నాలుగు వేదాలనూ రాసిన – నమ్మాళ్వారు!
నాలుగు వేదాలనూ రాసిన – నమ్మాళ్వారు!
క్రీ.శ 6వ శతాబ్దం నాటికి అన్యమతాల ప్రభావంతోనూ, పరస్పర విరుద్ధమైన సంప్రదాయాలతోనూ భారతదేశంలోని ధార్మిక వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది. అలాంటి వాతావరణంలో తిరిగి వైష్ణవ, శైవ భక్తి తత్వాన్ని ప్రచారం చేసే బాధ్యతతో జీవించినవారే ఆళ్వారులూ, నయనార్లూ! విష్ణుతత్వాన్ని ప్రచారం చేసిన ఆళ్వారులలో ప్రముఖులు ‘నమ్మాళ్వారు’. ఆశ్చర్యకరమైన ఆయన జీవిత విశేషాలలో కొన్ని…
భక్తుల నమ్మకం ప్రకారం నమ్మాళ్వారు ఇప్పటి ‘ఆళ్వార్‌తిరునగరి’ అనే ప్రాంతంలో జన్మించారు. ఆళ్వారులందరిలోకీ రాశిలోనూ, వాసిలోనూ నమ్మాళ్వారు నుంచి వెలువడిన రచనలే ఎక్కువ. అలాంటి నమ్మాళ్వారు తన పదహారవ ఏట వరకూ అసలు మాట్లాడనేలేదట! మాట సంగతి అటుంచితే, పుట్టిన వెంటనే అందరి పిల్లల్లా ఏడవటం కానీ, పాలు తాగడం కానీ, కనీసం కళ్లు తెరవడం కానీ చేయలేదు. పిల్లవాడిలో ఎలాంటి ప్రతిస్పందనా కనిపించకపోవడంతో అతను అందిలాంటివాడూ కాదని తల్లిదండ్రులకు అర్థమైపోయింది. దాంతో పిల్లవాడి బాధ్యత ఆ భగవంతుడిదే అనుకున్నారు. తమ ఊరి దైవమైన ‘ఆదినాథర్’ పాదాల చెంత ఆ పిల్లవాడిని ఉంచారు. ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి లేచి వెళ్లి, గుడి ఆవరణలో ఉన్న చింతచెట్టు వద్ద పద్మాసనం వేసుకుని ఉండిపోయాడు.
అలా పదహారు సంవత్సరాలపాటు నమ్మాళ్వారు ఆ చింతచెట్టు కిందనే తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఉత్తరాదిన తీర్థయాత్రలు చేస్తున్న మధురకవి అనే పండితునికి దక్షిణాది నుంచి ఒక వింత కాంతి కనిపించసాగింది. ఆ కాంతిని అనుసరిస్తూ వచ్చిన మధురకవికి, అది నమ్మాళ్వారు నుంచి వెలువడుతోందని తెలిసింది. ఆ యువకుడిలోని జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్న మధురకవి, శాస్త్రాలలోనే అత్యంత క్లిష్టమైన ప్రశ్నలను సంధించాడు. వాటికి అద్భుతమైన జవాబులను ఇవ్వడం ద్వారా తన సుదీర్ఘమైన మౌనాన్ని విడిచారు నమ్మాళ్వారు. అప్పటి నుంచీ నమ్మాళ్వారుకి శిష్యునిగా మారి ఆయన చెంతనే ఉండిపోయారు మధురకవి. నమ్మాళ్వారు నోటి వెంటి ఆశువుగా వెలువడే పాశురాలను అక్షరబద్ధం చేస్తూ, వాటిలోని ఉదాత్త భావాలకు అనుగుణంగా జీవిస్తూ మధురకవి కాస్తా ‘మధురకవి ఆళ్వారు’గా మారిపోయారు.
సంస్కృతంలోని నాలుగువేదాలకు ప్రతిరూపంగా తమిళంలో నాలుగు మహోన్నతమైన రచనలను చేశారు నమ్మాళ్వారు. తిరు విరుట్టం, తిరు అశీరియం, పెరియ తిరువందాడి, తిరువైమొళి అన్నవే ఆ నాలుగు గ్రంథాలు. వైష్ణవ దివ్య క్షేత్రాలైన 108 దివ్యదేశాలలో ఏ ఒక్కదానినీ నమ్మాళ్వారు చూసి ఉండలేదు. కానీ వాటన్నింటినీ ఆయన తన పాశురాలలో కళ్లకు కట్టినట్లుగా వర్ణించడం చూస్తే, ఆయన తన ధ్యానంలోనే వాటిని దర్శించారని తోస్తుంది. విష్ణుమూర్తి యొక్క సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుని అవతారంగా నమ్మాళ్వారుని భక్తులు భావిస్తారు. తమిళనాట చాలా వైష్ణవాలయాలలో నమ్మాళ్వారుకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. వీటన్నింటిలోకీ వైశాఖమాసంలో జరిగే గరుడసేవ ఉత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. తమిళనాడులోని తిరువన్వేలి- తిరుచెందూరుల మధ్య 9 ప్రముఖ వైష్ణవాలయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ‘నవతిరుపతి’ అంటారు. వైశాఖమాసంలో జరిగే గరుడోత్సవంలో నమ్మాళ్వారు విగ్రహాన్ని పాడిపంటల మధ్య నుంచీ ఈ తొమ్మిది క్షేత్రాల దగ్గరకు తీసుకువెళ్తారు. ఇలా ఒకో క్షేత్రం వద్దకి చేరుకున్నప్పుడు ఆ ఆలయం మీద నమ్మాళ్వారువారు రాసిన పాశురాలను చదువుతారు.
నమ్మాళ్వారు అతి చిన్న వయసులోనే పరమపదించారని చెబుతారు. వైష్ణవులకు పుణ్యప్రదమైన వైకుంఠ ఏకాదశినాడు నమ్మాళ్వారు నేరుగా వైకుంఠాన్ని చేరుకున్నారట. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశినాడు శ్రీరంగంలో గొప్ప ఉత్సవాన్ని జరుపుతారు. జీవించింది కొద్దికాలమే అయినా, వైష్ణవ భక్తిసాహిత్యంలో నమ్మాళ్వారు స్థానం అచిరకాలం నిలిచిపోయింది.
- నిర్జర.