Read more!

నాగుల పంచమి... పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే..

 

నాగుల పంచమి... పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే..

హిందూ సంప్రదాయంలో బోలెడు పండుగలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి తరువాత  శ్రావణ మాసంతో వ్రతాలు, పండుగల సందడి ప్రారభమవుతుంది. శ్రావణమాసం శుక్లపక్షం అయిదవ రోజున నాగుల పంచమి పండుగ జరుపుకుంటారు. ఈరోజున నాగదేవతలుగా భావించే నాగులను పూజించడం పరిపాటి. శ్రావణమాసంలో నాగుల పంచమిని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. నాగుల పంచమి జరుపుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆరోజున చెయ్యాల్సినది ఏంటి? నాగుల పంచమి రోజు మంచి ముహుర్తం ఏది? నాగుల పంచమి కోసం ఉపవాసం చేసేవారు ఎప్పుడు చెయ్యాలి? ఇందులో ఉన్న విశిష్టత ఏంటి? వివరంగా తెలుసుకుంటే..

శ్రావణ మాస శుక్లపక్ష పంచమిని నాగుల పంచమిగా జరుపుకుంటారు. నాగుల పంచమిరోజున నాగదేవతలను పూజిస్తారు.  ఈ యేడు నాగుల పంచమి 21వ తేదీ అర్దరాత్రి 12.21నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇది ఆగష్టు 22వ తేదీ ఉదయం 2గంటల వరకు ఉంటుంది. ఈ పరిస్థితిలో నాగుల పంచమి ఉపవాసం ఆగస్టు 21వ తేదీ సోమవారం చెయ్యాల్సి ఉంటుంది. నాగపంచమి పూజ ముహూర్తం విషయానికి వస్తే 21వ తేదీ ఉదయం 5గంటలా 53నిమిషాల నుండి 8గంటలా 30నిమిషాల వరకు ఉంటుంది. నాగుల పూజ ఈ సమయంలో ముగించుకుంటే మంచిది.

ప్రత్యేకత..

ఈ యేడు నాగుల పంచమి సోమవారం రోజున రావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు నాగుల పూజ పరమేశ్వరుని అనుగ్రహానికి కూడా కారణమవుతుంది. నాగపంచమి  చిత్త నక్షత్రంలో రావడం దీన్ని ఇది శుభయోగంగా పండితులు చెబుతున్నారు. ఈ శుభయోగం రాత్రి 10గంటలా 21నిమిషాల వరకు ఉంటుంది. ఈ శుభయోగం దాటితే శుక్ల యోగం మొదలవుతుంది. అందుకే శుభయోగంలో నాగులపంచమి పూజ శివుడిని కరుణకు మూలమవుతుంది.

నాగులపంచమి పూజ  ఎలా చేసుకోవాలంటే..

శ్రావణ శుక్ల పక్షం ఐదవ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి, దైవ స్మరణలో  ఉపవాస వ్రతం చేయండి. పూజ సమయంలో శుభ్రమైన ప్రాంతంలో నాగదేవత చిత్రాన్ని లేదా మట్టితో చేసిన పాము విగ్రహాన్ని ప్రతిష్టించాలి. చెట్టు, పుట్ట దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళవచ్చు.  ఆ తర్వాత నాగదేవతకు పసుపు,కుంకుమ, పూలు సమర్పించాలి. నువ్వులు, బియ్యం, బెల్లంతో చేసిన చలిమిడిని, నెయ్యి, పంచదార కలిపిన పాలను నైవేద్యంగా  సమర్పించాలి. దీని తరువాత, పుట్టలో పాలు పోయాలి. ప్రాంతీయతను అనుసరించి కొందరు గుడ్లు పెడతారు. మరికొందరు పుట్టచుట్టూ దారం చుడుతూ ప్రదక్షిణ చేస్తారు.  పూజ ముగింపులో నాగ పంచమి వ్రత కథను విని తరువాత  హారతి ఇవ్వాలి. ఇలా నాగుల పంచమి పూజ ముగుస్తుంది.

ఎందుకు జరుపుకుంటారంటే..

నాగుల పంచమి జరుపుకోవడం వెనుక చాలా కథలు, నమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. పాములు ప్రకృతిలో ఒక భాగం. విషపూరితమైనా పాములను కూడా పూజించడం ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి గొప్పదేననే విషయాన్ని స్పష్టంచేస్తుంది. ఇకపోతే పాములు పరమేశ్వరుడి మెడలో ఆభరణం స్థానం పొందాయి. నాగుల పంచమిరోజు నాగదేవతలను పూజించడం వల్ల  పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఇవన్నీ కాకుండా నాగులపంచమి జరుపుకోవడం వెనుక మరిన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. నాగులను పూజిస్తే సంతానం లేనివారికి సంతానం ప్రాప్తిస్తుందని, వినికిడి లోపం, మాటలు రాకపోవడం వంటి సమస్యలు నయమవుతాయని నమ్ముతారు. ఇందుకోసం మొక్కులు కూడా మొక్కుతారు. నాగుల పూజ సందర్బంలో నూలుదారంతో రక్ష తయారుచేసి పూజలో ఉంచి వాటిని మహిళలు పూజ తరువాత కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల అన్నదమ్ముల ఆరోగ్యం, వారి జీవితం బాగుంటుదని కూడా నమ్ముతారు. ఇలా నాగుల పంచమిలో పలు నమ్మకాలు, విశ్వాసాల ఇమిడిపోయి ఉన్నాయి.

                           *నిశ్శబ్ద.