Read more!

మంగళగౌరీ వ్రతము (Mangalagouree Vratam)

 

మంగళగౌరీ వ్రతము

(Mangalagouree Vratam)

 

మన సంస్కృతి, సంప్రదాయాలు ,ఆచార వ్యవహారాలు ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ చరాచర సృష్టి సమస్తంలో దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత.అలాగే మన సంస్కృతిలోని తిథులు,నక్షత్రాలు ,వారాలు, మాసాలు, వంటివన్నీ వేటికవి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.

చాంద్రమానాన్ని పాటించే ,మన పంచాంగంలోని పన్నెండు నెలలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ, వాటిలో "శ్రావణమాసం "ఉత్కృష్టమైంది. ముఖ్యంగా శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది.మహిళలు పాటించే వ్రతాల్లో అధికశాతం ఈ మాసంలోనే ఉండటం వల్ల "వ్రతాల మాసం"గా పేరు పొందడంతో పాటు, మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా కూడా పేర్కొనబడుతుంది.

శ్రావణ మాస వ్రతాలు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది "వరలక్ష్మీ వ్రతం". ఆ తరువాత శ్రావణమాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం". దీనికే "శ్రావణ మంగళవార వ్రతం" అని,"మంగళ గౌరీ నోము" అని పేర్లు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం" కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి "అన్నా!మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప" మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే "మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు - అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?

మంగళగౌరీ వ్రతాన్నికొత్తగా పెళ్ళయిన ముత్తైదువులు చేయాలి.అంటే వివాహం జరిగిన అనంతరం వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి.శ్రావణమాసంలో వచ్చే మొదటి మంగళవారంనాడు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి, ఆ నెలలో ఎన్ని మంగళవారములు వస్తే అన్నివారాలు వ్రతాన్నిచేయాలి.ఒకవేళ ఏవైనా ఆటంకములు ఏర్పడినా ఏదైనా ఒక వారంగానీ,రెండు వారాలు గానీ చేయలేకపోతే, అందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని మన పురాణాలు సూచించాయి. శ్రావణమాసంలో ఎన్ని మంగళవారాలు చేయడానికి వీలు కలుగదో,అన్నిమంగళవారాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మంగళవారాలలో చేయవచ్చు.

అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా పెళ్ళయిన సంవత్సరం నుంచి మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేయాలి.

మంగళగౌరీ వ్రత నియమాలు

తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు.

వ్రతమును చేసేరోజు ఉదయం నిద్రలేస్తూనే ముందుగా భర్త పాదాలకు , అనంతరం తల్లిదండ్రులు , అత్తమామలు, ఇతర పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందాలి. వ్రతం ఆచరించే నాటి ముందు రోజు రాత్రి ఫలహారం భుజించి ఉపవాసం ఉండడం శ్రేష్టం. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.

వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.

వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.

వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. అయితే కొన్నిప్రాంతాల్లో మొదటి వారం ఐదు మంది, రెండవవారం పదిమంది, ఈ విధంగా రెట్టింపుతో ముత్తైదువులను ఆహ్వానించి వాయనములు ఇచ్చే ఆచారం ఉంది .ఇది చేసేవారి శక్తిని బట్టి ఉంటుంది.

ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.

పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు

పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం

వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.

మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.

పైన చెప్పినటువంటివే ప్రస్తుతం "మంగళగౌరీ" విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి. ఈ మంగళగౌరీ దేవికి వెనుక భాగాన గౌరీదేవి ఫొటోను కూడా ఉంచుకోవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి. గౌరీదేవి ఫొటో దొరకని వారు పార్వతీదేవి రూపాలకు చెందిన ఫొటోలను పెట్టుకోవచ్చు.

మంగళగౌరీ వ్రత విధానం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నేపశాంతయే.

(అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయాలి)

ఓం కేశవాయ స్వాహా: (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)

ఓం నారాయణ స్వాహా:

ఓం మాధవాయ స్వాహా:

ఓం గోవిందాయనమ: (చేతులు కడుక్కోవాలి)

ఓం విష్ణవేనమ: (కళ్ళు తుడుచుకోవాలి)

ఓం మధుసూదనాయ నమ:

ఓం త్రివిక్రమాయ నమ:

ఓం వామనాయ నమ:

ఓం శ్రీధరాయ నమ:

ఓం హృషీకేశాయ నమ:

ఓం పద్మనాభాయ నమ:

ఓం సంకర్షణాయ నమ:

ఓం వాసుదేవాయ నమ:

ఓం ప్రద్యుమ్నాయ నమ:

ఓం అనిరుద్ధాయ నమ:

ఓం పురుషోత్తమాయ నమ:

ఓం అధోక్షజాయ నమ:

ఓం నారసింహాయ నమ:

ఓం అచ్యుతాయ నమ:

ఓం జనార్దనాయ నమ:

ఓం ఉపేంద్రాయ నమ:

