మనాలి అంటే మనువు ఆలయమే!

 


మనాలి అంటే మనువు ఆలయమే!

 


ఈ వేసవి కాలంలో మనం ఎండలను తిట్టుకోని రోజు ఉండదు. హాయిగా ఏ కులూమనాలికో వెళ్తే బాగుండు అనుకోకుండా ఈ కాలం గడవదు. ఇంతకీ హిమాలయాల చెంత ఉన్న కులు లోయలోని మనాలికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! దీని వెనుక మత్స్యావతారం నాటి విశేషం ఉంది.

 

సృష్టిని మహాప్రళయం నుంచి రక్షించేందుకు విష్ణుమూర్తి ఎత్తిన తొలి అవతారమే మత్స్యావతారం. ఇందుకోసం ఆయన ఒక చిన్న చేపపిల్ల రూపంలో మనువు చెంతకి చేరాడు. ఆ చేప పిల్ల అంతంతకూ అమాంతంగా పెరిగిపోవడం చూసిన మనువు అది సాక్షాత్తూ దైవస్వరూపమని తెలుసుకున్నాడు. ఇంతలో ఆ చేప రూపంలో ఉన్న మహావిష్ణువు తాను వచ్చిన కార్యాన్ని చెప్పి, మహాప్రళయం తరువాత తిరిగి సృష్టి కొనసాగేందుకు మనువుకి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి ఏడో నాటికి జల ప్రళయం సంభవిస్తుందనీ, ఆ ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు ఒక పెద్ద ఓడను నిర్మించుకోమనీ మనువుని ఆదేశించాడు విష్ణుమూర్తి. ఆ ఓడలోకి మునులనూ, ఔషధాలను, జీవజాతులనూ ఎక్కించుకుని సిద్ధంగా ఉండమని సూచించాడు.

 

విష్ణుమూర్తి మాటప్రకారమే మహా ప్రళయం సంభవించడం, ఆ ప్రళయంలో మత్స్యావతార సాయంతో మనువు రూపొందించిన నావ చెక్కు చెదరకుండా నిలవడం అందరికీ తెలిసిన కథే! జలప్రళయం ముగిసేనాటికి మనువు ఎక్కడైతే అడుగుపెట్టాడో ఆ ప్రదేశమే మనాలి అని స్థానిక ఐతిహ్యం. అడుగుపెట్టడమే కాదు, ఆ ప్రదేశాన్ని తన నివాసస్థానంగా మార్చుకునే అక్కడే తపస్సునాచరించాడట. దాంతో ఈ ప్రదేశానికి ‘మనువు ఆలయం’ అన్న పేరు స్థిరపడింది. అదే క్రమంగా మనాలిగా మారింది. ఈ నమ్మకాన్ని బలపరుస్తూ అక్కడ మనువుకి ఓ అరుదైన ఆలయం కూడా ఉంది! మహాభారతంలో కూడా మనాలి ప్రస్తావన వస్తుంది. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ దిశగా వచ్చారనీ... ఇక్కడే భీముడు, హిడిండిని వివాహం చేసుకున్నారనీ చెబుతారు. అందుకు సాక్ష్యంగా మనాలిలో అరుదైన హిడింబి ఆలయం కూడా ఉంది.

- నిర్జర.