Read more!

నాగపంచమి విశిష్టతలు

 

నాగపంచమి విశిష్టతలు

 

 

శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే … పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

నాగపంచమి నోము

 

 

పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది.  ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు.  పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు  .  ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది.  చెవిలో చీము కారుతుండేది.  రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది.  ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది.  ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.  ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది.  ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు.  ఆ సాదువు త్రికాలజ్ఞానుడని విని అతనివద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది.  అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమిటని వినయపూర్వకముగా వేడుకున్నది.

 

 

అందుకు ఆ సాధుపుంగవుడు  తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషంవల్ల సంభవించింది.  ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది.   నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం.  నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి.  చెవి చక్కబడుతుందని చెప్పి  ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను.  ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది. 

ఉద్యాపన:  శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది.  అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని  ఆరాధించాలి.  నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి.  నాడు ఉపవాసం వుండాలి.  నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.

 

 

శ్రావణ శుక్ల పంచమి ఉదయమే తలస్నానము చేసి, ద్వారమునకిరువైపులా ఆవుపేడతో అలికి, పసుపు, బియ్యం పిండితో, ముగ్గులు వేసి, పసుపుతోకాని, అవుపేడతో కాని, బియ్యం పిండితో కాని నాగ చిత్రములు వేసి, ఆవుపాలు, వడపప్పు నైవేద్యము పెట్టవలెను.  ఇలా చేసిన యింటిలోని వారు నాగదోషములు, అకాల మృత్యువు నుండి కాపాడబడి, పిల్లలకి, కళ్ళు, చెవులు, మూగ దోషములు పోవును.  ఆయిల్లు పసిపాపలతో కళ కళ లాడుతుండును.  చతుర్ధి నాడు ఉపవాసము ఉండి, పంచమినాడు ఐదు తలల పాము చిత్రములువేసి అనంతాది నాగ రాజులను లాజలు, పంచామృతము, గన్నేరు, సంపెంగ, జాజి పూలతో పూజించి ఏమి తరగకుండా, వండకుండా ఉన్న సాత్విక ఆహారము, పెసలు, చిమ్మిరి, చలిమిడి, పాలు నైవేద్యము చేసి, అవి సేవించి, ఉపవాసము చేయవలెనని నియమము.  ఆడువారు, పిల్లలు, కన్నెలు, పుట్ట వద్దకు వెళ్లి  అలంకరించి, యగ్నోపవీతములు, వస్త్రములు సమర్పించి పాలు పోసి, పూజలు చేయుదురు.  పిల్లలు లేనివారు పుట్టకి, రావి చెట్టు మొదలు ప్రతిష్టించబడిన ప్రతిమలకి ప్రదక్షిణములు చేయవలెను.  ఆమట్టిని పోత్తి కడుపుకి రాసుకొందురు.  కొన్ని ప్రదేశాలలో కొబ్బరి చిప్పలకి రంగులు వేసి దారాలు కట్టి త్రిప్పుట ఆచారము.  దీనిని గురించి కొన్ని కధలు కూడా ప్రచారములో ఉన్నవి.

 

 

పూర్వమొక కాపు పొలము దున్నుచుండగా ఆ నాగలి ఒక బొరియలో దిగబడి అందులో వున్న నాగుపాము పిల్లలు చనిపోయెను.  తల్లి పాము వచ్చి చూసి పిల్లలు చనిపోవుట చూసి దుఃఖము చెంది ఆ రైతు ఇంటికి వెళ్లి రైతుని, పిల్లలను చంపి, కసి తీరక పెండ్లి అయిన కుమార్తె ఇంటికి వెళ్ళెను. ఆనాడు నాగ పంచిమి అవటం వలన ఆమె అనంత నాగుని పూజ చేయు చుండెను. ఆతల్లి పాము కొంత సేపు వేచి యుండవలసి వచ్చెను.  ఆ పాముకు ఆకలి వేసి నైవేద్యానికి పెట్టిన పదార్దములు తినెను.  దాని ఆరాటము తీరింది.  కుమార్తె పూజ ముగించి కనులు తెరువగా విషయము పాము ఆమెకు విషయం చెప్పింది.  ఆమె క్షమాపణ అడుగగా క్షమించెను.  కుమార్తె తనవారిని బ్రతికించమని కోరగా ఆమెకి అమృతము ఇచ్చెను.  తండ్రి ఇంటికి వెళ్లి కుమార్తె వారిని బ్రతికించుకుంది.  అప్పటినుండు ఈరోజు నాగలితో దున్నరాదు, కూరలు కూడా తరుగ రాదనే నియమము వచ్చెను.

