కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు....5
కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు ....5
మహబూబ్ నగర్ జిల్లా – 2
జటప్రోలు
మహబూబ్ నగర్ నుంచి పెబ్బేరు – కొల్హాపూర్ (మహబూబ్ నగర్ జిల్లా) మార్గంలో వెళ్తుంటే వస్తుంది జటప్రోలు. పెబ్బేరు నుంచి 38 కి.మీ. లు వుంటుంది. ఇక్కడ మదన గోపాల స్వామి ఆలయం వున్నది. 16వ శతాబ్దంలో చోళులు కట్టించారు. ఇది వరకు వున్న చోట ఆలయం 1982లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించే సమయంలో కృష్ణానదిలో మునుగుతుందని ఆ ఆలయాలను ఇక్కడ అలాగే పునర్నిర్మించారు.
ఆలయం గోపురం చాలా పెద్దది. విశాలమైన ఆవరణ. గోపురం దాటితే ఉన్నతమైన ధ్వజస్తంభం దర్శించుకున్నాక, ముందుగా విశాలమైన మండపంలోకి అడుగుపెడతాము. ఈ మండపం అనేక స్తంభాలతో అలరారుతున్నది. ఆ స్తంభాలమీద అపురూపమైన శిల్పకళ వున్నది. ఈ మండపం దాటిన తర్వాత మరి ఒక చిన్న మండపం, తర్వాత గర్భగుడి. అందులో రుక్మిణీ, సత్యభామా సమేతంగా మదన గోపాలస్వామి దర్శనమిస్తాడు. స్వామి నాలుగు అడుగుల ఎత్తున్న నల్లరాతి విగ్రహం. పక్కన దేవేరులు.
దర్శన సమయాలు
ఉదయం 7 గం. ల నుంచి 11-30 దాకా, సాయంత్రం 5-30 నుంచీ 7 గం. ల దాకా.
ఇక్కడ భక్తుల రద్దీ వుండకపోవటంతో ఉత్సవ సమయాలలో తప్ప విడి సమయాలలో మీరు వెళ్ళేటట్లయితే, పూజారిగారికి ఫోన్ చెయ్యండి. ఆయన పేరు ...శ్రీ నరసింహమూర్తి సెల్ నెంబరు 9963873108
శివాలయం
అక్కడనుంచీ పక్కనే వున్న శివాలయాలకి వెళ్ళాము. ఈ ఆలయాల సమూహంలో ఒక ఆలయంలో మాత్రమే పూజ జరుగుతోంది. ఇక్కడికి భక్తులెవరూ రాకపోవటంతో ఎవరూ లేరు.
కొల్లాపూర్
జటప్రోలునుంచీ కొల్లాపూర్ 14 కి.మీ.ల దూరంలో వున్నది. ఇక్కడ మాధవస్వామి ఆలయం వున్నది. మేము వెళ్ళేసరికి 12 గం. లవటంతో ఆలయం మూసి వున్నది. ఇది కూడా శ్రీశైలం ప్రాజెక్టులో ముంపుకు గురవటంతో ఇక్కడ పునర్నిర్మింపబడింది.
ఇటీవలే పునర్నిర్మించిన ఈ ఆలయాల చరిత్ర, వాటిని ఎక్కడనుంచి తెచ్చి ఇక్కడ నిర్మించిందీ, బోర్డులు రాసి పెట్టి వుంటే బాగుండేది అనిపించింది. వీటిని పర్యాటక కేంద్రాలుగా అభివృధ్ధి చెయ్యటానికి అనువుగా వున్నా, వీటి గురించి కనీస ప్రచారం కూడా లేకుండా వున్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇవి కొంత వెలుగులోకి వచ్చాయి. ఒక్క కొల్లాపూర్ మాధవస్వామి దగ్గర పునర్నిర్మింపబడిన సంవత్సరం, దర్శన సమయాల గురించి చిన్న బోర్డు పెట్టబడింది. ఈ నిర్లక్ష్యం వలననే చరిత్ర కనుమరుగవుతోంది, అద్భుతాలు నామ రూపాలు లేకుండా పోతున్నాయి.
