందిమల్లయ్యపల్లికి వెళ్ళిపోయాడు.

 

సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం

ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్రస్వామితో చర్చను ప్రారంభించాడు.

“స్వామీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు? ఆయనను మనం ఎలా కనుగొంటాం?” అని సిద్ధయ్య ప్రశ్నించాడు.

అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు.

“ఈ ప్రపంచంలో మన అనుభూతికి, జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి వుంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందినవారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ,ఆ శక్తిమంతుడు ఒక్కడే! అతడే భగవంతుడని ఆస్తికులంటారు.అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని, పుట్టుక, మరణము లేని శక్తి అనీ నాస్తికులంటారు.దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు''

 

potuluri kalagnanam, veerabrahmendra swami kalagnam, potuluri predictions, brahmam gari kalagnanam, Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnanam - 13