Read more!

Bhakta Sulabhudu Bola Shankarudu

 

భక్త సులభుడు బోళా శంకరుడు

Bhakta Sulabhudu Bola Shankarudu

త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారులు. అందులో లయకారకుడైన మహేశ్వరునిది విచిత్రస్వభావం. కఠినత్వం, కర్కశ స్వభావం కనిపించదు. మహాశివుడు ఎంతో సాత్వికుడు. భక్తులను ఇట్టే కరుణిస్తాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా కోరిన వరాలు ఇచ్చేస్తాడు. అందుకే పరమశివుని బోళా శంకరుడు అంటాం. దేవతలకు ముప్పు తెచ్చిపెట్టే ఏ దైత్యుడైనా ముందుగా మొక్కేది, ప్రార్ధించేది కరుణాసముద్రుడైన మహేశ్వరుడినే. కావడానికి కరుణా సముద్రుడే అయినా ఆగ్రహిస్తే మాత్రం ఆ పరిస్థితికికి కారకులైన వారి అంతు చూస్తాడు మహా శివుడు. అటువంటి పరమేశ్వరుడు భక్త సులభుడు. కోరిన వరాలు ప్రసాచిందే ఆ బోళా శంకరుని అనుగ్రహం పొందడానికి శివరాత్రిని మించిన రోజు లేదు, అందుకే మహాశివరాత్రి పర్వదినమైంది. శివభక్తులే కాదు, హిందువులంతా నియమనిష్టలతో శివుని అర్చించి, పూజించి, ప్రార్థించి, తరించే పర్వదినం శివరాత్రి.

పరమేశ్వరుడు బోళా శంకరుడు. పిలిస్తే చాలు పలుకుతాడు. ఆర్తిగా ప్రార్ధిస్తే అక్కున చేర్చుకుంటాడు. అందుకే రాక్షసులతో సహా మహాశివుని అర్చించారు, ఆరాధించారు. రావణాసురుడు కూడా మహాశివుని భక్తుడే. మనలో చాలామంది ఇతర దేవుళ్ళను ఎంత పూజించినా పరమ శివుని మరీమరీ ఆరాధిస్తారు. మనకు శివ క్షేత్రాలకు లోటు లేదు. అసలు మన తెలుగునేలకి త్రిలింగ దేశమని మరో పేరు కూడా వచ్చింది. త్రిలింగ దేశం అంటే మూడు పవిత్ర, మహిమాన్విత శివలింగాలైన శ్రీశైలం, కాళేశ్వరం దాక్షారామం నడుమ ఉన్న ప్రదేమని అర్ధం. కాలగమనంలో ఈ ఎల్లలు విస్తరించాయి. అయినా మనకు శివుడితో ఉన్న అనుబంధం మాత్రం చెరిగిపోలేదు. నిరాడంబరతకు సంకేతంగా నిలిచే శివుడిని చూసినా, ఆయన నివాసమైన మరుభూమిని తలచుకున్నా మనసులో వైరాగ్యభావం జనిస్తుంది. హిందువుల కాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో 13 లేదా 14వ రోజును శివరాత్రిగా పాటిస్తాము. శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసి, ఉపవాసం, జాగరణ ఉంటూ శివనామస్మరణ చేసే భక్తులను పరమేశ్వరుడు కటాక్షించి కోరిన వరాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

కేవలం శివరాత్రి రోజున మాత్రమే కాదు, ఏరోజు అయినా, ఏ వేళ అయినా మహేశ్వరుని నామస్మరణ చేస్తే చాలు మహా పుణ్యం ప్రాప్తిస్తుంది. పరమేశ్వరుని భక్తిగా ఆరాధిస్తే సకల లాభాలూ, సర్వ సంపదలూ ఒనగూరుతాయి. పురాణాలు చెప్పిన ఈ మాటలలో ఎంతో నిజం ఉన్నదని, అలా శివుని ఆరాధించి లబ్దిపొందిన భక్తులు చెబుతూ ఉంటారు. శివభక్తులలో దేవ దానవ మానవులే కాదు జంతుజాలాలూ ఉన్నాయని చెబుతుంది శ్రీకాళహస్తి క్షేత్ర కథ. ఏనుగు, పాము, సాలీడుల కథ మనకు తెలిసిందే కదా! ఆ మూడు జీవాల శివ భక్తిని మాటల్లో చెప్పగలమా? వాటి పేరుతోనే శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు స్థిరపడింది. అందుకే మహాశివుని పూజిద్దాం. సత్వర ఫలితాలు పొందుదాం.

