నందీశ్వరుడు ఎవర్ని, ఎందుకు శపించాడు?

 

తనను నిర్లక్ష్యం చేశాడనే అవమానంతో దక్షుడు అల్లుడు శివుని శపించాడు కదా! అది చూసిన నందీశ్వరునికి హృదయం రగిలిపోయింది. 'మహాశివునికే శాపం పెడతాడా?!' - అని కోపంతో ఊగిపోయాడు. 'బుద్ధిలేని దక్షుడు అలా మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తుంటే కనీసం సభలో ఉన్న వేద పండితులైనా ఇదేమిటని ప్రశ్నించరే? లోకేశ్వరుడైన మహాశివుని, ఆయన వాహనంగా ఉన్న తనను దూషిస్తుంటే చోద్యం చూస్తారు తప్ప నోరు మెదపరా? అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని మౌనంగా చూసేవాళ్ళు కూడా అదే కోవలోకి వస్తారు..' అనుకున్నాడు నందీశ్వరుడు. 'మూర్ఖుడు, మతి లేనివాడు అయిన దక్షుని దూషణలకు వ్యతిరేకత చూపకుండా సమ్మతం తెలుపుతున్నట్టు నిలబడ్డ మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు..' అని పళ్ళు నూరుకున్నాడు. అంతటితో ఆగక "వేద పండితులారా, ఇకపై మీరు శూద్ర పౌరోహిత్యం చేస్తారు. వాళ్ళిచ్చే సంభావనలకు ఆశపడి, మీ గౌరవాన్ని వదులుకుంటారు. ధనధాన్యాలు కరువై, పేదరికాన్ని అనుభవిస్తారు. కన్నీళ్ళతో కాలం గడుపుతారు. అందునా ఈ దృశ్యాన్ని చూసి వినోదించిన వారైతే ఏకంగా బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు..." అంటూ శపించాడు నందీశ్వరుడు.