ఫాల్గుణ మాసం ప్రత్యేకత ఇదే!

 

ఫాల్గుణ మాసం ప్రత్యేకత ఇదే!

మాఘ మాసం పూర్తయిపోయింది. ఇక వచ్చేది ఫాల్గుణమే! మాఘ శివరాత్రితో చలి పూర్తిగా తగ్గిపోయి, ఎండలను పరిచయం చేసే సమయం ఈ ఫాల్గుణం. చంద్రుడు పౌర్ణమినాడు ఉత్తర లేదా పూర్వ ఫల్గుణ నక్షత్రానికి దగ్గరగా ఉండే నెల ఇది. ఫాల్గుణం అర్జునుడి జన్మనక్షత్రం కూడా! అందుకే అర్జునుడి పేర్లలో ఫల్గుణుడు అని కూడా వినిపిస్తుంది.

ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది చెబుతారు. పూర్వం దితి, అదితి ఈ మాసంలోనే పయో అనే వ్రతం చేసి సాక్షాత్తు ఆ వామనుడికి జన్మనిచ్చినట్టు చెబుతారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజూ విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీరాన్నం లేదా పాలను నైవేద్యంగా అర్పిస్తారు. పయస్సు అంటే పాలు కాబట్టి… ఆ పాలతో నైవేద్యం చేసే ఈ వ్రతానికి పయో వ్రతం అని పేరు.

ఫాల్గుణమాసంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. శ్రీరాముడు లంకకు బయల్దేరినదీ, లక్ష్మీదేవి పాలకడలి నుంచి ఉద్భవించినదీ, ధర్మరాజు జన్మించిందీ ఈ నెలలోనే! రామకృష్ణ పరమహంస, చైతన్య మహాప్రభు లాంటి మహోన్నతులు ఆవతరించిందీ ఈ మాసంలోనే. ఫాల్గుణంలో నృసింహ స్వామిని పూజించే నృసింహ ద్వాదశి, లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీ జయంతి లాంటి ప్రత్యేక తిథులు ఎన్నో వస్తాయి.

 

ఈ నెలలోనే కామదహనం అయిన హోళీ పండుగ వస్తుంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కావడంతో… కన్నకొడుకని కూడా చూడకుండా తనను చంపించాలని అనుకుంటాడు. అందుకోసం తన సోదరి హోలికను రంగంలోకి దింపుతాడు. కానీ ప్రహ్లాదుని చంపేందుకు ఎగవేసిన మంటల్లోనే ఆ హోలిక దహనం అయిపోతుంది. దానికి సూచనగానే హోలీ మంటలు వేస్తారని చెబుతారు. శివపార్వతులను కలిపే ప్రయత్నంతో మన్మథుడు భస్మం అయిపోవడం ఈ పండుగకు కారణం అని మరికొందరి నమ్మకం.

తులసి, వేప తర్వాత మన సంప్రదాయంలో అంత విశిష్టమైన ఉసిరి చెట్టును ఆరాధించే అమలక ఏకాదశి వచ్చేది ఈ మాసంలోనే. ఇక బహుళపక్షంలో వచ్చే పాపవిమోచన ఏకాదశినాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే… జన్మ జన్మాంతర కర్మలన్నీ నశించిపోతాయని నమ్మకం. ఫాల్గుణ మాసంలో స్థానికంగా జరిగే ఉత్సవాలకీ కొదవ లేదు. కోరుకొండ తీర్థం, మధుర మీనాక్షి కల్యాణం లాంటి ఎన్నో సందర్భాలు ఈ మాసంలో కనిపిస్తాయి. అలా ఫాల్గుణ మాసం అంతా భక్త జనులకు కావల్సినంత సందడి అందించే సమయం!