ఓం హరయే నమ:

ఓం శ్రీకృష్ణాయ నమ: (కొంచం నీళ్ళను చేతిలోకి తీసుకుని నేలపై చిలకరిస్తూ)

“ ఉత్తిష్టంతు భూచపిశాచా: యేతే భూమి భారకా:

యేతేషామ విరోథేన బ్రహ్మకర సమారభే !! ” (అనే శ్లోకాన్ని పఠించాలి)

“ ఓం భూ: ఓం భువ: ఓం సువ: ఓం మహ:

ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్ సవితుర్వరేణ్యుం 

భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్

ఓం మపోజ్యోతి ఈరసోమృతం బ్రహ్మ భుర్భవస్సురోమ్ "

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్యబ్రహ్మాణ: ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత్ వర్షే, భరతఖండే, మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య....(శ్రీ శైలానికి, వ్రతం చేసే వారి ఊరు ఏ దిక్కులో ఉందో, ఆ దిక్కుని చెప్పాలి.) ప్రదేశే, కృష్ణా, కావేరి మధ్యప్రదేశే ( ఏ నదుల మధ్య ప్రాంతంలో వుంటే ఆ నదుల పేర్లు చెప్పాలి)

స్వశోభన గృహే, సమస్త దేవతా, బ్రాహ్మణ, హరిహర సన్నిథౌ, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీపార్థివ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్ల కృష్ణ పక్షే...తిథౌ (తిథి పేరు)....వాసరే (వారం పేరు).... శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ, శ్రీమత్యా: గోత్రస్య, శర్మణ: ధర్మపత్నీ శ్రీమతీ...గోత్రవతీ (గోత్రం పేరు)... నామధేయవతి (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే...(నీటిని విడవాలి)

ఈ విధంగా సంకల్పం చెప్పుకొన్న తర్వాత కలశపూజ చేయాలి.

కలశ పూజ

పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును గానీ, పంచపాత్రను గానీ తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడు వైపులా గంధాన్నిరాసి, కుంకుమను పెట్టాలి.

ఈ విధంగా చేసి, దానిపై కుడిచేయి నుంచి క్రింది శ్లోకాన్ని పఠించాలి.

కలశస్య ముఖే విష్ణు కంఠే ఋద్రసమాశ్రిత:

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రుగణ: స్థితా:

కుక్షౌ తుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామ వేదో హ్యధర్వణ :

అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితా:

ఆయాంతు గణపతి పూజార్ధం దురితక్షయకారకా:

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధూకావేర జలేస్మిన్ సన్నిధిం కురు !!

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచ భగవంతుని పైన, పూజాద్రవ్యముల పైన, పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి.

(గమనిక: పూజలో అవసరమైన సమయంలో ఈ కలశంలోని నీటినే ఉపయోగించాలి. ఆచమనం చేసేందుకు ఉపయోగించే జలాన్ని పూజకు ఉపయోగించరాదు. అలాగే కలశంలోని నీటిని ఆచమనమునకు ఉపయోగించరాదు. ఏ వ్రతంలోనైనా, పూజలోనైనా ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమం)

కలశపూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకుని, మండపంలో తమలపాకు పై నుంచి, వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి.

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే.

"వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కరుమేదేవో సర్వ కార్యేషు సర్వదా !!”

ఆగచ్ఛ వరసిద్ధి వినాయక, అంబికా ప్రియనందన

పూజా గృహణ సుముఖ, నమస్తే గణానాయక"

ఓం సుముఖాయ నమ:

ఓం ఏకదంతాయ నమ:

ఓం కపిలాయ నమ:

ఓం గజకర్ణికాయ నమ:

ఓం లంబోదరాయ నమ:

ఓం వికటాయ నమ:

ఓం విఘ్నరాజా రాయనమ:

ఓం గణాధిపాయ నమ:

ఓం ధూమకేతవే నమ:

ఓం వక్రతుండాయ నమ:

ఓం గణాధ్యక్షాయ నమ:

ఓం ఫాలచంద్రాయ నమ:

ఓం జగాననాయ నమ:

ఓం శూర్పకర్ణాయ నమ:

ఓం హేరంబాయ నమ:

ఓం స్కంద పూర్వాజాయ నమ:

ఓం శ్రీ మహాగణాథిపతయే నమ:

నానావిథ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి.

ఓం శ్రీ మహాగణాథిపతయే నమ:ధూపం ఆఘ్రాపయామి.

ఓం శ్రీ మహాగణాథిపతయే నమ: దీపం దర్శయామి.

(అనంతరం స్వామీ వారి ముందు పండ్లుగాని బెల్లాన్ని గాని నైవేద్యంగా ఉంచాలి).

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం ,

భర్గోదేవస్య థీమహి థియోయోన:, ప్రచోదయాత్...

(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.( కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

నీరాజనానంతరం, ఆచమనీయం సమర్పయామి.!

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా

సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

తోర పూజ

తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.