Read more!

రామాయణంలో కీలక పాత్ర మారీచుడు...

 

రామాయణంలో కీలక పాత్ర మారీచుడు

( శ్రీరామనవమి సందర్భంగా)

శ్రీమద్రామాయణంలో అతి ముఖ్యమైన పాత్ర ఈ ‘మారీచుడు’. వీడే లేకపోతే సీతాపహరణం జరిగి ఉందేది కాదు..,రావణ సంహారం జరిగేది కాదు. మారీచుడు మహా మాయలమారి..,జిత్తులమారి. కామరూపవిద్యలో, ఇతరుల గొంతును అనుకరించడంలో సిద్ధహస్తుడు. మారీచుడు పుట్టుకతో రాక్షసుడు. తాటక అనే యక్షిణికి, సుందుని వల్ల కలిగిన కుమారుడు. మారీచుని పాత్ర రామాయణంలోని, బాలకాండలో విశ్వామిత్రుని యాగసంరక్షణ వేళ ప్రవేశిస్తుంది. ఆజ్యధారలతో అగ్నిహోత్రుని సంతృప్తి పరుస్తున్నాడు విశ్వామిత్రుడు. సుస్వర వేదగానం సాగుతోంది. రామ లక్ష్మణులు ధనుర్థారులై యాగ సంరక్షణ చేస్తున్నారు. అప్పుడు తన అనుచరగణంతో యాగవిద్వంసానికి వచ్చిన మారీచుని మానవాస్త్రంతో కొట్టాడు శ్రీరాముడు. ఆ అస్త్ర ఘాతానికి మారీచుడు నూరు యోజనముల దూరంలోనున్న దక్షిణ సముద్రంలో కొనఊపిరితో పడ్డాడు. అక్కడితో మారీచుని పాత్ర అయిపోయింది అనుకుంటే పొరపాటు. బాలకాండలో తారసపడ్డ మారీచుడు తిరిగి అరణ్యకాండలో ప్రత్యక్షమవుతాడు. ఎలా..?

ఏ సందర్భంలో అంటే....
ఖర, దూషణ, త్రిశిరులతో సహా జనస్థానవాసులైన పదునాలుగు వేలమంది రాక్షసులు రామునిచేతిలో చంపబడ్డారని అకంపనుని వల్ల విన్న రావణుడు...‘ఇప్పుడేవెళ్ళి ఆ రాముని చంపేస్తాను’ అన్నాడు. ‘క్షమించండి దానవేశ్వరా... ముక్కోటి దేవతలు ఏకమై వచ్చినా ఆ రాముని జయించలేరు. ధారాపాతంగా వానలు కరిసే వర్షాకాలంలో సాగరాభిముఖంగా పరుగులుతీసే నదీప్రవాహ వేగానికి తన బాణాలతో ఆనకట్ట కట్టగల ధనుర్వేత్త ఆ రాముడు.’ అన్నాడు అకంపనుడు. ‘మనకు ద్రోహం చేసిన ఆ నీచుని సంహరించే ఉపాయమే లేదా’ అని అడిగాడు రావణుడు. ‘ప్రభూ..ఆ రామునికి అపురూప సౌందర్యవతి అయిన భార్య ఉంది. ఆమె పేరు సీత. ఆమెను అపహరించగలిగితే..సీతా వియోగ వేదనతో రాముడు మరణిస్తాడు’ అని సలహా ఇస్తాడు అకంపనుడు. అంతే... రావణుడంతటివాడు కూడా.. సీతాపహరణానికి రహస్యంగా, ఒంటరిగా బయలుదేరతాడు. ఆ ప్రయత్నంలో భాగంగా సహాయార్థమై ముందుగా మారీచుని ఆశ్రమానికి వస్తాడు. అదేమిటి...మారీచుడు రాక్షసుడు కదా...అతనికి ఆశ్రమం ఏమిటి..? అనే సందేహం వచ్చింది కదూ మీకు..? అదే వాల్మీకిమహర్షి రచనా చమత్కృతి. ముందు కథలోకి వెడదాం.

రావణుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన లంకేశ్వరునకు స్వాగత మర్యాదలు చేసి.. ఆగమన కారణం అడిగాడు మారీచుడు. సీతాపహరణ విషయంలో సహాయం చెయ్యమన్నాడు రావణుడు. ఆ మాట వినగానే భయంతో మారీచుని గొంతు ఎండిపోయింది. ‘సీతాపహరణం చేయాలనే సంకల్పంతో నాదగ్గరకు వచ్చావా? నీకీ సలహా ఇచ్చినవాణ్ణి ముందు సంహరించు. ఎందుకంటే  వాడు నీకేకాదు సర్వరాక్షసజాతికి పరమశత్రువు.’ అన్నాడు మారీచుడు. ‘మరీచా..పగవానిపై ప్రతీకారం తీర్చుకోవద్దంటావా..? తండ్రిచేత దేశబహిష్క్ర్రుతుడై అరణ్యానికి వచ్చిన ఆ రాముడు., ఆ క్షత్రియకులాధముడు...అధర్మవర్తనుడు., తన పరాక్రమ ప్రదర్శనకోసం నిష్కారణంగా జనస్థానవాసులైన మన రాక్షససైన్యాన్ని సంహరించాడు. అందుకు ప్రతీకారమే ఈ సీతాపహరణం. పద.’ అన్నాడు రావణుడు. ‘రావణా..రాముని గురించి నీకెవరో చాలా తప్పుగా చెప్పారు. పినతల్లి వంచనకు గురైన రాముడు.. పితృవాక్యపాలనకోసం దండకారణ్యానికి వచ్చాడు. ఆయన అధర్మవర్తనుడు కాదు.

