మార్గశిర మాసంలో గురువార లక్ష్మీ పూజ విశిష్టత తెలుసా..ఈ రోజు ఇలా పూజ చేయండి..!
మార్గశిర మాసంలో గురువార లక్ష్మీ పూజ విశిష్టత తెలుసా..ఈ రోజు ఇలా పూజ చేయండి..!
హిందూ మతంలో లక్ష్మీదేవికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి కుటుంబం ఎలాంటి లోటు లేకుండా హాయిగా బ్రతకాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అందరూ లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని అనుకుంటారు. కానీ అష్ట లక్ష్ముల అనుగ్రహం ఉంటేనే జీవితం సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఈ లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీ దేవిని పూజిస్తే సకల శుభాలు, ఐశ్వర్యం, సకల సంతోషాలు చేకూరతాయని అంటారు.
మార్గశిర మాసం సందర్భంగా డిసెంబర్ నెలలో నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి. అంటే నాలుగు గురువారాలు వచ్చాయి. ఈ నాలుగు వారాలు మాత్రమే కాకుండా పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కూడా కలిపి మొత్తం 5 గురువారాలతో లక్ష్మీ వారం నోము నోచుకుంటారు.
గురువారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ గది శుభ్రం చేసుకుని పూజ గదిలో బియ్యం పిండితో అష్టదళ పద్మం వేయాలి. ఆ తరువాత మహా గణపతిని పూజించాలి. ఆ తరువాత శ్రీసూక్త విధానంగా మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిర్వహించాలి. శక్తి కొద్ది నైవేద్యాలు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. ఇలా చేసిన తరువాత లక్ష్మీవార కథ చదువుకోవాలి. అదే రోజు 5మంది ముత్తైదువులను పిలిచి భోజనం పెట్టాలి. తదనంతరం వారిని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
ఈ నోము చేసుకునే మహిళలు చాలా శుచిగా ఉండాలి. లక్ష్మీవారాలలో అంటే గురువారం రోజులలో తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం చేయకూడదు. పొద్దెక్కే వరకు కానీ, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో లేదా సూర్యాస్తమయం తరువాత కానీ నిద్రపోకూడదు. నియమ నిష్టలతో, భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరించన వారి ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కేవలం గురువారాలలో మాత్రమే కాకుండా.. మార్గశిర మాసం మొత్తం కూడా లక్ష్మీ దేవిని నియమ నిష్టలతో కొలవాలి. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
*రూపశ్రీ.