Read more!

Draupadi & Pancha Pandavas

 

ద్రౌపది ఐదుగురికి భార్య ఎలా అయింది?

Draupadi & Pancha Pandavas

 

భారతంలో చాలా ప్రముఖమైన, అతి శక్తివంతమైన స్త్రీ పాత్ర ద్రౌపదిది. పంచ పాండవులు ఆమె భర్తలు. ధర్మరాజు అన్నివిధాలా ఉత్తముడే కానీ జూదం అతని ఒకే ఒక్క బలహీనత. ఆ బలహీనతతోనే అతడు ఒక సందర్భంలో ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయాడు. ఒక స్త్రీకి అంతకంటే అవమానం ఉంటుందా? అది చాలక నిండు సభలో దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి వస్త్రాపహరణం చేయబోతాడు. అంత భయానక పరాభవం జరగ్గా ద్రౌపది తనను రక్షించమంటూ శ్రీకృష్ణుని ప్రార్ధించింది. అలా కృష్ణుడు ఆమె మానప్రాణాలను కాపాడాడు. తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేవరకూ తాను జుట్టు ముడి వేసుకోనని ప్రతిజ్ఞ చేసింది. అంతవరకూ కురులను అలాగే వదిలేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ద్రౌపది అంటే నిలువెత్తు ఆత్మ విశ్వాసం.

ఇంత ఉదాత్తమైన ద్రౌపది పాత్రను ''ఐదుగురు భర్తలా?'' అంటూ అవహేళన చేసేవారు, తీసిపడేసేవారు ఉన్నారు. న్యాయం, ధర్మం అనే వాటికి స్థిరత్వం ఉండదు. దేశకాలమాన పరిస్థితులను బట్టి ధర్మం ఆధారపడి ఉంటుంది. ఆచారవ్యవహారాలు మారుతుంటాయి. ఈ సంగతి గ్రహించి ఆయా పరిస్థితులు, వ్యక్తుల స్థితిగతులు, ఆచారవ్యవహారాలను అర్ధం చేసుకోవాలే గానీ అవహేళన చేయడం సబబు కాదు. ఈ నేపథ్యంలో ఒకసారి ద్రౌపదిని గుర్తుచేసుకుందాం.

ద్రౌపది అసలు పేరు కృష్ణ. ఆమె నల్లగా ఉన్నందున ''కృష్ణ'' (నలుపు వర్ణం) అని పేరు పెట్టారు. ద్రుపదుని కూతురు గనుక ద్రౌపది అయింది. తండ్రి పాంచాల దేశానికి రాజు. అందుకే పాంచాల దేశ రాకుమార్తె కనుక పాంచాలి అని కూడా అంటారు. ఆమె వర్ణించ శక్యం కానంత అందంగా, సౌందర్య తునకలా ఉండేదట. పంచ పాండవులను ఏకకాలంలో పెళ్ళి చేసుకుంది. వీరిలో ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు కుంతీదేవి పుత్రులు కాగా, నకులుడు, సహదేవులు మాద్రి కుమారులు.

ఇలా ఎందుకు జరిగింది అంటే అర్జునుడు ద్రోణాచార్యుని ప్రోద్బలంతో పాంచాల దేశ రాజు ద్రుపదుని ఓడించి సగం రాజ్యాన్ని, ఆ రాజ కుమార్తె ద్రౌపదిని సొంతం చేసుకున్నాడు. ఇంటికి వచ్చి తల్లి కుంతీదేవితో తనకు ఒక స్త్రీ లభించింది అని చెప్పకుండా ''అమ్మా, నాకో పండు దొరికింది'' అని చెప్పాడట. కొడుకు పండు అంటే నిజంగానే పండు అనుకుంది తల్లి. అందుకే ఆమె స్త్రీ అని తెలీక "అయితే, అందరూ పంచుకు తినండి నాన్నా'' అందట కుంతీదేవి. తల్లి మాటను శాసనంగా భావించే కొడుకు దాన్ని అక్షరాలా పాటించాడు.

ఆ సంగతి అలా ఉంచితే ప్రాచీన కాలంలో ఒక మహిళను ఎక్కువమంది పురుషులు పెళ్ళి చేసుకునే ఆచారం ఉండేది. చాలా కుటుంబాల్లో అన్నదమ్ములంతా కలిసి ఒకే స్త్రీని వివాహం చేసుకునేవారు. ఆ సంప్రదాయానికి దృష్టాంతం ద్రౌపది పాత్ర.

కేవలం మన దేశంలోనే కాదు, జర్మనీ, బ్రిటన్ లాంటి అనేక దేశాల్లో ఒక స్త్రీని ఎక్కువమంది పురుషులు వివాహమాడే ఆచారం ఉందని తెలియజేసే ఆధారాలు ఉన్నాయి. గ్రీకు పురాణాల్లో పది, పన్నెండుమంది పురుషులు ఒక వనితను పెళ్ళి చేసుకున్నారని తెలియజేసే కథనాలు ఉన్నాయి. అదేదో రహస్య సంబంధం కాదు. అలా అనేకమంది వివాహం చేసుకుని పరిచయస్తులందరికీ విందుభోజనం ఏర్పాటు చేసి ఆనందించేవారట. ఇంకా అంతకంటే చిత్రమైన, వింతైన సంగతి ఏమంటే ఇంటికి వచ్చిన అతిథి గనుక కోరుకుంటే అతిధి మర్యాదల్లో భాగంగా భార్యను కూడా అప్పగించేవారట.

లడక్ లో ఇప్పటికీ అన్నదమ్ములంతా ఒకే స్త్రీని వివాహం చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది. వీరు ఎన్ని తరాలైనా అన్నదమ్ములు ఒకే స్త్రీని పెళ్ళాడుతారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ కొన్ని జిల్లాల్లో ఒక మహిళను ఎక్కువమంది పురుషులు పరిణయమాడే ఆచారం కొనసాగుతోంది. ఇలా అందరూ కలసి ఒకర్ని చేసుకోవడంవల్ల ఆస్తులు, పాడి పశువుల విభజన జరక్కుండా కలసి ఉంటుందనేది ఒక ప్రయోజనం కాగా వేరే కుటుంబాలకు చెందిన స్త్రీలు వస్తే గొడవలకు ఆస్కారం ఉంటుందనేది రెండో కారణం. ఇంకా లోతుగా పరిశీలిస్తే ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఆచారం ఉందంటే బహుశా అక్కడ స్త్రీ జనాభా తక్కువగా ఉండటం అనేది ప్రధాన కారణం అయ్యుండొచ్చు.

ఇటువంటి ఆచారవ్యవహారాలకు విస్తు పోతాం నిజమే. కానీ వీటిని అవహేళన చేసే హక్కు మనకు లేదు. అనాచారంగా కనిపించేవాటిని పాటించనవసరం లేదు. అయితే అందుకు కారణమైన పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. అవసరం లేకున్నా వాటిని గుడ్డిగా అనుసరిస్తూ ఉంటే ఖండించాలి కూడా.

 

Pandavas wife Draupadi, Draupadi vasthrapaharana, Drupada's daughter Draupadi, Duryodhana and Draupadi