మన బలమే నిజమైన జీవితం అవుతుంది.. ఎలాగంటే...
మన బలమే నిజమైన జీవితం అవుతుంది.. ఎలాగంటే...
కర్మ చేసేటప్పుడు లక్ష్యంపై ఎంత శ్రద్ధ వహించాలో సాధన పట్లకూడా అంతే శ్రద్ధ వహించాలి. విజయాన్ని సాధించగల రహస్యమంతా దానిలోనే ఉంది. సాధన సరిగా ఉంటే మంచి ఫలితం కలిగి తీరుతుంది.
కర్మ బంధనం కారాదు... యావచ్ఛక్తితో కర్మను చెయ్యా లని, మనం చేసేపని ఏదైనా మన మనసంతా దానిలో సంలగ్నం చెయ్యాలన్నదే గీతా సందేశం. కర్మను చేస్తున్నంతసేపూ మనం నిస్సంగులమై ఉండాలి. అంటే, మనం కర్మలు చేస్తుండాలి. అలాగే మనం సంకల్పించినప్పుడు కర్మను విడిచి పెట్టగలగాలి.
మన దుఃఖాలన్నిటికీ కారణం కర్మయందు ఉన్న సంగమమే. ఒక పనికి పూనుకొని దానిలో మన సర్వశక్తిని వినియోగిస్తాం అయినా ఆ పని కాకపోవచ్చు. కానీ దానిని విడువలేం అది మనకు బాధ కలిగిస్తుందని, దానిని అంటిపెట్టుకొని ఉండటం వలన మరింత దుఃఖమే కలుగుతుందని మనకు తెలుసు. అయినా దానితో తెగతెంపులు చేసుకోలేం. తేనెటీగ తేనె తాగడానికి వచ్చింది. దాని కాళ్ళు తేనెకు అంటుకు పోయాయి. అది వెళ్ళిపోలేకపోతోంది. మనం మాటిమాటికి అదే స్థితిలోకి వస్తున్నాం. సృష్టి రహస్యమంతా ఇదే. మనం ఇక్కడ ఎందుకున్నాం? తేనె తాగడానికి మనం ఇక్కడకు వచ్చాం. కానీ మన చేతులు, కాళ్ళు దానిలో అంటుకొన్నాయి. మనం వచ్చింది పట్టుకోవడానికి. కానీ మనమే పట్టుబడ్డాం. భోక్తల మవడానికి వచ్చి మనమే భుక్తులుగా మారాం. ఏలడానికి వచ్చాం కానీ ఏలుబడికి లోనయ్యాం. జీవిత సౌఖ్యాలను అనుభవించాలని మనం కోరుకుంటాం అవి మన ఆయువుపట్లనే తినేస్తున్నాయి. ప్రకృతి నుండి సర్వం రాబట్టుకోవాలని కోరుకుంటాం. కానీ ప్రకృతే మన నుండి సర్వాన్ని గుంజుకొంటుందని, మనలను పీల్చి పిప్పిచేసి పారేస్తుందని మనం చివరికి గ్రహిస్తాం. అలా కాకపోతే జీవితమంతా ఆనందోజ్జ్వలంగా వుండేది. మనం కర్మబద్ధులం కాకపోతే సుఖదుఃఖాలన్నీ ఉన్నా, జయాపజయాలన్నీ ఉన్నా జీవితం ఆనందమయంగా సాగిపోతుంది.
నిస్సంగమే నిజమైన బలం.. నిరంతరం కర్మను చెయ్యి, కానీ దానిలో పట్టుబడవద్దు. వస్తువు ఎంత ప్రియమైనదైనా కావచ్చును. దానికోసం మన హృదయం ఎంతగా ఆత్రపడినా పడచ్చును. దానిని విడువ బోయేటప్పుడు కలిగే దుఃఖం ఎంతటిదైనా కావచ్చును. మీరు ఇష్టమైనప్పుడు దానిని విడిచివేసే శక్తిని కలిగి ఉండండి. ఈ జన్మలోగాని, పరజన్మలోగాని ఇక్కడ దుర్బలులకు స్థానం లేదు. దౌర్బల్యం బానిసతనానికే దారి తీస్తుంది. దౌర్బల్యం శారీరకంగాను, మానసికంగాను అన్ని రకాల దుఃఖాలకు దారి తీస్తుంది. దౌర్బల్యం మృత్యువు మనలను అనేక లక్షల సూక్ష్మజీవులు చుట్టిముట్టి ఉన్నాయి. కానీ మనం దుర్బలం కాకుండా ఉండగలిగితే, అవి మనకు కీడు చెయ్యలేవు. మనస్సు దృఢంగా ఉన్నంతవరకు మనలను వశపరచుకొనే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేదు. ఇదొక గొప్ప సత్యం బలమే జీవితం, దౌర్బల్యమే మృత్యువు.
◆నిశ్శబ్ద.