Read more!

అహంకారాన్ని అణిచివేయడం ఎలా??

 

అహంకారాన్ని అణిచివేయడం ఎలా?? 

【శ్లోకం:- అహమయం కుతో భవతి చిన్వతః! 
 అయి పతత్యహం నిజ విచారణం ||

అలజడులు, ఆందోళనలు, దు:ఖాలు కలుగుతూనే ఉంటాయి. కనుక ఈ అహంభావనను పోగొట్టుకోవాలి?? ఎలా పోగొట్టుకోవాలో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఏమని?

"అయం అహం కుత: చిన్వత:” ఈ 'నేను' ఎక్కడ నుండి పడుతున్నదీ అని వెతకాలి. అలా వెతకటం మొదలుపెడితే ఈ అహంభావన - 'నేను' అనే భావన ఆశ్చర్యకరంగా పడిపోతుంది. ఇదే నిజమైన విచారణ ఆత్మ విచారణ అంటున్నారు మహర్షి.

'అయం అహం' ఈ 'నేను' అంటున్నారు. ఏ 'నేను'? ఏదో ఒక ఉపాయంతో - పూజ, జపం, చింతనం, ప్రాణ బంధనం మొదలైన ఏదో ఒక సాధన సహాయంతో అన్ని ఇదంభావనలు, అన్ని సంకల్పాలు, ఆలోచనలు ఆగిపోయిన తర్వాత, ఈ ఆలోచనలనకు ఆధారంగా మిగిలి ఉన్న ఒకే ఒక్క 'నేను' అనే భావన, అహంభావన ఏదైతే ఉందో ఆ 'నేను'. కాబట్టి మనం విచారణ చెయ్యవలసింది ఏ నేనునో జాగ్రత్తగా గమనించాలి. అన్ని తలంపులకు ఆధారమైన ప్రధమ తలంపు 'నేను' అనే తలంపు. ఈ 'నేను' అనే తలంపును, అహంభావనను పట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. పాదరసంలా జారిపోతుంది. అలాగని వదిలేస్తే ఈ నేను అనే తలంపు అనేక తలంపులకు, ఆలోచనలకు కారణమై మనను ఈ సుఖదు:ఖాలతో కూడిన ప్రపంచంలో బంధిస్తుంది. ఆనందానికి దూరం చేస్తుంది. ఎంతవరకు ఈ అహంభావం నేను అనే తలంపు ఉన్నదో అంతవరకు మనకు దు:ఖాలు, బాధలు, భయాలు తప్పవు.

ఒకచోట ఒక స్కూలు గదులు తగలబడిపోతున్నవి. అన్నీ పూరిపాకలే. అన్నీ అంటుకొని మండిపోతున్నాయి. టీచర్లు, పిల్లలు అందరూ భయంతో పరుగులు తీసుకుంటూ బయటపడ్డారు. పాకలన్నీ పూర్తిగా తగలబడి పోయాయి. పిల్లలందరినీ ఈ రోజుకు బడి లేదు ఇళ్లకు వెళ్లిపోండి అని టీచర్లు చెప్పారు. అందరూ సంతోషంతో ఎగురుకుంటూ ఇళ్ళకు వెళుతున్నారు. అంతలో ఆ దారిన ఒక సాధువు వస్తున్నాడు. 

అతడు టీచరుతో 'బాబూ' ఏమిటి? ఏం జరిగింది? పిల్లలంతా అలా ఎగురుకుంటూ వెళ్తున్నారేమిటి? అన్నాడు. 

"స్కూలు పాకలన్నీ తగలబడి పోయినాయ్, అందువల్ల సెలవు ఇచ్చి ఇంటికి పొమ్మన్నాం. అందుకే అందరూ ఎగురుకుంటూ వెళుతున్నారు" అన్నాడు టీచరు. 

"అదేమిటండీ! వాళ్లకంత ఆనందం ఎందుకు?" అన్నాడు సాధువు.

"అంతేనండి వాళ్లకి స్వేచ్చ వచ్చింది గదా! రోజూ క్లాసులో కూర్చోబెట్టి పాఠాలు చెబుతాం గదా! ఇవ్వాళ ఈ బందిఖానా తప్పిందని ఆనందం. పట్టి ఉంచితే దుఃఖం, వదిలిపెడితే ఆనందం పిల్లలకు. ఇప్పటి పిల్లల తీరే అంతలెండి, వాళ్ళకు చదువు మీద శ్రద్ధ ఉండదు" అన్నాడు టీచరు. 

అంతలో దూరంగా చెట్టుక్రింద కూర్చొని ఏడుస్తున్న బాలుణ్ణి చూపి ఆ సాధువు, "అడుగోనండి ఆ బాలుడు మాత్రం ఆనందించటం లేదు, పైగా దు:ఖపడుతున్నాడు. అతడికి చదువు మీద ఎంత శ్రద్ధ పాపం!" అన్నాడు.

"అంతశ్రద్ధ గల వాడెవడూ ఇక్కడ లేడే! అయినా అడిగి చూద్దాం" అని వాడి దగ్గరకొచ్చి "ఎందుకురా ఏడుస్తున్నావు?" అని అడిగారు. 

దానికి వాడు "ఏంచేద్దామండి స్కూలు పాకలు తగలబడి పోయాయే గాని టీచరు బ్రతికే ఉన్నాడు గదండీ. రేపు ఈ చెట్టు క్రిందే కూర్చోబెట్టి పాఠాలు చెబుతాడు. ఈ మాత్రం దానికి ఆనందం ఎందుకు?" అన్నాడు.  

అలాగే పాకలన్నీ పోయినా టీచరు ఉంటే పాఠాల బాధ తప్పనట్లు అన్ని ఆలోచనలు పోయినా ఈ 'నేను' అనే భావన ఉంటే ఈ ప్రపంచం యొక్క అస్థిత్వం గాని, దీనివల్ల కలిగే బాధలు కాని తప్పవు. సాధకుడు ప్రయత్నంతో అన్ని ఆలోచనలను ఆపివేయగలుగుతాడే గాని ఈ 'నేను' అనే ప్రధమ తలంపును  అహంభావనను ఎలా తొలగించుకోవాలో తెలియక తికమకపడతాడు. ఇక్కడే ఉపనిషత్ గ్రంధాలు, మహాత్ములు, గురువులు చేయి అందించాలి. మార్గం చూపాలి. అందుకే ఇక్కడ ఉపాయం చెబుతున్నారు. ఈ 'అహంవృత్తి' - నేను అనే భావన ఎక్కడ పుడుతున్నదో అని వెతికితే, విచారణ చేస్తే ఈ 'నేను' అనే భావన పడిపోతుంది. ఇదే నిజమైన ఆత్మ విచారణ అని. కనుక ఇలా 'నేను' అనేది ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనిషిలో అహంకారం నశిస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