‘రామో విగ్రహవాన్ ధర్మః సాధుస్సత్య పరాక్రమః’

మూర్తీభవించిన ధర్మమే శ్రీరాముడు. సత్యపరాక్రమవంతుడు. నీతివర్తనుడు. అఖండ ధనర్విద్యాకోవిదుడు. అట్టి వీరునితో వైరం ప్రాణాంతకం. ఆలోచించగా.. ఆ సీత నీ మరణంకోసమే పుట్టిందనిపిస్తోంది. నీకు స్త్రీసుఖానికేం తక్కువలేదు. నీ కామవాంఛకు సర్వరాక్షసజాతిని బలిచేయకు.వెళ్ళి లంకాభోగాలు అనుభవించు.’ అని హితవు పలికాడు మారీచుడు. అంతే...మారు మాట్లాడకుండా వెనుదిరిగి లంకానగరం చేరుకున్నాడు రావణుడు. అప్పుడు... శ్రీరాముని సౌందర్యానికి కామవశీభూతురాలైన శూర్పనఖ, లక్ష్మణుని చేతిలో భంగపడి.., తన అన్న రావణుని దగ్గరకు వచ్చి.. సీతాదేవి సౌందర్యాన్ని వివరించి ‘సీతను నీ భార్య చేసుకో.. అప్పుడే నీ వీరత్వానికి అలంకారం’ అని రెచ్చగొడుతుంది. రావణుడు తిరిగి మారీచాశ్రమానికి వచ్చాడు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.., భయపడ్డాడు మారీచుడు. ఎన్నో హితవులు చెప్పాడు. వినకుండా మొండిగా నిలబడ్డాడు రావణుడు.

‘రావణా...ఏమిటి నీ మూర్ఖత్వం. రాముడు అగ్నిహోత్రుడు అయితే..సీత అగ్నిజ్వాల. అవివేకంగా ఆ అగ్నిలో దూకాలని ప్రయత్నించకు.  సూర్యుని నుండి కాంతిని వేరు చెయ్యడం సాధ్యమైతే...రాముని నుండి సీతను దూరంచెయ్యడం సాధ్యం. ఇంతగా ఎందుకు చెప్తున్నానో తెలుసా..? విశ్వామిత్రుని యాగవిద్వంసానికి నేను ఉపక్రమించిన వేళ బాలుడుగా నాకు తారసపడ్డాడు ఆ రాముడు. అప్పటికింకా ధనుర్విద్యాభ్యాసం పూర్తిగా నేర్వలేదు ఆ రాముడు. నాకు వెయ్యి ఏనుగుల బలం ఉంది. అమిత మాయోపాయాలున్నాయి. మహావీరులైన రాక్షసగణం నాకు తోడోగా ఉన్నారు. అలాంటి నన్ను తన బాణంతో నూరు యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడేలా కొట్టాడు ఆ బాలరాముడు. ఇప్పుడు ఆ రాముడు ధనుర్విద్యావిశారదుడు.

వయసుతోపాటు అనుభవం ఉంది. నా మాట విను. ఆ రాముడు తన పరాక్రమ ప్రదర్శన కోసం మనవారిని సంహరించలేదు. మన వారే రాముని రెచ్చగొడితే.. ఆత్మరక్షణ కోసం వారిని చంపాడు. మరో విషయం చెప్తాను విను. నాకు రాముని మీద కోపం చావక.. రాముడు  దండకారణ్యం వచ్చాడని తెలిసి..తగిన సమయం చూసి ఇద్దరు అనుచరులతో ఆ రాముని మీదకు దూకాను. కానీ.. ఆ రాముడు మా ఉనికి ఎప్పుడు పసిగట్టాడో తెలియదు. రెండు బాణాలతో నా అనుచరులను సంహరించాడు. నేను ఎలాగో రామబాణ ఘాతానికి అందకుండా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాను. అప్పటినుంచి రాముడంటే భయం పట్టుకుంది.

రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ

రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయన్తి మే

రాముడంటేనే కాదు. ‘ర’ అనే అక్షరంతో ప్రారంభమయ్యే రత్నాలు, రతాలు అనే ఏ మాటవిన్నా భయం కలుగుతోంది. ఈ దండకారణ్యంలో ఏ వృక్షాన్ని చూసినా జటా వల్కలాలు ధరించిన శ్రీరామునిలా కనిపిస్తున్నాయి. ఆ నాటి నుంచి హింసా ప్రవృత్తికి స్వస్తి చెప్పి ఇక్కడ ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాను. ఆ రాముడు నిన్నేకాదు.. మన పూర్వీకులైన బలి, నముచి వంటి మహావీరులను కూడా చంపగల సమర్థుడు. కనుక... సీతాపహరణ ప్రయత్నం మానుకో’ అన్నాడు...మారీచుడు. వినలేదు రావణుడు.ఈ ప్రయత్నంలో నాకు సహాయం చెయ్యకపోతే చంపుతానని బెదిరించాడు రావణుడు.

‘నీ చేతిలో చావడంకన్న పరమాత్ముడైన ఆ రాముని చేతిలో చావడం మంచిది..పద’ అని మాయలేడిగా మారి ముందుకు నడిచాడు మారీచుడు. ఆ  తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసినదే. మారీచుడంతటివాడు రామబాణ ఘాతానికి రాక్షస ప్రవృత్తిని విడనాడి., ఆశ్రమం నిర్మించుకుని తపోమయ జీవితం సాగించాడంటే... ఆ ఘనత రామబాణానిదే. రామబాణానికే అంత శక్తి ఉంటే..రామనామానికి ఎంత శక్తి ఉంటుందో ఊహించండి.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
 సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం