లోక మాత లలితా త్రిపుర సుందరి!!
లోక మాత లలితా త్రిపుర సుందరి!!
దేశమంతా దుర్గా నవరాత్రుల సందడితో మునిగిపోయిన వేళ ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి గ్రామం ఇలా అంతటా అమ్మవారి నామం మారు మ్రోగుతున్న వేళ, పుణ్యక్షేత్రాలు ఆ శక్తి స్వరూపిణీ అలంకరణలతో అలరారుతున్న వేళ లోకాన్ని పాలించే ఆ అమ్మ ఈ శరన్నవరాత్రుల నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది.
పార్వతి, లక్ష్మీ, గాయత్రి, కామాక్షి, మీనాక్షి, సరస్వతి, లలిత ఇలా పేర్లు ఎన్ని అయినా ఆ పరాశక్తి మాత్రం ఒక్కటే. ఏ పేరుతో ఎలా పిలిచినా పలికే లోకాది దేవత అమ్మ ఒకటే.
మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వమంగళమ్
షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్
జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్
పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్
ఈ అమ్మ నెలవంక రూపంలో ఉన్న కిరీటం ధరిస్తుంది. లలితా అనగా లావణ్యం అని అర్థం. త్రిపుర సుందరీ అనగా ఆనందం కలిగించేది అని అర్థం. లలితా త్రిపుర సుందరి నాలుగు చేతులలో పైరెండు చేతులలో పాశం, అంకుశం, కింది చేతులలో చరకబిందు అలాగే ఐదు పూవుల బాణాలు ధరించి మనకు దర్శనమిస్తుంది.
మనిషి చుట్టూ ఆవరించి ఉన్న ఈ పంచభూతాల కలయికే లలితాదేవి. ఈ పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. అలాగే మనిషిలో ఉన్న పంచతన్మాత్రసాయకాలు అయిన కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము. వీటి నుండి మనిషిలో పుట్టే ప్రకంపనలు అయిన శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు పంచతస్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. వీవెటన్నింటిలోనూ ఉండే శక్తి ఒకటే. వీటన్నింటినీ కూడా అదుపుచేయగల శక్తి ఒకటే. ఆ శక్తిని లలితా త్రిపుర సుందరిగా భారతీయులు న్మముతారు. ఈ అమ్మవారిని నిత్యం స్మరిస్తూ ఉంటే వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది.
కామ్యార్థాలకు, మోక్షార్థాలకు రెండింకి కూడా లలితాదేవి అధిష్ఠాన దేవత.. శ్రీచక్ర స్థితంగా కనిపించే అమ్మవారు సృష్టి సంబంధమైన వేరువేరు భాగాలలో వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది. దీనినే మేరువుగా కూడా విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేరు వేరు భాగాలలో ఉండే లలితా అమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ ఉంది. ఆత్మ, మనస్సు, శరీరం అనేవి మూడు పురాలు(అంటే ప్రతి మనిషి అంతః, బాహ్య, చేతనావస్థలు). వీటినే త్రిపురాలు అంటారు. ఈ మూడు మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. ప్రతి మనిషిలో వ్యక్తిత్వ పరంగా మంచి, చెడులు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కామ గుణం, మానసిక,శారీరక స్థితులు అన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఆత్మ, మనసు, శరీరం మూడింటికి చెందినవే. వాటిలో ఉన్న ఆ రాక్షసత్వ గుణాలను తొలగించి మనిషిని సౌమ్యతగా మార్చే తల్లి లలితా త్రిపుర సుందరి.
ఈ అయిదు బౌతిక శక్తులలో నిండి ఉన్న అమ్మవారి గురించి తెలుసుకుని, అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉంటే మనిషి శరీరంలో ఉన్న అన్ని భాగాలలోను అనంతమైన శక్తి చేకూరి మనిషికి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ నవరాత్రులలో ఈ విషయం తెలుసుకుని లలితా త్రిపుర సుందరి దేవి కారుణకు పాత్రులవుదాం.
అమ్మవారు ఎరుపురంగు చీరను ధరించి దర్శనమిస్తుంది. అమ్మకు నైవేద్యంగా దద్ధ్యోదనం లేదా పెరుగన్నంను పెడతారు.
మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వమంగళమ్
షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్
జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్
పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్
పై శ్లోకాన్ని 1108 సార్లు చెప్పుకుంటే వివాహం కాని వారికి వివాహం, మానసిక ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు చేకూరుతుంది. ముఖ్యంగా నవరాత్రులలో, నాలుగవ రోజు!!
◆ వెంకటేష్ పువ్వాడ