మేము వెళ్ళి వచ్చిన తర్వాత సేకరించిన సమాచారం ఈ ఆలయాన్ని ముందు కొల్లాపూర్ దగ్గరలో వున్న కృష్ణానది తీరాన వున్న మంచాలకట్ట దగ్గర నిర్మించారు. దీనిని 16వ శతాబ్దంలో కొల్లాపూర్ సంస్ధానీశుడు సురభి మాధవరాయలు నిర్మించారు. శ్రీశైలం ఆనకట్ట ముంపు వల్ల, 1989లో ఆ రాళ్ళన్నింటినీ తీసుకువచ్చి ఇక్కడ యధాతధంగా ఆలయాన్ని పునర్నిర్మించారు.
సోమశిల
కొల్లాపూర్ నుంచి సోమశిల 9 కి.మీ.ల దూరం వుంటుంది. కొల్లాపూర్ చౌరస్తానుంచి సరాసరి వెళ్తే వస్తుంది. దోవ సన్నగా వుంటుంది. సోమశిల వెళ్ళగానే ముందు కృష్ణ ఒడ్డుకి వెళ్ళాము. రైతులు అక్కడక్కడా ఎండు మెరపకాయలు ఆరబోసుకున్నారు. ఎక్కడో ఒకరు తప్ప మనిషి జాడలేదు. ఎవరూ లేరు, బలే బాగుంది, హాయిగా కృష్ణలో స్నానం చెయ్యచ్చు అని నీళ్ళ దగ్గరకి వెళ్ళాము. నీళ్ళు చాలా లోపలకున్నాయి. ఒడ్డునుంచి అక్కడిదాకా అంతా రాళ్ళమయం. చాలా కోసుగా వున్నాయి రాళ్ళు. ఏ కొంచెం అజాగ్రత్తగా వున్నా కాళ్ళు ఫట్. అలాగే కష్టపడి వెళ్ళాం. తీరా నీళ్ళల్లోకి దిగాక అంతా ఒండ్రు. కాలు పెడితే నీళ్ళు బురదగా అవుతున్నాయి. అలాగే స్నానం చేశాం. తర్వాత అక్కడ ఒకాయన చెప్పారు, అవి నిలవ నీళ్ళని, అవతల స్నాన ఘాట్ వుంది అక్కడికెళ్ళాలి స్నానానికి అని. ఏమీ తెలియకుండా వెళ్తే ఇలాంటి ఘన కార్యాలు కూడా చెయ్యచ్చు కదా
సరే స్నాన కార్యక్రమం అయింది. అది మా ప్రయాణంలో రెండో రోజు. ముందు రోజు ఇంటి నుంచి తెచ్చుకున్న్ ఆహార పదార్ధాలు చాలామటుకు అయిపోయాయి. మిగిలిన పూరీ, పులిహోర అమృతంలా భావించి తిన్నాము. అక్కడ ఏమీ దొరకవు మరి. అక్కడనుంచి శ్రీ లలితా సోమేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళేసరికి 2-20 అయింది. ఇవి కూడా చిన్న ఆలయాల సమూహం. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలకు, శ్రీ లలిత అమ్మవారికి వేరు వేరు ఆలయాలు వున్నాయి. జ్యోతిర్లింగాల ముందు విశాలమైన మంటపం, స్తంభాల మీద శిల్పకళ. చాలా ప్రశాంతంగా అనిపించింది. మా స్నేహితురాళ్ళు ఆ ప్రశాంత వాతావరణంలో గొంతెత్తి హాయిగా భక్తి గీతాలు పాడసాగారు. కొంత సేపు అలా భక్తి తరంగాలలో తేలిపోయాక ఆలస్యమవుతోందని వాళ్ళని బలవంతాన బయల్దేరతియ్యాల్సి వచ్చింది.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)