Read more!

మార్గశిర లక్ష్మీ వ్రతం Margashira Lakshmi Vratam

 

మార్గశిర లక్ష్మీ వ్రతం

Margashira Lakshmi Vratam

 

మార్గశిర మాసం వచ్చేసింది. ఈ నెలలో ముఖ్యంగా మార్గశిరంలో వచ్చే ఏ గురువారమైనా లక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ఈ నెలలో లక్ష్మీవ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, సర్వ సౌఖ్యాలూ ప్రాప్తిస్తాయని పూరాణాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించిన కథ ఒకటి చూడండి.

 

పూర్వం ఒక చిన్నారి సవతి తల్లి పెట్టే బాధలు పడలేక అవస్త పడుతోంది. ఆమెను చూస్తే అందరికీ జాలిగా ఉండేది. ఒకరోజు ఆలయ పూజారి ఆ చిన్నారిని చేరదీసి ''అమ్మా! నువ్వు లక్ష్మీదేవి పూజ చేసుకో.. నీ కష్టాలన్నీ తీరతాయి..'' అని చెప్పాడు.

 

ఆమె దగ్గర లక్ష్మీదేవి ప్రతిమ అయినా లేదు. దాంతో మట్టితో బొమ్మను తయారుచేసి, ఆ విగ్రహాన్నే లక్ష్మీదేవిగా భావించి ప్రార్ధించసాగింది. సవతితల్లి తన కూతుర్ని ఆడించమని చేతిలో ఉంచి, ఆమెకోసం ఇచ్చిన బెల్లంలోంచి చిన్న ముక్క తీసుకుని లక్ష్మికి నైవేద్యం సమర్పించేది.

 

కొన్నాళ్ళకు ఆమె పెళ్లయింది. మంచి వరుడు వచ్చాడు. ఆమె వెళ్తూ వెళ్తూ తాను చేసుకున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసికెళ్ళింది. ఆమె చేసిన పూజాఫలంతో అత్తగారింట్లో సిరిసంపదలు ప్రవాహంలా వచ్చిపడ్డాయి. అయితే ఆమె వెళ్ళిన మరుక్షణం పుట్టింట్లో పేదరికం తాండవించింది.

 

సంగతి తెలిసి ఆమె బాధపడింది. సవతితల్లిమీద ఎలాంటి కోపతాపాలూ లేవు. తమ్ముడు వచ్చి పరిస్థితి చెప్పగా అయ్యో అనుకుని కొన్ని బంగారు కాసులను మూటకట్టి ఇచ్చింది. కానీ తమ్ముడు దారిలో వాటిని పారేసుకున్నాడు. అలా రెండోసారి, మూడోసారి కూడా బంగారు కాసులను ఇచ్చినా, తమ్ముడు పారేసుకున్నాడు. సోదరి ఇచ్చినా తాను నిలుపుకోలేకపోయానని అతను బాధపడ్డాడు.

 

కొన్నాళ్ళ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళింది.

అక్కడ సౌభాగ్యాలు రావాలని సవతితల్లితో ''అమ్మా! ఇవాళ మార్గశిర గురువారం.. చాలా మంచిరోజు.. నువ్వు ఏమీ తినకుండా, తలకు నూనె రాసుకోకుండా ఉండు.. లక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం'' అంది.

కానీ ఆవిడ పిల్లలకు అన్నం పెడుతూ, ఆకలికి ఆగలేక తాను కూడా కొంచెం తింది.

అది విని కూతురు ''అయితే వచ్చే గురువారం చేసుకుందాం'' అని వాయిదా వేసింది.

రెండోవారం ఆ తల్లి పిల్లలతోపాటు తాను కూడా తలకు నూనె రాసుకుంది. నియమోల్లంఘన జరిగినట్లు తెలిసి కూతురు మళ్ళీ వచ్చేవారం అంటూ వాయిదా వేసింది.

ఆ తర్వాత మూడో గురువారం కూడా తల్లి నియమాలను పాటించలేకపోయింది.

ఇక కూతురు బాధగా ''అమ్మా! ఇదే ఆఖరి మార్గశిర గురువారం.. ఈసారి అయినా జాగ్రత్తగా ఉండు.. లేదంటే ఈ పేదరికం పోదు..'' అంటూ పదేపదే చెప్పగా, తల్లి భయంతో గుర్తు ఉంచుకుని నియమాలు పాటించింది.

మొత్తానికి చివరి మార్గశిర గురువారం నాడు తల్లితో కలిసి ఆమె లక్ష్మీదేవి వ్రతం చేసింది. అయితే తల్లి పెట్టిన నైవేద్యం లక్ష్మీదేవి స్వీకరించలేదు. కూతురు పెట్టిన నైవేద్యం స్వీకరించింది.

కూతురు వేడుకుంటూ అడగ్గా ''నీ తల్లి ఎన్నో తప్పులు చేసింది.. ముఖ్యంగా నువ్వు భక్తిగా నా ప్రతిమ చేసి, పూజ చేస్తోంటే కూడా అడ్డుకునేందుకు చూసింది...'' అంటూ సెలవిచ్చింది.

కూతురు తల్లితో విషయం చెప్పి ''అమ్మా! లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పుకో.. ఇకపై ఎన్నడూ పూజను అశ్రద్ధ చేయనని, పూజ చేసుకునేవారిని అడ్డుకోనని ప్రార్ధించు'' అని చెప్పింది.

తల్లి అలాగే వేడుకుంది. నిజంగానే చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందింది.

లక్ష్మీదేవి శాంతించి ఇద్దరికీ అభయమిచ్చి అంతర్ధానం అయింది.

ఈసారి ఆమె అత్తగారి ఇల్లే కాకుండా పుట్టిల్లు కూడా సిరిసంపదలతో తులతూగింది.

అదీ కథ.

 

మార్గశిర లక్ష్మీదేవి వ్రతానికి ఆడంబరాలు ఏమీ అక్కర్లేదు. లక్ష్మి విగ్రహాన్ని పెట్టి, నైవేద్యం సమర్పించి, భక్తిగా కొలిస్తే చాలు దేవి అనుగ్రహిస్తుంది. సర్వ సంపదలూ దొరుకుతాయి.

Margashira Lakshmi Vratam, Margashira Thursday Lakshmi Pooja, Any Margashira Thursday Lakshmi Vratam, Margashira Worship of Lakshmidevi