నువ్వే నన్ను కాపాడాలి రామా!
నువ్వే నన్ను కాపాడాలి రామా!
వనకరిచిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా
వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేఁదుఱు జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేఁటి తరమా యిరుమూఁటిని గెల్వనైదుసా
ధనములనీవె కావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!
మగ ఏనుగు ఆడ ఏనుగు స్పర్శ తగలగానే దానిని వెంబడిస్తూ వేటగాడి ఉచ్చులో పడుతుంది; చేప తన నోటి దగ్గరకి ఆహారం వచ్చిందనుకుని జిహ్వ చాపల్యంతో గాలానికి చిక్కుకుంటుంది; పాము నాగస్వరాన్ని వినే ప్రయత్నంలో మనిషికి బందీ అవుతుంది; లేడి తనకు కనిపించినదానిని అనుసరిస్తూ ప్రమాదంలో పడుతుంది; తుమ్మెద తామరపువ్వులోని వాసన కోసం దిగి అందులో చిక్కుబడిపోతుంది. ఇలా పంచేంద్రియాలూ వినాశకరమైనవే! ఆ పెను ప్రమాదం నుంచి నువ్వే నన్ను కాపాడు రామా!!!