నక్కలకి ప్రసాదం పెట్టే ఆలయం - కాలో దుంగార్!
నక్కలకి ప్రసాదం పెట్టే ఆలయం - కాలో దుంగార్!
గుజరాత్లో కచ్ అనే జిల్లా ఉంది. ఇది మన దేశంలోనే అతిపెద్ద జిల్లా. ఈ జిల్లా ముఖ్యకేంద్రానికి ఓ 90 కిలోమీటర్ల దూరంలో కాలో దుంగార్ అనే పర్వతం ఉంది. ఈ పర్వతం నల్లటి నలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు. కాలో దుంగార్ పదిహేను వందల అడుగుల ఎత్తున ఉంటుంది. కాబట్టి ఈ పర్వతాన్ని ఎక్కితే దూరదూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కనిపిస్తాయి. ఆఖరికి పాకిస్తాన్ భూభాగం కూడా కనిపిస్తుంది. అందుకని పర్యటకులు ఈ కొండని ఎక్కేందుకు ఉత్సాహపడుతూ ఉంటారు. అయితే వారి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది! అదే కాలో దుంగార్ మీద ఉన్న దత్తాత్రేయుని ఆలయం.
కాలో దుంగార్ మీద ఉన్న ఆలయం చిన్నదే! దాని వెనుక ఉన్న చరిత్ర మాత్రం అనూహ్యం. త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయులవారు ఒకానొక సందర్భంలో ఈ పర్వతాలు మధ్యన సంచరించారట. ఆ సమయంలో ఆయన దగ్గర ఆహారాన్ని ఆశించి కొన్ని నక్కలు దగ్గరకు వచ్చాయి. కానీ ఆ నక్కల ఆహారాన్ని తీర్చేందుకు దత్తాత్రేయులవారి దగ్గర ఎలాంటి ఆహారమూ లేదయ్యే! దాంతో తన చేతినే వాటి ముందు ఉంచారట స్వామివారు. ‘లే అంగ్’ (నా శరీరభాగాన్ని తీసుకో) అంటూ తన చేతినే వాటికి అర్పించారట.
మరొకకథ ప్రకారం ఒకానొక రాజు, దత్తాత్రేయుని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. ఆ రాజు తపస్సుని పరీక్షించేందుకు దత్తాత్రేయులవారు ఒక నక్క రూపంలో రాజు దగ్గరకు చేరుకుని తన ఆకలి తీర్చమని అడిగారట. దాంతో ఆ రాజు రుచికరమైన భోజనాన్ని ఆ జీవి ముందు ఉంచాడు. ‘ఇదేనా నీ దానగుణం. మాంసాహారాన్ని ఇష్టపడే నా ముందు ఇలాంటి ఆహారం ఉంచుతావా!’ అంటూ ప్రశ్నించిందట ఆ నక్క. దాంతో రాజు స్వయంగా తన చేతిని నరికి మారురూపంలోని దత్తాత్రేయుల ముందు ఉంచాడట. రాజు దానగుణానికి దత్తాత్రేయులవారు ఎంతో ప్రసన్నులై ఆయనకు తన నిజరూపంలో సాక్షాత్కరించారని చెబుతారు.
కథ ఏదైతేనేం, ఈ ప్రాంతంలో నక్కల ఆకలిని తీర్చిన ఘటన ఒకటి జరిగే ఉంటుంది. ఆ ఘటన ఆధారంగా గత 400 సంవత్సరాలుగా నక్కలకు ప్రసాదాన్ని అందించే ఆచారమూ సాగుతోంది. రోజూ మధ్యాహ్నమూ, సాయంత్రమూ ఇక్కడి దత్తాత్రేయ ఆలయంలో ఉన్న పూజారి ఒక అరుగు దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఓ పళ్లెం మీద కొడుతూ ‘లే అంగ్, లే అంగ్’ అని అరుస్తాడు. పూజారి మాట కోసమే ఎదురుచూస్తున్నాయా అన్నట్లుగా... కొద్ది నిమిషాలలో ఓ పాతిక నక్కలు బిలబిలలాడుతూ వచ్చేస్తాయి. అరుగు మీద పూజారి ఉంచిన ప్రసాదాన్ని ఆవురావురుమంటూ తింటాయి. చాలా సందర్భాలలో బెల్లంతో చేసిన పరమాన్నాన్నే ప్రసాదంగా పెడుతూ ఉంటారు.
కాలో దుంగార్లో జరిగే ఈ వింతను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. ఇలా ఎన్ని వందల మంది ఆ ఆలయం చుట్టుపక్కల తిరుగుతున్నా, నక్కలు వారిని దాడి చేసిన సంఘటన ఇప్పటివరకూ ఒక్కటి కూడా నమోదు కాకపోవడం విచిత్రం! క్రూరత్వానికి పేరుపొందిన నక్కలు కాస్తా ఆలయం దగ్గరకు రాగానే సాధుజంతువులుగా మారిపోవడం ఆ దత్తాత్రేయుని మహిమే అని చెబుతారు.
- నిర్జర.