మేషరాశి
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదము (చూ,చే, చో, ల, లీ, లూ, లే, లో, ఆ)
ఆదాయం : 2, వ్యయం : 14 - రాజపూజ్యం: 5, అవమానం : 7
వీరికి ఈ సంవత్సరము ప్రారంభమున మరియు కార్తిక మార్గశిరముల యందు ఏకాదశ శనియగుటచే సర్వము అనుకూలముగనుండును. కానీ చైత్ర బహుళం నుండి మిగిలిన సమయమందు ద్వాదశ శని, ఏలిననాటి శని ప్రారంభము కావున జాగ్రత్త అవసరము. ఆరోగ్యలోపములు, బంధువైరములు, గృహచ్ఛిద్రములు బాధించును. వృథా వ్యయములు కలుగును. వ్యవసాయమునందు నష్టమెక్కువ. మానసిక అశాంతి అధికముగనుండును. వృథా వాదనలకు చోటివ్వరాదు. సంవత్సరారంభము నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురువు అగుటచే ధనసంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్ఠలు, వీరి మాటలను అందరూ గౌరవింతురు. శుభమూలక ధనవ్యయము, సంతోషము కలుగును. పిమ్మట గురువు తృతీయ చతుర్థ రాశులలో సంచరించును కావున శ్రమ అధికము. ఉద్యోగభంగము, వృథావైరములు, బంధువిరోధములు బాధించును. వైశాఖ బహుళం వరకు షష్ఠకేతువు అటు పిమ్మట ఏకాదశ రాహువు అయినందున లాభము, జయము, ప్రోత్సాహము, గౌరవ మర్యాదలు, సన్మానము కలుగును. పుత్రమూలక వ్యధ ఒకప్పుడు కలుగవచ్చును. చైత్ర వైశాఖములందు, కార్తిక మార్గశిరములందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్త అవసరము.
అశ్విని వారికి, సంవత్సరారంభము నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్ధం వరకు నైధనతారయందు శని, సంవత్సరారంభము నుండి కార్తిక బహుళం వరకు నైధనతారయందు రాహువు సంచరించుదురు. శ్రావణం నుండి సంవత్సరాంతం వరకు కేతువేధ కలదు. భరణి వారికి, వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైధనతారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు, జన్మతారయందు కేతువు సంచరించుదురు. కృత్తిక వారికి, సంవత్సరారంభము నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు, సంచరించును. కావున ఆయా సమయములందు జాగ్రత్త అవసరము. శని, గురువులకు శాంతియొనర్చిన మేలు. సుందరకాండ పారాయణము, గురుసేవయొనర్చిన మేలు జరుగును.