సూర్దాస్ - పాటలతో కృష్ణుని పూజించిన భక్తుడు!
సూర్దాస్ - పాటలతో కృష్ణుని పూజించిన భక్తుడు!
ఒకప్పుడు భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే తపోనిష్ట ఉండాలనీ, కఠినమైన నిబంధనలను పాటించాలనీ, ఉన్నతకులంలో పుట్టి ఉండాలనీ... రకరకాల అపోహలు ఉండేవి. కానీ ఆ అపోహలను పటాపంచలు చేసి భగవంతుడు అందరివాడన్న సూక్ష్మాన్ని చాటిచెప్పిన ఉద్యమం భక్తి ఉద్యమం. ఆట, పాట, స్మరణ, సంగీతం... ఇలా మనసుకి తోచిన ఏ మార్గంలోనైనా భగవంతుని చేరుకోవచ్చునని ఈ ఉద్యమంతో తేలిపోయింది. ఆ భక్తి ఉద్యమంలో ఓ అరుదైన పాత్ర స్వామి సూర్దాస్!
సూర్దాస్ వ్యక్తిగత వివరాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. కానీ ఆయన 15వ శతాబ్దంలో జన్మించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సూర్దాస్ పుట్టుకతోనే గుడ్డివాడని కొన్ని కథలు పేర్కొంటున్నాయి. పుట్టుగుడ్డివాడైన సూర్దాసుని కుటుంబసభ్యులు సైతం ఈసడించుకునేవారట. దాంతో దృష్టికీ, బంధాలకీ అతీతమైన ఆ పరమాత్మ మీద తన మనసుని లగ్నం చేసుకున్నాడు సూర్దాస్. ఒకరోజు తన ఊరిమీదుగా తీర్థయాత్రలకు వెళ్తున్న భక్తుల కీర్తనలు ఆయన చెవిన పడ్డాయి. అలాంటి కీర్తనలలోనే తన మనసుకి సాంత్వన లభిస్తుందని ఆయనకు తోచింది. అంతే! ఇల్లు వదిలేసి ఆ భక్తబృందంలో చేరిపోయాడు.
కీర్తనలు పాడుతూ కృష్ణుని పారవశ్యంలో మునిగితేలుతూ సూర్దాస్ యమునాతీరాన సంచరించేవాడట. అలా ఓ రోజు ఆయన బృందావనానికి చేరుకున్నాడు. కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ఆ బృందావనంలో, సూర్దాస్ అలౌకకికమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ పారవశ్యంలో పాడిన భజనలు అనతికాలంలోనే ఆయనకు ప్రచారాన్ని తీసుకువచ్చాయి. సూర్దాస్ భక్తిని గమనించిన వల్లభాచార్యులవారు అతనిని తన శిష్యులలో ఒకరిగా చేర్చుకున్నారు. తన భక్తికి గురువు కూడా తోడవడంతో సూర్దాస్ కవితా ప్రతిభకు అంతులేకుండా పోయింది.
సూర్దాస్ భక్తి గురించి ఉత్తర భారతంలో చాలా గాథలు వినిపిస్తాయి. ఒకసారి సూర్దాస్ బావిలో పడిపోయాడట. అంతటి ఆపత్కాలంలోనూ ఆయన కృష్ణుని ధ్యానించడం వీడలేదట. సూర్దాసు భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్ముడు స్వయంగా వచ్చి అతడిని రక్షించాడని చెబుతారు. ఆపై సూర్దాసుకి దృష్టి వచ్చే వరాన్ని ఒసగాడట. కానీ కృష్ణుని చూసిన కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడలేనంటూ సూర్దాస్ తిరిగి తనకు అంధత్వం ప్రసాదించమన్నాడట.
