బ్రహ్మచారిణి శ్రీశైల వాసిని!!

 

 బ్రహ్మచారిణి  శ్రీశైల వాసిని!!

 

బ్రహ్మచారిణీ దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి , కుడి  చేతిలో జప మాల , కమండలం , ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.

నవరాత్రులలో అమ్మవారిని రెండవ రోజున తెలుపు, నారింజ రంగు దుస్తులతో అలంకరిస్తారు. తెలుపు రంగు పూలతో పూజ చేస్తారు. బ్రహ్మచారిణీ దేవి బుద్దిని, శక్తిని ప్రసాదిస్తుంది. సంతోషాన్ని, ప్రశాంతతను, సంపదను చేకూరుస్తుంది కూడా. బ్రహ్మచారిణి వెనుక ఉన్న కథ ఇదీ….

బ్రహ్మ  అంటే అన్నీ తెలిసినది అని అర్థం.  బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ స్వరూపం ఇలా బ్రహ్మ అంటే అన్నీ అనే అర్థాన్ని నింపుకుని అన్ని తనలోనే నింపుకున్నది అని కూడా అర్థం. చారిణి అంటే కదలడం , ఒక పనిలో నిమగ్నమవడం. మొత్తంగా బ్రహ్మచారిణీ అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్ధం. వచనంలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే పెళ్లి కాని యువతి అని అర్థం. 

అమ్మవారి బ్రహ్మచారిణి అవతారం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 

మేనక, హిమవంతుల కుమార్తె పార్వతీ దేవి. ఆమె చిన్నతనం నుండే శివుడి మీద ప్రేమను పెంచుకుని, శివుడిని పూజిస్తూ ఉంటుంది. శివుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.  అయితే ఆమె తల్లిదండ్రులు శివుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పని, అది జరగని పని అని ఆమెతో చెబుతారు. అయినా ఆమె తల్లిదండ్రుల మాటలను లెక్కచేయదు.  పట్టుదలతో శివుని కోసం 5000 సంవత్సరాలు  తపస్సు చేసింది.  అయినా శివుడి మనసు కరగలేదు. 

మరోవైపు శివుడు దక్షప్రజాపతి కుమార్తె సతీదేవిని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె మరణించగానే, ఇక శివుడికి భార్య లేదని, శివుడికి ఇల్లాలు క్లైగే అవకాశం లేదని తెలుసుకుని తారకాసురుడనే రాక్షసుడు శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావు అనేది ఉండకూడదు అనే వరం పొందుతాడు. దీనంతటికి కారణం శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడని. అలా ఆ రాక్షసుడు వరం వల్ల తనకు ఇక చావః ఉండదనే అహంకారంతో దేవతలను అందరిని నానా హింసలు పెట్టేవాడు దీనంతటికి కారణం శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోడని. 

అయితే  సతీదేవి పార్వతీ  దేవిగా జన్మెత్తి , శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన  దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని  మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసి శివుడిలో చలనం తీసుకురావాలని చూసిన మన్మధుడిపై శివుడు ఆగ్రహం అవుతాడు. వెంటనే తన మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అయిన నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణీ అవతారంలో ఘోరతపస్సు చేస్తుంది అమ్మవారు. ఆ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ, తననే తలచుకుంటున్న పార్వతి మీద ప్రేమను పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించి శివుడు , తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ తన మీద తనే నింద వేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సును ఇంకా తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అలా అమ్మవారు బ్రహ్మచారిణీ స్వరూపిణిగా అవతరించి సౌభాగ్యవంతురాలిగా మారుతుంది

ధ్యాన శ్లోకం

"దధానాకర పద్మాభ్యా మక్షమాలా కమండలూ దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా"*

నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవి నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు శ్రీశైల క్షేత్రంలో దర్శనమిస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