దెయ్యాలను వదిలించే మెహందీపూర్ ఆలయం

 

 

దెయ్యాలను వదిలించే మెహందీపూర్ ఆలయం

 

 

ప్రేతాత్మలు ఉన్నాయో? ఉంటే అవి మనుషులను పీడాస్తాయా? అన్నది నమ్మకానికి సంబంధించిన అంశం. కానీ ఒకవేళ దెయ్యాలు ఉంటే, దేవుడూ ఉన్నట్లే! ఆ దుష్టాత్మలు పీడిస్తుంటే... దేవుడి దగ్గర రక్షణ దొరికి తీరాల్సిందే. ఇదే నమ్మకంతో రాజస్థాన్లోని ‘మెహందీపూర్ బాలాజీ’ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. దెయ్యాలు పీడిస్తున్నాయని భావించేవారితో ఈ ఆలయం భయం గొలుపుతూ ఉంటుంది.

రాజస్థాన్లోని అరావళీ పర్వాతల నడుమ దౌసా అనే జిల్లాలో ఉందీ ఆలయం. అవడానికి చాలా చిన్న ఆలయమే! కానీ దుష్టశక్తుల నుంచీ ఎక్కడా విడుదల సాధ్యం కాకపోతే.... ఈ ఆలయమే శరణ్యం అంటారు. అందుకే రాజస్థాన్ చుట్టపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. ఎప్పుడో వేయి సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఓ భక్తునికి ఆంజనేయుడు బాలుని రూపంలో కనిపించారట. తాను ఫలానా చోట తాను ఉన్నానని, అక్కడకు చేరుకుని రోజూ తనని పూజించమనీ ఆజ్ఞాపించారట. కానీ ఎంత వెతికినా కూడా భక్తునికి స్వామివారు వెలసిన ప్రదేశం కానరాలేదు. దాంతో అతను కఠినమైన సాధనలో మునిగిపోతూ... స్వామివారు వెలసిన చోటుని చూపమని ఆంజనేయుని వేడుకున్నాడట. కొద్దిరోజుల తర్వాత స్వామివారు మళ్లీ కలలో కనిపించి తాను వెలసిన చోటు గురించి స్పష్టతని అందించారు.

 

 

స్వామివారు వెలిసిన చోటున బాలహనుమంతునితో పాటుగా మరో రెండు విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఒకటి శివుని ఉగ్రరూపమైన భైరవుని సూచించే విగ్రహమైతే మరొకటి దుష్టశక్తులకు రాజుగా భావించే ‘ప్రేతరాజు’ విగ్రహం. వేయి సంవత్సరాల క్రితం ఇక్కడ పూజల మొదలైనప్పటి నుంచీ కూడా, స్వామివారి అసాధారణ మహిమలు భక్తులకు అనుభవంలోకి రాసాగాయి. దుష్టశక్తుల బారిన పడ్డవారితో పాటుగా... మానసిక స్థితి సరిగా లేనివారు, మూర్ఛరోగులు, పక్షవాతంతో బాధపడేవారు, సంతానం లేనివారు ఈ స్వామివారి ఆశీస్సులతో సమస్య నుంచి దూరమయ్యేందుకు ఇక్కడకు చేరుకుంటారు.

 

ఈ ఆలయంలోకి చేరుకోగానే బాలరూపంలో ఉన్న హనుమంతుడు కనిపిస్తాడు. మన దేశం మీదకు దండెత్తిన ముష్కరులు ఒకానొక సమయంలో ఈ విగ్రహాన్ని పెకిలిచేందుకు ప్రయత్నించారట. కానీ ఎంత తవ్వినా కూడా వారికి విగ్రహం లోతు తెలియనేలేదట! దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని చెబుతారు. ఉగ్రుడైన ఈ స్వామి పాదాల చెంత నిత్యం నీరు ప్రవహించేలా చూస్తారు. ఆ నీటిని భక్తులకు తీర్థంగా అందిస్తారు. మానసిక సమస్యలు ఉన్నవారిలో, ఈ తీర్థం తాగిన వెంటనే మార్పు కనిపిస్తుందని అంటారు.

 

 

మెహందీపూర్ బాలాజీ ఆలయం నిత్యం కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఇక స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, శనివారాల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. కాకపోతే ఊరికనే ఈ ఆలయాన్ని చూడాలనుకుని ఎవరన్నా అడుగుపెడితే మాత్రం భయపడక తప్పదు. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ, అరుస్తూ, గంతులు వేస్తూ ఉండే జనాలతో ఈ ఆలయం నిండిపోతుంది. ఒకోసారి అలాంటివారిని గొలుసులతో కట్టేయడమో, సంకెళ్లు వేయడమో చూడవచ్చు. కానీ వాళ్లందరూ కూడా త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారు ఆలయ నిర్వాహకులు భరోసా ఇస్తుంటారు!

- నిర్జర.