సూర్దాస్ తన జీవితకాలంలో లక్షపాటలు రాశాడని చెబుతారు. అయితే వాటిలో ఎనిమిదివేలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటిలో హిందీతో పాటుగా వ్రజభాష కూడా కనిపిస్తుంది. కృష్ణునితో అనుబంధం ఉన్న వ్రజ భూమిలో అనాదిగా వినిపించే భాషే ఈ వ్రజభాష! బాలకృష్ణుడు పలికిన భాషలోనే బాలకృష్ణుని లీలలను గుర్తు చేసే సూర్దాస్ భజనలు అద్భుతాలు. ‘నేను వెన్న తినలేదమ్మా! ఎవరో నా మొఖానికి వెన్న పూశారు’ అంటూ ఆ వెన్నదొంగని గుర్తుచేసే ‘మై నహీ మాఖన్ ఖాయో!’ వంటి భజనలు సూర్దాస్ రచనలలో అనేకం కనిపిస్తాయి. అలా కృష్ణభక్తిలో మునిగితేలుతూ, పదిమందికీ పంచుతూ వందేళ్లకు పైగా జీవించిన సూర్దాస్ మథుర సమీపంలో తన దేహాన్ని చాలించారని చెబుతారు.
కొన్ని కథల ప్రకారం సూర్దాస్ పుట్టుగుడ్డి కాదు. ఆయన మంచి అందగాడు, ధనవంతుడు. అలాంటి సూర్దాస్ ఒ వేశ్య మోహంలో పడిపోయాడు. ఆమె కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. దివారాత్రులూ ఆ వేశ్య ధ్యానంలోనే గడిపేవాడు. తన తండ్రికి శ్రాద్ధకర్మలను నిర్వహించే సమయంలో కూడా ఎప్పుడెప్పుడు ఆ వేశ్యని కలుద్దామా అని అతని మనసు ఆరాటపడసాగింది. ఆ ఆరాటంతోనే క్రతువుని ముక్తసరిగా ముగించి తన ప్రేయసిని కలుసుకునేందుకు బయల్దేరాడు.
సూర్దాసు ప్రయసిని కలుసుకోవాలంటే ఒక నదిని దాటవలసి ఉంది. కానీ ఆ రాత్రి భీకరమైన వర్షం, హోరు గాలి. అలాంటి వాతావరణంలో, అంత చీకటివేళ నదిని దాటేందుకు పడవవాడు నిరాకరించాడు. దాంతో సూర్దాసు ఒక దుంగను పట్టుకుని ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇంతాచేసి అతను పట్టుకుని వచ్చిన వస్తువు దుంగ కాదు శవం అని తెలుస్తుంది. ఆ తర్వాత ప్రియురాలి మేడని ఎక్కేందుకు ఒక తాడుని పట్టుకుని పై అంతస్తుకి చేరుకుంటాడు. పైకి వెళ్లిన తర్వాత తాను పట్టుకున్నది తాడు కాదనీ పెద్ద పామునని తెలుస్తుంది.
అంత రాత్రివేళ, అలాంటి పరిస్థితులలో, అంత ప్రమాదానికి ఓర్చి తన దగ్గరకు వచ్చిన సూర్దాసుని చూసి వేశ్య ఆశ్చర్యపోతుంది. అతనిలోని మోమపు తీవ్రతను చూసి ఆమెకు కంపరమెత్తిపోతుంది. ‘ఇదే ఆర్తిని ఆ భగవంతుని పట్ల చూపిస్తే నీకు ఆయన దర్శనం లభించి తీరుతుంది కదా!’ అని ఛీదరించుకుంటుంది. ఆ మాటలతో సూర్దాస్ మనసు పరివర్తనం చెందుతుంది. అటుపై ఆయన భగవంతుని ధ్యానంలో మునిగిపోతాడు. అంతేకాదు! ఇకమీదట తన మనసు మరలే అవకాశం లేకుండా గుడ్డివాడైపోతాడు.
కథ ఏదైతేనేం! సూర్దాస్ అనే మహాభక్తుడు ఉన్నాడనీ, కృష్ణుని కీర్తిస్తూ అద్భుతమైన భజనలు రచించాడన్న విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. భక్తి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి హిందూమతానికి పునర్వైభవం రావడానికి సూర్దాస్ కీర్తనలు కూడా ఓ ప్రముఖ పాత్రని పోషించాయి.
- నిర్జర.