Sabarimala Ayyappa 18 Holy Steps

 

శబరిమలై 18 పవిత్ర మెట్లు

Sabarimala Ayyappa 18 Holy Steps

అయ్యప్ప మాల ధరించిన భక్తులు 40 రోజుల దీక్ష పూర్తిచేసుకుని శబరిమలై ప్రధాన ఆలయానికి ముందు ఉన్న 18 మెట్లను పతినేట్టం పది అంటారు. బంగారం, వెండి, రాగి, కంచు, ఇనుములతో కూడిన పంచ లోహాల పూత పూసిన ఈ 18 మెట్లు పరమ పవిత్రమైనవి.

 

శబరిమలైలో అడుగు పెట్టిన యాత్రికులు పతినేట్టం పది చేరుకుంటారు. ఈ సోపానాల్లో దైవాంశ ఉందని, వీటిని తాకడంవల్ల భక్తులకు పవిత్రత వస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి. పతినేట్టం పది మెట్లను చేతితో తాకడం వల్ల వ్యక్తి గుణగణాల్లో మార్పు వస్తుంది, దైవత్వం నెలకొంటుంది.

 

పతినేట్టం పదిలో ప్రతి సోపానానికీ సార్ధకత, ప్రత్యేకత ఉన్నాయి. తొలి అయిదు మెట్లు కళ్ళు (చూపు),చెవులు (వినికిడి), ముక్కు (వాసన), నాలుక (రుచి) చర్మం (స్పర్శ) ఇలా శరీరంలో అతి ముఖ్యమైన పంచేంద్రియాలను సూచిస్తాయి.

 

తర్వాతి ఎనిమిది మెట్లు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అసూయ, ద్వేషాలనే అష్ట రాగాలను సూచిస్తాయి.

 

వాటి తర్వాత ఉన్న మూడు మెట్లు సత్వ, రజో, తామస గుణాలకు చిహ్నం.

 

ఆఖరి రెండు మెట్లు అవగాహనతో కూడిన జ్ఞానం, కోరికలనే అజ్ఞానాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి.

 

అయ్యప్పస్వామి ప్రధాన ఆలయంలో మూర్తీభవించేముందు, తనలో ఉన్న 18 అవగుణాలు లేదా వ్యామోహానికి గురిచేసే లక్షణాలను ఒక్కో మెట్టు వద్ద ఒక్కొక్కటి చొప్పున వదిలేశాడట. తనను చూడటానికి వచ్చే భక్తులు కూడా అలా దుర్గుణాలు, భవబంధాలను త్యజించి వచ్చేందుకు సృజించిన పరమ సోపానాలే ఈ 18 మెట్లు.

 

మరోవిధంగా చెప్పుకుంటే హిందూ ఆధ్యాత్మిక చింతనలో 108 సంఖ్య చాలా మహత్తరమైంది. 4 వేదాలు, 20 స్మృతులు, 18పురాణాలు, 64తంత్ర శాస్త్రాలు, 2 రామాయణ, మహాభారత ఇతిహాసాలు కలిస్తే 108 అంకె అవుతుంది. ఈ సంఖ్య పవిత్రమైంది కనుక జపమాలకు 108 పూసలుంటాయి. 108 మంత్రాలు, ఆకులు, పూలతో దేవుని పూజిస్తారు. సున్నా శూన్యాన్ని సూచిస్తుంది. శూన్యం అంటే వాడుకలో ఏమీ లేకపోవడం. కానీ ఆధ్యాత్మికంగా దేవుని ఉనికిని తెలియజేస్తుంది. అలా శూన్యం దేవునికి సంకేతం కాగా మిగిలిన 18 సంఖ్యతో దివ్య సోపానాలు ఉన్నాయి.

 

ఇంకో కథనాన్ని అనుసరించి శబరిమలై చుట్టుపక్కల 18 కొండలున్నాయి. పతినేట్టం పదిలోని ప్రతి సోపానమూ ఒక్కో కొండను సూచిస్తాయి

 

పతినేట్టం పది సోపానాలకు అంత దివ్యత్వం ఉంది కనుక వీటిని దాటడం ద్వారా ఇంద్రియ వ్యామోహం నశిస్తుంది. ఈర్ష్యాద్వేషాల నుండి బయటపడగల్గుతారు. ఈ లౌకిక ప్రపంచ భ్రాంతులు, భ్రమల నుండి విముక్తి చెందుతారు. భవబంధాల నుండి బయటపడి, పరమాత్మ ఒక్కటే శాశ్వతం అని గ్రహించగల్గుతారు.

 

Pathinettam Padi steps, divine 18 steps sabarimala, sabarimala holy and sacred steps, sabarimala ayyappa and holy 18 spets, Pathinettam Padi and 18 sacred steps, Sabarimala Ayyappa Pathinettam Padi 18 Holy Steps