 

 

అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారనే పెద్ద సంశయము... పాము పుట్టలని పాములు ఎర్పరచవు, చెదలు ఏర్పరుస్తాయి. వాటిలో ఈ పాములు చేరి వానాకాలములో పిల్లలను పెట్టి, వేరే చోటికి వెళ్తాయి.చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవము వచ్చును.  ఆ ద్రవము మెత్తటి మట్టినందు కలిసి అది గట్టి పడును.  ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు.  ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు.  ఇదే దీని విశిష్టము. వానాకాలము నందు ఈ పుట్టలందు సంచరించు పాముల నుండి విడుదల అగు రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలియును.  పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చేయదు.  ఎండ వేడికి అవి పిల్లలగును.  ఇది ప్రకృతి నియమము.  ఈ మట్టి నందు కలిసిన ఈ పదార్దములు మనము పోయు పాలు, తేనే కలిసి సువాసనల వెదజల్లును.  ఆ వాసనలు వలన మన శరీరమునందు తగు హార్మోనులు ఉత్పత్తి అయి పిల్లలు పుట్టుటకు దోహద పడును.  ఇది పరిశీలించి చూడవలసిన విషయమే కదా.. ఆయుర్వేద శాస్త్రములో నాగు పాము కుబుసములో అరటిపండు కలిపి మందుగా వాడుట కలదు.  ఇది ప్రయోగశాలలో పరిశీలించవలసిన విషయము.  చర్మ రోగాలు నయము చేయుటలో ఈ మట్టి ఎంతో ఉపయోగ పడును.  ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి.  ఇది ప్రకృతి చికిత్సలో ఒప్పుకున్న విషయమే.

 

 

మరి రావి చెట్టుకింద ప్రతిష్టించబడిన విగ్రాహాలకి కూడా పూజ చేస్తాము కదా.... రావి చెట్టు వృక్ష రాజము.  నాగ ప్రతిష్ట రావి చెట్టు క్రింద చేస్తారు.  ఆయుర్వేద  శాస్త్రములో గర్భము నిలువకున్న ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు.  అంతే కాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ళ నుండి ఘనీభుతమైన అమ్ల జనకములు విడుదల చేయును. దీనిని ఒజోన్స్ అంటారు.  ఇది ప్రకృతి నియమము.  ఈ ఒజోన్స్ మనోహరమైన వాసనలు కలిగి యుండును.  మానవుడి ఆరోగ్యముపైన, స్త్రీల పైన ఇవి మంచి ప్రభావము చూపును.

 

 

అందువలన రావిచెట్టుని చుట్టుకొనుట, ప్రదక్షిణాలు చేయట నియమాలు చేసినారు.  40 రోజుల పాటు ఉదయమునే రావి చెట్టు ఆలింగనము, ప్రదక్షిణాలు చేసిన జననేంద్రియ దోషములు తొలగి, గర్భము ధరించుటకు సహాయకారిగా నుండును. నాగుపాము మనిషి వెన్ను పాము ఆకారములో ఉంటుంది.  నాగ ప్రతిమను శాస్త్రోక్తముగా రావి చెట్టు మొదలులో ప్రతిష్టించుతారు.  అప్పుడు పంచరత్నాలు, పంచాపల్లవములు, నవధాన్యములు, గో పంచాకాలతో ప్రతిష్టించుతారు.  నాగ ప్రతిమ చేసిన రాయి పురుష జాతిది అయి ఉండాలి.  రత్నముల ద్వారా చెట్టునుండి విసర్జించబడిన ఒజోన్స్ శిలా ముఖంతరముగా మానవుని శరీరమీద ప్రభావము చూపును.  అందువలన నాగ పంచమి నాడు ఈ నియమాలు చేసినారు. మన పెద్దలు.వీనిని తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా  మంచి ఫలితములు తప్పక పొందవచ్చును.