మధ్యలో వెలసి ప్రథముడైన గణపతి
మధ్యలో వెలసి ప్రథముడైన గణపతి
పురాణకాలంలో బృహస్పతి, మరుద్గణాలు కలిసి వినాయకులు అయ్యారు. ఇలా రూపొందిన దేవతలకు ఒక్కో పురాణంలో ఒక్కో విధమైన పేరు కనిపిస్తుంది. అలాగే ఆయా పౌరాణికులను బట్టి గణపతుల రూపురేఖలు కూడా మారడం చూస్తాం. వినాయకుల ఆయుధాల్లోనూ తేడా ఉంది. అంతే కాదు, ఆభరణాలు, వాహనాలు, అలంకరణలు - అన్నిటిలో పోలికలతో బాటు వైరుధ్యాలు కనిపిస్తాయి.
''తైత్తరీయ సంహిత, ఇంకా వాజసనేయ సంహితలలో గణపతి అభినందన ఇలా సాగుతుంది.
''నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వోనమః''
- ఈ మంత్రానికి సాయణులు ''దేవతలను అనుసరించు భూత విశేషాలైన గణాలు, వాటి యజమానుడైన గణపతికి నమస్కారం'' - అంటూ వ్యాఖ్యానించారు.
మహీధరులు ''వాజసనేయ సంహిత'' భాష్యంలో - ''దేవాను చరాభూత విశేష గణాస్తేభ్యో నమః గణానాం పాలకా గణపతయస్తేభ్యోవో నమః'' - అంటూ వివరించారు.
ఋగ్వేద బృహస్పతి, మరుద్గణాలు, ఇంద్రుని గుణాలు, శక్తులు కలిసి రూపొందిన దేవుడే వినాయకుడు అనేది ప్రసిద్ధ కధనం. ఋగ్వేద బృహస్పతి మరుత్తులు గజముఖ గణపతిగా అవతరించడానికి ముందే వినాయకులను ఏకదంత, దంతి అని వేర్వేరు పేర్లతో కనిపిస్తాడు. కాలక్రమంలో సారూప్యాలు ఎక్కువ ఉన్న గణపతి విస్తృత ప్రచారంలోకి వచ్చింది. అదే ప్రస్తుతం మనమంతా ఆరాధిస్తున్న గజాననుని రూపం.
కనుక గజముఖుడు ఆది దేవుడు కాదు. అనంతర కాలంలో వెలసిన దేవుడు. ఈ వినాయకుడు ప్రసిద్ధుడు కావడానికి అనేక శతాబ్దాలు పట్టింది. అయితేనేం, తర్వాతి కాలంలో గణపతి దేవునికి విపరీతమైన ఖ్యాతి లభించింది. మధ్యలో వెలసిన దేవుడు మహా ముఖ్యుడయ్యాడు. గణపతి ప్రథముడయ్యాడు. అంతే కాదు, గణనాథుడు దేవతలకే దేవుడయ్యాడు. అవును మరి, సామాన్య మానవులే కాదు, దేవతలు సైతం ఏ పని ప్రారంభించాలి అన్నా వినాయకుని పూజించాల్సిందే.. లేకుంటే ఎంతటివారైనా విఘ్నాలు ఎదుర్కోవాల్సిందే- అంటూ పురాణ కధలు ఉన్నాయి. అదీ విఘ్నేశ్వరుని గొప్పతనం.