శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకము చేరుట

 

శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకము చేరుట

శ్రీహరి భృగుమునికి చేసిన సన్యాసమునకు లక్ష్మీదేవి అలిగి దివిని విడచి భువికి చేరుటచే వైకుంఠంలో దరిద్రదేవత తాండవించుచుండెను. వైకుంఠము జ్యోతిలేని మందిరము అయింది. వైకుంఠవాసులు నారాయణుని దగ్గరకు వచ్చి ఎలాగైనా లక్ష్మీదేవిని వైకుంఠంనకు పంపించు భారము మీదే అని చెప్పారు. శ్రీ మహావిష్ణువునకు ఏమి చేయాలో తోచక భూలోకము వచ్చి  చెట్లనక, గుట్టలనక, మిట్టలనక తిరిగి తిరిగి చివరకు ఆహారము లేక "లక్ష్మీ, లక్ష్మీ" అని తలచుకుంటూ మయూర, మర్కట, జంతు జాలములతోను, గజ, సింహ, శార్దూల, భల్లూక రాజములతో లక్ష్మీదేవిని ఎక్కడైనా చూశారా అని అడుగుతూ, కొండలు, కోణలు, రాజ్యాలు వెతుకుతూ, చివరకు ఎక్కడ కనపడలేదు. శ్రీమహావిష్ణువు తిరుమల - తిరుపతిలో ఆదివరాహుని క్షేత్రం చేరి చింతచెట్టు కింద ఉన్న పాము పుట్టలో చేరి లక్ష్మీదేవిని ధ్యానము చేస్తూ తపస్సులో నిమగ్నుడయ్యాడు.

లక్ష్మీవద్దకు వెళ్ళి నారదుడు, నారాయణుని పరిస్థితిని వివరించుట
వైకుంఠము పాడుపడిన వార్త నారదమహర్షి విని సత్యలోకానికి వెళ్ళి తన తండ్రిగారైన బ్రహ్మదేవునితో "జనకా మీరు నాకు చెప్పిన మేరకు శ్రీమహావిష్ణువు భూమియందు అవతరించునట్లు చేశాను. అందువల్ల లక్ష్మీనారాయణులకు దూరమై లక్ష్మీదేవి కొల్హాపురంలో తపస్సు చేస్తుంది. శ్రీహరి ఆదివరాహ క్షేత్రమునందు ఒక పాము పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక ఉన్నాడు. కనుక మీరు ఎలాగైనా శ్రీమన్నారాయణమూర్తికి ఆహారము సమకూర్చవలసినది" అని ప్రార్థించెను.

 బ్రహ్మదేవుడు నారదుని లక్ష్మీదేవి వద్దకు పంపి, తాను కైలాసము చేరాడు. మహేశ్వరుడు బ్రహ్మను గౌరవించి విశేషము లేమని ప్రశ్నించెను. పితామహుడు శంకరునితో "శివా ! లక్ష్మీనారాయణుల కలహమునకు కారణములు నీలకంఠునకు చెప్పి, ప్రస్తుతము నారాయణుడు నిద్రాహారములు లేక యువవాసములు చేయుచున్నాడు. మనమిద్దరము ఆవుదూడ రూపములు ధరించి విష్ణువుకు ఆహారముగాపాలును ఇస్తే కొంత మేలు కలుగుతుంది" అనెను. ఆ మాటలు విని శివుడు సంతోషించాడు.