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఆంధ్రదేశంలో ప్రతి జిల్లాలోనూ ప్రసిద్ధి చెందిన శివాలయం ఉంది. ఈ పుణ్య క్షేత్రాలలో ఒక్కో క్షేత్రానిదీ ఒక్కో చరిత్ర.. ఇంద్రకీలాద్రి మీద మల్లికార్జునిది ఒక కథ అయితే, కోటప్పకొండ మీద త్రికూటేశ్వరునిది మరో గాథ. ఇక వేములవాడ ఇటువంటి క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి. శివుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. ఆయన పూజా విధానమూ తేలికే. మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించినట్లు దద్దోజనం, చక్రపొంగలి వంటి నైవేద్యాలు పరమేశ్వరుడికి అక్కరలేదు. మహాశివునికి కేవలం అభిషేకం చేయించినా పరవసిస్తాడు. మనసు శివుడిపై లగ్నం చేసి, చేసే అభిషేకం చాలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి. భక్తే ప్రధానం కానీ ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదని చాటిచెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు.

ఈశ్వరుడి అనుగ్రహం పొందడం ఎంత తేలికో, ఆయన ఆగ్రహిస్తే రక్షణ పొందడం అంత కష్టం. తెలిసీ తెలియక భక్తుడు చేసే తప్పుల్ని పెద్ద మనసుతో క్షమిస్తాడా శంకరుడు. బోళా శంకరునికి భక్తులపై వెనకా ముందు చూడకుండా కరుణ కురిపించే లక్షణమున్నదని తెలుసుకున్న ఎందరో రాక్షసులు, ఆయనను ప్రసన్నం చేసుకుని. ప్రపంచానికి చేటు తెచ్చే వరాలు పొందారు. వరాలు ప్రసాదించడంలో, భక్తులను కటాక్షించడంలో ఈశ్వరునికి ఇతర ఏ దేవుళ్ళూ సాటిరారు. ఆయన కరుణే అంత. భస్మాసురుడు వంటి రాక్షసులపై ఆయన కురిపించిన కరుణ అపారం.

మహాశివుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రాలు ఎంతో పుణ్య ప్రదేశాలు. సౌరాష్ట్రలో సోమనాథునిగా, శ్రీశైలంలో మల్లికార్జునిగా, ఉజ్జయినిలో మహా కాళేశ్వరునిగా ఇలా 12 ప్రాంతాలలో జ్యోతి స్వరూపంలో వెలశాడు పరమేశ్వరుడు. ఈ క్షేత్రాలన్నీ పరమ పవిత్రమైనవి. మనకు ఎంతో పుణ్యక్షేత్రమైన కాశీలోనూ జ్యోతిర్లింగ స్వరూపం ఉంది. ఈ జ్యోతిర్లింగాలలో ఎక్కువ అంటే ఐదు క్షేత్రాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఆ క్షేత్రాలేమిటంటే ఉజ్జయని, పర్లి, డాకిని, నాసిక్, దేవసరోవర్. ఈ ప్రాంతాలలో మహాకాళునిగా, వైద్యనాథుడిగా, త్రయంబకేశ్వరుడిగా, భీమశంకరుడిగా, ఘ్రశ్నేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు పరమేశ్వరుడు. కావడానికి శివుడు లయ కారకుడైనా తన భక్తులకు ఏదైనా ముప్పు వాటిల్లుతుంటే చూస్తూ ఊరుకోడు. భక్తులను కాపాడేందుకు నడుము బిగిస్తాడు. క్షీర సాగర మధన సమయాన జనించిన హాలాహలాన్ని స్వీకరించడం, ఆకాశం నుండి ఉధ్రుతంగా కిందికి దూకుతోన్న గంగను తలలో ధరించడం మహాశివునికే చెల్లింది.

 

Parameshwarudu bola shankarudu, maha shiva and halahalam, ganga on lord shivas, 12 jyotirlingas mahashiva shrines, lord shiva abhishekam