నారదుడు నిజంగా కలహ ప్రియుడా ?
నారదుడు నిజంగా కలహ ప్రియుడా ?
నారదుడు లేదా నారద మహర్షిని కలహ ప్రియుడు, కలహ భోజనుడు అంటారు. పిల్లలు కూడా గుర్తుపడతారు. తలపై చిన్న కొప్పు, అందులో పూలు.. మెడలో దండ, చేతిలో చిడతలు, మహతి మీటుతూ మాటిమాటికీ నారాయణ మంత్రం జపించడం.. ఇదీ నారదుని తీరు. పురాణ పాత్రల్లో నారదుని గుర్తుపట్టడం ఎంత తేలికో అర్ధం చేసుకోవడం అంత కష్టం.
నారదుడంటేటే కలహప్రియుడు, కలహా భోజనుడు అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. తుంపులు పెట్టేవారిని "నారదుడు" అని వెక్కిరించడం మామూలైంది. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి వాళ్ళకీ వీళ్ళకీ తగవులు పెడుతుంటాడని, వాళ్ళు కలహించుకుంటూ ఉంటే ఈయనకి కనులపండుగ్గా ఉంటుందని మనం అనుకుంటాం. పైకి ఇలా కనిపిస్తుంది. కానీ నిజానికి నారదునికి ఎవరిమీదా ఈర్ష్యాద్వేషాలు లేవు. మనసులో ఎలాంటి కల్మషాలూ ఉండవు.
నారదుడు బ్రహ్మ మానసపుత్రుడు. సిసలైన ఋషిపుంగవుడు. అంతరంగం స్వచ్చంగా, నిర్మలంగా ఉంటుంది. మరి పురాణాల్లో ఎందరికో, ఎన్నోసార్లు తగవులు ఎందుకు పెడతాడంటే వాటి వెనుక మర్మం వేరే ఉంటుంది. ప్రతిదానికీ కార్య కారణ సంబంధం ఉంటుంది. నారద ముని ఏ పని చేసినా అది జగత్ కల్యాణానికే ఉపయోగపడుతుంది.
నారదమహర్షి పెట్టే తగవుల వెనుక రహస్యం ఉంటుంది. ఓ రాక్షసుని ఉబ్బేసి, దేవతలను నిందించాడంటే, దాని మర్మం ఆ రాక్షసునికి కాలం సమీపించిందన్నమాట. ఆ అసురుడు రెచ్చిపోయి దేవతలతో యుద్ధానికి తలపడటం, చివరికి ఘోర పరాజయం పొందడం ఖాయం. కనుక నారదుడు కలహ ప్రియుడు, కలహ భోజనుడు కాదు. నారదమహర్షి వ్యంగ్యంగా మాట్లాడినా, పరస్పరం పుల్లలు పెట్టి యుద్ధాలు సృష్టించినా అదంతా లోక శ్రేయస్సు కోసమే. నారదుడు విదూషకుని తలపిస్తాడు కానీ నిజానికి ఎలాంటి ఆశలూ ఆవేశాలూ లేని విరాగి. ఇద్దరు తగవులాడుకుంటూ ఉంటే చోద్యం చూస్తున్నట్టు ఉంటుంది కానీ, వాస్తవానికి అందరూ సంతోషంగా ఉండటమే ఆయన ద్యేయం.
నారదుడు ఒక సందర్భంలో తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎందుకు చేశాడో ఈసారి తెలుసుకుందాం...